ప్రిక్వార్టర్స్‌లో సైనా, జయరామ్
సారావక్ (మలేసియా): ఈ ఏడాది ఆడుతున్న తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ఈ హైదరాబాద్ క్రీడాకారిణి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సైనా 21–9, 21–8తో చాసిని కొరెపాప్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. కేవలం 25 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ సైనాకు పోటీ ఎదురుకాలేదు. తొలి గేమ్‌లో సైనా ఒకసారి వరుసగా ఏడు పాయింట్లు, మరోసారి వరుసగా ఐదు పాయింట్లు గెలిచింది. రెండో గేమ్‌లోనూ సైనా పూర్తి ఆధిపత్యం చలాయించింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో హనా రమాదిని (ఇండోనేసియా)తో సైనా ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ అజయ్ జయరామ్ (భారత్) ఒకే రోజు రెండు మ్యాచ్‌లు గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. తొలి రౌండ్‌లో జయరామ్ 21–10, 17–21, 21–14తో క్వాలిఫయర్ జున్ హావో లియోంగ్ (మలేసియా)పై, రెండో రౌండ్‌లో 21–9, 21–12తో సపుత్ర విక్కీ (ఇండోనేసియా)పై గెలిచాడు.
సుమిత్ జంట ముందంజ
పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమిత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 15–21, 21–13, 21–18తో జియా హువో చెన్–చున్ కాంగ్ షియా (మలేసియా) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించగా... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 11–21, 15–21, 24–26తో చీ తీన్ తాన్–వీ జీన్ తాన్ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల–మనూ అత్రి (భారత్) జంట 21–19, 21–18తో లుఖి నుగ్రోహో–రిరిన్ అమెలియా (ఇండోనేసియా) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.