జయరామ్ సంచలనం
సియోల్:కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ లోభారత స్టార్ ఆటగాళ్ల నిష్ర్కమించినా.. అజయ్ జయరామ్ అంచనాల మించి రాణిస్తున్నాడు. శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో జయరామ్ 21-19, 21-15 తేడాతో వరల్డ్ ఏడో ర్యాంక్ ఆటగాడు చౌ తెన్ చెన్(చైనీస్ తైపీ) )పై ఘన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్న జయరామ్.. చౌ చెన్ ను వరుస సెట్లలో మట్టికరిపించాడు. కేవలం 43 నిమిషాల వ్యవధిలోనే జయరామ్ సెమీ ఫైనల్ పోరును ముగించాడు. ప్రస్తుత సీజన్ లో ఇదే ప్రత్యర్థిని జర్మన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ లలో బోల్తా కొట్టించిన జయరామ్ అదే ఊపును కొరియన్ ఓపెన్ లో కూడా కొనసాగించాడు. తొలి గేమ్‌లో జయరామ్ 11-8తో ముందంజంలో పయనించినా.. ఆ తరువాత కాస్త వెనుకబడ్డాడు. అయితే ఎట్టకేలకు తొలి సెట్ ను గెలుచుకున్న జయరామ్ ఆధిక్యం సంపాదించాడు.
ఆ తదుపరి సెట్ లో తొలుత 3-0 తో జయరామ్ ఆధిక్యం సాధించినా.. తరువాత తేరుకున్న చెన్ వరుస పాయింట్లు సాధించాడు. ఓ దశలో రెండో సెట్ కోసం ఇరువురి మధ్య సాగిన పోరు ఉత్కంఠను రేపింది. జయరామ్ -చెన్ ల స్కోరు 12-12 వద్ద ఉండగా వీరిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. కాగా, ఆ తరువాత చెన్ 15-14 తో ముందుకు దూసుకువెళ్లాడు. ఇలా ఇరువురి మధ్య కాసేపు దోబుచులాడిన రెండో సెట్ ను జయరామ్ కైవసం చేసుకుని చెన్ కు చెక్ పెట్టాడు. ఈ తాజా గెలుపుతో జయరామ్ తుదిపోరులో చెన్ లాంగ్ తో తలపడనున్నాడు.
శుక్రవారం జరిగిన పురుషుల క్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ 32వ ర్యాంకర్ జయరామ్ 21-19, 16-21, 21-16తో ప్రపంచ 26వ ర్యాంకర్ షో ససాకి (జపాన్)పై అద్భుత విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. ఇటీవల డచ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గిన జయరామ్... ఈ సీజన్‌లో మలేసియా, స్విస్, రష్యా ఓపెన్ టోర్నీల్లో సెమీస్‌కు చేరాడు.