అజయ్ సంచలనం
అజయ్ సంచలనం
Published Tue, Aug 6 2013 1:41 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
సింగిల్స్‌లో సంతోషం... డబుల్స్‌లో నిరాశ... క్లుప్తంగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఇదీ తొలిరోజు భారత ప్రదర్శన. ప్రపంచ 13వ ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్‌ను దాటేందుకు తీవ్రంగానే శ్రమించాడు. మరోవైపు భారత్‌కే చెందిన ప్రపంచ 24వ ర్యాంకర్ అజయ్ జయరామ్ పట్టుదలగా పోరాడి ప్రపంచ 12వ ర్యాంకర్ వింగ్ కీ వోంగ్ (హాంకాంగ్)ను బోల్తా కొట్టించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. మహిళల డబుల్స్‌లో తెలుగు అమ్మాయి సిక్కి రెడ్డి-అపర్ణ బాలన్; అశ్విని పొన్నప్ప-ప్రద్న్యా గాద్రె .. మిక్స్‌డ్ డబుల్స్‌లో తెలుగు కుర్రాడు కోనా తరుణ్-అశ్విని పొన్నప్ప; అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ జోడిలు తొలి రౌండ్‌లోనే ఓడిపోయాయి. మంగళవారం పురుషుల డబుల్స్‌లో తొలి రౌండ్ మ్యాచ్ ఆడాల్సిన తరుణ్-అరుణ్ విష్ణు జంటకు ‘వాకోవర్’ లభించగా... గాయం కారణంగా ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ జోడి వైదొలిగింది.
వింగ్ కీ వోంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజయ్ 22-20, 17-21, 21-15తో విజయం సాధించాడు. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో అజయ్ 20-16తో ఆధిక్యంలో ఉన్నా వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయాడు. దాంతో స్కోరు 20-20తో సమమైంది. ఈ దశలో అజయ్ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో అజయ్ 13-8తో ఆధిక్యంలో ఉండి ఆ తర్వాత వెనుకబడిపోయాడు. వరుస పొరపాట్లతో రెండో గేమ్‌ను చేజార్చుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో అజయ్ తేరుకొని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా స్థిరమైన ఆటతీరును ప్రదర్శించి ఆరు పాయింట్ల తేడాతో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.
ప్రపంచ 98వ ర్యాంకర్ రౌల్ మస్త్ (ఎస్తోనియా)తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ 19-21, 21-14, 21-9తో గెలిచాడు. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్‌కు తొలి రెండు గేముల్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలి గేమ్‌ను కోల్పోయిన ఈ హైదరాబాదీ రెండో గేమ్‌లో తేరుకున్నాడు. మూడో గేమ్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. 8-9తో వెనుకబడి ఉన్న దశలో కశ్యప్ చెలరేగిపోయాడు. నమ్మశక్యం కాని రీతిలో వరుసగా 13 పాయింట్లు నెగ్గి 21-9తో గేమ్‌ను కైవసం చేసుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. బుధవారం జరిగే రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పీటర్ కౌకల్ (చెక్ రిపబ్లిక్)తో కశ్యప్; పాబ్లో ఎబియన్ (స్పెయిన్)తో అజయ్ జయరామ్ ఆడతారు.
మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో తరుణ్-అశ్విని పొన్నప్ప 18-21, 21-12, 19-21తో హషిమోటో-మియూకి మయెదా (జపాన్) చేతిలో; అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ 15-21, 17-21తో మిన్ చున్ లియో-హువాన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి-అపర్ణ బాలన్ 15-21, 17-21తో లారెన్ స్మిత్-గాబ్రియెలా వైట్ (ఇంగ్లండ్) చేతిలో; అశ్విని పొన్నప్ప-ప్రద్న్యా గాద్రె 23-21, 18-21, 17-21తో లైన్ క్రుస్-మేరీ రోప్కె (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యారు.
Advertisement
Advertisement