ఫైనల్లో జయరామ్ కు నిరాశ
సియోల్:కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ లో భాగాంగా తొలిసారి సూపర్ సిరీస్ ఫైనల్ కు చేరుకున్నభారత బ్యాడ్మింటన్ ఆటగాడు అజయ్ జయరామ్ కు నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో జయరామ్ 14-21,13-21 తేడాతో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, ప్రపంచ చాంపియన్, డిఫెండింగ్ చాంపియన్ చెన్ లాంగ్(చైనా) చేతిలో ఓటమి చెందాడు. భారత స్టార్ ఆటగాళ్లు నిష్ర్కమించిన చోట తన పూర్వవైభవాన్ని చాటుకుంటూ ఫైనల్ కు చేరిన జయరామ్ ఫైనల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. జయరామ్ వరుస సెట్లను చెన్ లాంగ్ కు అప్పగించి రన్నరప్ గా సరిపెట్టుకున్నాడు.
ఈ టోర్నీ ఆద్యంతం అంచనాలు మించి రాణించిన జయరామ్ ఫైనల్లో మాత్రం చెన్ దాటికి తలవంచక తప్పలేదు. అన్ సీడెడ్ క్రీడాకారుడిగా బరిలోకి దిగిన జయరామ్ తొలి గేమ్ లో వరుసగా పాయింట్లు సాధించి ఆధిక్యం దిశగా దూసుకెళ్లినా.. స్కోరు 4-4 వద్ద ఉండగా చెన్ లాంగ్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో చెన్ 9-5 తో ముందంజ వేసి అదే ఊపును కడవరకూ కొనసాగించి సెట్ ను చేజిక్కించుకున్నాడు. అయితే రెండో సెట్ లో జయరామ్ చేసిన అనవసర తప్పిదాలను చెన్ ఉపయోగించుకున్నాడు. ఈ మ్యాచ్ లో లాంగ్ అద్భుతమైన ఎఫెన్స్, డిఫెన్స్ తో జయరామ్ కు కళ్లెం వేసి మరోసారి కొరియన్ సూపర్ సిరీస్ విజేతగా అవతరించాడు. దీంతో విజేత చెన్ లాంగ్‌కు 45 వేల డాలర్లు (రూ. 29 లక్షల 64 వేలు), రన్నరప్ అజయ్ జయరామ్‌కు 22 వేల 800 డాలర్లు (రూ. 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
ఇదిలా ఉండగా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఆధ్వర్యంలో 2007లో సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లు ప్రారంభమైన తర్వాత... భారత్ నుంచి సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న మూడో ప్లేయర్‌గా జయరామ్ గుర్తింపు పొంది అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు భారత్ నుంచి సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ సూపర్ సిరీస్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకున్న వారిలో ఉన్నారు.