Chen Long
-
శ్రీకాంత్ ఆట ముగిసె...
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ప్రపంచ చాంపియన్, మాజీ నంబర్‌వన్ పూసర్ల వెంకట సింధు ముందంజ వేసింది. పురుషుల కేటగిరీలో శ్రీకాంత్ ఆట తొలి రౌండ్‌తోనే ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్ పోరులో స్టార్ షట్లర్, ఆరో సీడ్ సింధు 21–14, 21–17తో బీవెన్ జాంగ్ (అమెరికా)పై గెలుపొందింది. ఈ పోరులో సింధు నిలకడైన ఆటతీరు కనబరిచింది. ఆఖరి దాకా పైచేయి సాధించిన భారత స్టార్ వరుస గేముల్లో 42 నిమిషాల్లో ఈ ఆటను ముగించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 15–21, 16–21తో చైనాకు చెందిన మూడో సీడ్ చెన్ లాంగ్ చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ మొదటి రౌండ్లో సిక్కిరెడ్డి–ప్రణవ్ జెర్రి చోప్రా ద్వయం 13–21, 21–11, 17–21తో చైనా టాప్ సీడ్ ద్వయం జెంగ్ సి వీ– హ్యుయంగ్ య కియోంగ్ చేతిలో పరాజయం పాలైంది. అయితే మహిళల డబుల్స్‌లో మాత్రం సిక్కి–అశ్విని పొన్నప్ప జంట ముందంజ వేసింది. భారత జోడీ 5–4తో ఆధిక్యంలో ఉన్న దశలో జెన్నీ మూర్–విక్టోరియా విలియమ్స్ (ఇంగ్లండ్) జంట రిటైర్డ్‌హర్ట్‌గా తప్పుకుంది. -
అయ్యో...శ్రీకాంత్!
హాంకాంగ్: తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) నుంచి వాకోవర్ లభించడం... కీలక క్వార్టర్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) గాయంతో వైదొలగడం... వెరసి ఎనిమిది నెలల తర్వాత ఓ టోర్నీ లో సెమీఫైనల్ చేరే అవకాశం దక్కించుకున్న భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఆ అడ్డంకిని దాటలేకపోయాడు. హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ భారంగా నిష్క్రమించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ శ్రీకాంత్ 9–21, 23–25తో ప్రపంచ 27వ ర్యాంకర్ లీ చెయుక్ యియు (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. తొలి గేమ్‌లోనైతే పూర్తిగా గతి తప్పిన అతను రెండో గేమ్‌లో తేరుకున్నాడు. నిలకడగా ఆడుతూ ఒకదశలో 20–15తో ఐదు గేమ్ పాయింట్లను సంపాదించాడు. మరో పాయింట్ గెలిస్తే మ్యాచ్‌లో నిలిచే స్థితిలో తీవ్ర ఒత్తిడికి లోనైన ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ వరుసగా ఐదు పాయింట్లు చేజార్చుకున్నాడు. స్కోరు 20–20తో సమమైన దశలో శ్రీకాంత్ మళ్లీ పాయింట్ గెలిచి 21–20తో ఆధిక్యంలోకి వెళ్లాడు. 21–21తో స్కోరు మళ్లీ సమమయ్యాక శ్రీకాంత్ మరో పాయింట్ గెలిచి 22–21తో ఏడోసారి గేమ్ పాయింట్ సంపాదించాడు. అయితే లీ చెయుక్ పట్టుదలతో పోరాడి స్కోరును 22–22తో, ఆ తర్వాత 23–23తో సమం చేశాడు. ఈ దశలో లీ చెయుక్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకొని ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. సెమీస్‌లో ఓడిన శ్రీకాంత్‌కు 5,800 డాలర్ల (రూ. 4 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,420 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఇప్పటి వరకు ఈ ఏడాది 14 టోర్నమెంట్లలో పాల్గొన్న శ్రీకాంత్... ఐదు టోరీ్నల్లో క్వార్టర్ ఫైనల్‌కు, మూడు టోరీ్నల్లో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు, ఒక టోరీ్నలో ఫైనల్‌కు, మరో టోరీ్నలో సెమీఫైనల్‌కు చేరుకొని నాలుగు టోరీ్నల్లో తొలి రౌండ్లో ని్రష్కమించాడు. ఈ సీజన్లో మరో రెండు టోరీ్నలకు శ్రీకాంత్ ఎంట్రీలను పంపించాడు. ఈనెల 19 నుంచి 24 వరకు జరిగే కొరియా మాస్టర్స్ టోర్నీలో, ఈనెల 26 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగే సయ్యద్ మోడీ టోర్నమెంట్లో కిడాంబి శ్రీకాంత్ బరిలోకి దిగుతాడు. -
సిడ్నీ వాకిట్లో...‘శ్రీ’ వెలుగులు
-
సిడ్నీ వాకిట్లో...‘శ్రీ’ వెలుగులు
♦ విశ్వవిజేత, రియో ఒలింపిక్స్ చాంపియన్‌పై శ్రీకాంత్ అద్భుత విజయం ♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ కైవసం ♦ వారం వ్యవధిలో రెండో సూపర్ సిరీస్ టైటిల్ ♦ రూ. 36 లక్షల 28 వేల ప్రైజ్‌మనీ సొంతం మరో సంచలనం... మరో టైటిల్... ప్రత్యర్థి ఎవరైతే నాకేంటి అంటూ... భారత నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ అంతర్జాతీయ వేదికపై మళ్లీ అద్భుతం చేశాడు.వారం వ్యవధిలో రెండో సూపర్ సిరీస్ టైటిల్‌ను గెలిచాడు. శ్రీకాంత్ ధాటికి ఈసారి ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ చేతులెత్తేశాడు. సిడ్నీ: ఇటీవల కాలంలో తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారులపై తాను సాధిస్తున్న విజయాలు గాలివాటమేమీ కాదని భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ మళ్లీ నిరూపించాడు. ఆదివారం ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ విజేతగా అవతరించాడు. 46 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ 22–20, 21–16తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్ లాంగ్ (చైనా)ను బోల్తా కొట్టించాడు. విజేతగా నిలిచిన శ్రీకాంత్‌కు 56,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 36 లక్షల 28 వేలు)తోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. వారం వ్యవధిలో శ్రీకాంత్‌కిది రెండో సూపర్ సిరీస్ టైటిల్ కావడం విశేషం. ఈనెల 18న శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్‌ను నెగ్గిన సంగతి విదితమే. ఓవరాల్‌గా శ్రీకాంత్ కెరీర్లో ఇది నాలుగో సూపర్ సిరీస్ టైటిల్. 2014లో అతను చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో, 2015లో ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచాడు. సాధికారిక ఆటతీరు... చెన్ లాంగ్‌తో గతంలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన శ్రీకాంత్ ఈసారి మాత్రం పూర్తిగా పైచేయి సాధించాడు. ఒత్తిడికి లోనుకాకుండా, సహజశైలిలో, సంయమనంతో, పక్కా ప్రణాళికతో ఆడితే చైనా స్టార్ ఆటగాళ్లను ఓడించడం సాధ్యమేనని శ్రీకాంత్ నిరూపించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నంబర్‌వన్ సన్ వాన్ హో (కొరియా), క్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ (భారత్), సెమీస్‌లో నాలుగో ర్యాంకర్ షి యుకి (చైనా)లను ఓడించిన శ్రీకాంత్ ఫైనల్లో కూడా జోరు కొనసాగించాడు. ఆరంభంలోనే 5–1తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్ విరామానికి 11–9తో ముందంజ వేశాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా తలపడ్డారు. ర్యాలీల్లో పైచేయి సాధిస్తూ, నెట్ వద్ద అప్రమత్తంగా ఉంటూ, అడపాదడపా స్మాష్ షాట్లు సంధిస్తూ శ్రీకాంత్ తన ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. స్కోరు 20–20 వద్ద శ్రీకాంత్ రెండు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. ఇక రెండో గేమ్‌లోనూ శ్రీకాంత్ సాధికారికంగా ఆడాడు. స్కోరు 9–9 వద్ద మూడు పాయింట్లు గెలిచిన అతను 12–9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. స్కోరు 20–16 వద్ద చెన్ లాంగ్ కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో శ్రీకాంత్ విజయం ఖాయమైంది. చెన్ లాంగ్ వరుసగా రెండు టోర్నీల్లో భారత ప్లేయర్ల చేతిలోనే ఓడిపోవడం గమనార్హం. ఇండోనేసియా ఓపెన్‌లో ప్రణయ్ చేతిలో ఓడిన చెన్ లాంగ్ ఈసారి శ్రీకాంత్‌కు తలవంచాడు. రూ. 5 లక్షలు, టీయూవీ 300 కారు... భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు హిమాంత బిశ్వ శర్మ శ్రీకాంత్‌ను అభినందించారు. ‘బాయ్’ తరఫున రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. అయితే ఒక అభిమాని ఇది చాలా తక్కువ మొత్తమని, ఏదైనా చేయమంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రకు ట్వీట్ చేశారు. దాంతో స్పందించిన ఆయన ‘అవునా, శ్రీకాంత్ పోరాటతత్వం మనం గర్వపడేలా చేసింది. నా తరఫున మహీంద్ర టీయూవీ 300 కానుకగా ఇస్తున్నాను’ అంటూ ‘బాయ్’ నజరానా కంటే విలువైన బహుమతిని ప్రకటించారు. అభినందనల వెల్లువ... ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన కిడాంబి శ్రీకాంత్‌పై అన్ని వైపుల నుంచి అభినందనల వర్షం కురిసింది. ప్రధానమంత్రి మొదలు పలువురు ప్రముఖులు అతడిని అభినందించారు. ‘శ్రీకాంత్ విజయం పట్ల మేమంతా గర్వంగా ఉన్నాం. మరో అద్భుత విజయం సాధించిన అతడికి అభినందనలు’ అని మోడి ట్వీట్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడుతో పాటు వైఎస్సార్ సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కూడా శ్రీకాంత్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శ్రీకాంత్‌ను అభినందించిన వారిలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సానియా మీర్జా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్, తెలంగాణ క్రీడా మంత్రి టి.పద్మారావు కూడా ఉన్నారు. -
పోరాడి ఓడిన శ్రీకాంత్
ముల్హీమ్ యాన్ డెర్ రుర్ (జర్మనీ): గాయం నుంచి కోలుకున్నాక ఆడుతున్న రెండో అంతర్జాతీయ టోర్నమెంట్ జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ శ్రీకాంత్ 19–21, 20–22తో రెండో సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్‌తో 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ ఆధిక్యంలోకి ఉండి కూడా వెనుకబడిపోవడం గమనార్హం. తొలి గేమ్‌లో 12–6తో, రెండో గేమ్‌లో 12–9తో, 16–12తో శ్రీకాంత్ ముందంజ వేసినా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. -
సింగిల్స్ విజేత చెన్ లాంగ్
రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ గేమ్‌లో మహిళలు నిరాశపరిచినా పురుషుల విభాగంలో ప్లేయర్స్ సత్తా చాటుతున్నారు. రియోలో స్వర్ణం కోసం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన చెన్ లాంగ్ విజయం సాధించాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, మలేసియా స్టార్ షట్లర్ లీ చోంగ్ వీ పై 21-18, 21-18 తేడాతో గెలుపొంది చైనా ఖాతాలో మరో స్వర్ణం జత చేశాడు. రెండు గేమ్స్ లోనూ మ్యాచ్ హోరాహోరాగా సాగింది. అయితే మెరుగైన ఆటతీరు ప్రదర్శించిన చెన్ లాంగ్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ విజేతగా నిలిచాడు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు లీ చోంగ్ వీ గట్టి పోటీ ఇచ్చినా ఒక్క గేమ్ కూడా నెగ్గకపోవడంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల డబుల్స్ లోనూ చైనా ఆటగాళ్లు స్వర్ణం కొల్లగొట్టిన విషయం తెలిసిందే. -
రజతంతో ముగింపు
కొరియా ఓపెన్ రన్నరప్ అజయ్ జయరామ్ సియోల్ : అద్వితీయ ప్రదర్శనతో తొలిసారి ‘సూపర్ సిరీస్’ టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరుకున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ అజయ్ జయరామ్ ఆఖరి అడ్డంకిని అధిగమించలేకపోయాడు. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచి రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 32వ ర్యాంకర్ అజయ్ జయరామ్ 14-21, 13-21తో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్, టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యాడు. విజేత చెన్ లాంగ్‌కు 45 వేల డాలర్లు (రూ. 29 లక్షల 64 వేలు), రన్నరప్ అజయ్ జయరామ్‌కు 22 వేల 800 డాలర్లు (రూ. 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. కెరీర్లో తొలిసారి ‘సూపర్ సిరీస్’ ఫైనల్ ఆడుతున్న జయరామ్‌పై ఇప్పటికే 18 సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన చెన్ లాంగ్ సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచాడు. 39 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో ఈ చైనా స్టార్‌కు ఏ దశలోనూ జయరామ్ ఇబ్బంది పెట్టలేకపోయాడు. రెండు గేముల్లోనూ తొలుత జయరామే ఖాతా తెరిచినప్పటికీ... ఆ తర్వాత అదే జోరును కొనసాగించడంలో విఫలమయ్యాడు. -
ఫైనల్లో జయరామ్ కు నిరాశ
సియోల్:కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ లో భాగాంగా తొలిసారి సూపర్ సిరీస్ ఫైనల్ కు చేరుకున్నభారత బ్యాడ్మింటన్ ఆటగాడు అజయ్ జయరామ్ కు నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో జయరామ్ 14-21,13-21 తేడాతో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, ప్రపంచ చాంపియన్, డిఫెండింగ్ చాంపియన్ చెన్ లాంగ్(చైనా) చేతిలో ఓటమి చెందాడు. భారత స్టార్ ఆటగాళ్లు నిష్ర్కమించిన చోట తన పూర్వవైభవాన్ని చాటుకుంటూ ఫైనల్ కు చేరిన జయరామ్ ఫైనల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. జయరామ్ వరుస సెట్లను చెన్ లాంగ్ కు అప్పగించి రన్నరప్ గా సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీ ఆద్యంతం అంచనాలు మించి రాణించిన జయరామ్ ఫైనల్లో మాత్రం చెన్ దాటికి తలవంచక తప్పలేదు. అన్ సీడెడ్ క్రీడాకారుడిగా బరిలోకి దిగిన జయరామ్ తొలి గేమ్ లో వరుసగా పాయింట్లు సాధించి ఆధిక్యం దిశగా దూసుకెళ్లినా.. స్కోరు 4-4 వద్ద ఉండగా చెన్ లాంగ్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో చెన్ 9-5 తో ముందంజ వేసి అదే ఊపును కడవరకూ కొనసాగించి సెట్ ను చేజిక్కించుకున్నాడు. అయితే రెండో సెట్ లో జయరామ్ చేసిన అనవసర తప్పిదాలను చెన్ ఉపయోగించుకున్నాడు. ఈ మ్యాచ్ లో లాంగ్ అద్భుతమైన ఎఫెన్స్, డిఫెన్స్ తో జయరామ్ కు కళ్లెం వేసి మరోసారి కొరియన్ సూపర్ సిరీస్ విజేతగా అవతరించాడు. దీంతో విజేత చెన్ లాంగ్‌కు 45 వేల డాలర్లు (రూ. 29 లక్షల 64 వేలు), రన్నరప్ అజయ్ జయరామ్‌కు 22 వేల 800 డాలర్లు (రూ. 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఇదిలా ఉండగా ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఆధ్వర్యంలో 2007లో సూపర్ సిరీస్ టోర్నమెంట్లు ప్రారంభమైన తర్వాత... భారత్ నుంచి సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న మూడో ప్లేయర్‌గా జయరామ్ గుర్తింపు పొంది అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు భారత్ నుంచి సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ సూపర్ సిరీస్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకున్న వారిలో ఉన్నారు. -
అజయ్హో
ప్రపంచ ఏడో ర్యాంకర్‌పై సంచలన విజయం ♦ కెరీర్లో తొలిసారి ‘సూపర్’ ఫైనల్లోకి ♦ భారత్ నుంచి ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్ ♦ నేడు ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్‌తో అమీతుమీ ♦ కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ మూడేళ్ల క్రితం చివరి నిమిషంలో లండన్ ఒలింపిక్స్ బెర్త్‌ను పారుపల్లి కశ్యప్‌కు కోల్పోయి తీవ్ర నిరుత్సాహానికి గురైన అజయ్ జయరామ్... ఈ ఏడాది తన పాత చేదు జ్ఞాపకాలన్నింటినీ మర్చిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. ఒకప్పుడు భారత నంబర్‌వన్‌గా చెలామణీ అయిన ఈ బెంగళూరు ప్లేయర్ తదనంతరం కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్, ప్రణయ్, ఆనంద్ పవార్, సాయిప్రణీత్ తదితర ఆటగాళ్ల దూకుడుకు వెనుకబడిపోయాడు. శ్రీకాంత్, కశ్యప్, ప్రణయ్ లాంటి ఆటగాళ్లపైనే అందరి దృష్టి కేంద్రీకృతమవుతున్న ప్రస్తుత తరుణంలో... జయరామ్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. తద్వారా మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. సియోల్ : భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్ చేతులెత్తేసిన చోట... భారత్‌కే చెందిన మరో ప్లేయర్ అజయ్ జయరామ్ సంచలన ప్రదర్శనతో తన ఉనికిని చాటుకున్నాడు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 32వ ర్యాంకర్ అజయ్ జయరామ్ 21-19, 21-15తో ప్రపంచ ఏడో ర్యాంకర్ చెన్ చౌ తియెన్ (చైనీస్ తైపీ)పై వరుస గేముల్లో నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ► ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్, టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా)తో జయరామ్ అమీతుమీ తేల్చుకుంటాడు. ముఖాముఖి రికార్డులో జయరామ్ 0-1తో వెనుకంజలో ఉన్నాడు. 2014 హాంకాంగ్ ఓపెన్ తొలి రౌండ్లో చెన్ లాంగ్‌తో ఆడిన ఏకైక మ్యాచ్‌లో జయరామ్ వరుస గేముల్లో ఓడిపోయాడు. ► సెమీస్ చేరే క్రమంలో తనకంటే ఎంతో మెరుగైన ర్యాంక్ ఆటగాళ్లను ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉన్న జయరామ్ అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ ప్రదర్శించాడు. ఈ ఏడాది తన ప్రత్యర్థి చేతిలో రెండుసార్లు ఓడిపోయినప్పటికీ... ఆ మ్యాచ్‌ల్లో చేసిన తప్పిదాలను ఈసారి పునరావృతం చేయకుండా పక్కా ప్రణాళికతో ఆడి అనుకున్న ఫలితాన్ని సాధించాడు. ► జయరామ్ తొలి గేమ్‌లో 11-15తో.. రెండో గేమ్‌లో 12-14తో వెనుకబడ్డాడు. అయితే అతను ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా నిగ్రహంతో ఆడి స్కోరును సమం చేయడంతోపాటు ఆధిక్యంలోకి వెళ్లి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ ఏడాది జయరామ్ మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్, స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్, రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీల్లో సెమీస్‌కు చేరుకున్నాడు. ► ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో 2007లో సూపర్ సిరీస్ టోర్నమెంట్లు ప్రారంభమైన తర్వాత... భారత్ నుంచి సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న మూడో ప్లేయర్‌గా జయరామ్ గుర్తింపు పొందాడు. ఇంతకుముందు భారత్ నుంచి సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ సూపర్ సిరీస్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు టైటిల్స్ కూడా నెగ్గిన సంగతి తెలిసిందే. గతంలో ప్రకాశ్ పదుకొనే, పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గినపుడు ఆ టోర్నీలకు సూపర్ సిరీస్ హోదా లేదు. ► ‘‘నాకిది గొప్ప విజయం. వ్యూహాత్మకంగా, మానసికంగా కూడా సెమీస్‌లో మంచి ఆటతీరును కనబరిచాను. ఈ ఏడాది చెన్ చౌ తియెన్తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయాను. ఈసారి చాలా ఓపికతో ఆడాను. నెట్ వద్ద, ర్యాలీల్లో పైచేయి సాధించాను. తొలిసారి సూపర్ సిరీస్ టోర్నీలో ఫైనల్ చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ టోర్నీలోని గత మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ఫైనల్ మ్యాచ్‌పై దృష్టి పెడతాను. చెన్ లాంగ్‌తో టైటిల్ పోరు క్లిష్టంగా ఉంటుందని భావిస్తున్నాను’’ -అజయ్ జయరామ్