
రజతంతో ముగింపు
కొరియా ఓపెన్ రన్నరప్ అజయ్ జయరామ్
సియోల్ : అద్వితీయ ప్రదర్శనతో తొలిసారి ‘సూపర్ సిరీస్’ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ అజయ్ జయరామ్ ఆఖరి అడ్డంకిని అధిగమించలేకపోయాడు. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచి రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 32వ ర్యాంకర్ అజయ్ జయరామ్ 14-21, 13-21తో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్, టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యాడు. విజేత చెన్ లాంగ్‌కు 45 వేల డాలర్లు (రూ. 29 లక్షల 64 వేలు), రన్నరప్ అజయ్ జయరామ్‌కు 22 వేల 800 డాలర్లు (రూ. 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
కెరీర్‌లో తొలిసారి ‘సూపర్ సిరీస్’ ఫైనల్ ఆడుతున్న జయరామ్‌పై ఇప్పటికే 18 సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన చెన్ లాంగ్ సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచాడు. 39 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో ఈ చైనా స్టార్‌కు ఏ దశలోనూ జయరామ్ ఇబ్బంది పెట్టలేకపోయాడు. రెండు గేముల్లోనూ తొలుత జయరామే ఖాతా తెరిచినప్పటికీ... ఆ తర్వాత అదే జోరును కొనసాగించడంలో విఫలమయ్యాడు.