
తైపీ సిటీ: స్టార్ షట్లర్లు దూరమైన చైనీస్ తైపీ వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నమెంట్‌లో సత్తా చాటా లని భారత ఆటగాళ్లు అజయ్ జయరామ్, సౌరభ్ వర్మ పట్టుదలగా ఉన్నారు. నేటినుంచి జరిగే ఈ టోర్నీకి పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లు దూరంగా ఉన్నారు. ఈ నెలలోనే కీలకమైన డెన్మార్క్ ఓపెన్ (16 నుంచి 21 వరకు), ఫ్రెంచ్ ఓపెన్ (23 నుంచి 28 వరకు) టోర్నీలు ఉండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో అజయ్ జయరామ్, మాజీ జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ లకు ఇది మంచి అవకాశం. మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయిలు చుక్కా సాయి ఉత్తేజిత రావు, శ్రీకృష్ణప్రియలు బరిలోకి దిగుతున్నారు. వియ త్నాం, వైట్‌నైట్స్ టోర్నీలో ఫైనల్ చేరిన అజయ్ జయరామ్ ఈ టోర్నీలో టైటిల్‌పై కన్నేశాడు.
తొలిరౌండ్లో అతను జపాన్‌కు చెందిన హషిరు షిమోనోతో తలపడనుండగా... ప్రపంచ 65వ ర్యాంకర్ సౌరభ్ వర్మ స్థానిక ఆటగాడు లీ చియ హవ్‌ను ఎదుర్కొంటాడు. మిగతా మ్యాచ్‌ల్లో చిట్టబోయిన రాహుల్... లు చియ హుంగ్ (తైపీ)తో, అభిషేక్... ఐదో సీడ్ జాన్ జొర్గెన్సన్ (డెన్మార్క్)తో పోటీపడతారు. మహిళల సింగిల్స్‌లో ఉత్తేజిత... చియాంగ్ యింగ్ లీ (తైపీ)తో, ముగ్ధ అగ్రే... ఏడో సీడ్ సోనియా (మలేసియా)తో, శ్రీకృష్ణప్రియ... లిన్ యింగ్ చన్ (తైపీ)తో తలపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో ఒక్క తరుణ్ కోన మాత్రమే ఆడుతున్నాడు. అతను మలేసియాకు చెందిన లిమ్ కిమ్ వాతో జతకట్టగా, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత షట్లర్లు ఎవరూ పాల్గొనడం లేదు.