
సింధు తొలిసారి..
సియోల్:కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ పివి సింధు ఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో సింధు 21-10, 17-21, 21-16 తేడాతో బింగ్‌జియావో(చైనా)పై గెలిచి ఫైనల్ కు చేరారు. తద్వారా కొరియో ఓపెన్ సూపర్ సిరీస్ లోకి తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి గేమ్ లో 9-3 తేడాతో స్పష్టమైన ఆధిక్యం సాధించిన సింధు.. వరుస పాయింట్లతో దూసుకుపోయింది. తొలి గేమ్ లో 13-6, 19-9 తేడాతో పైచేయి సాధించిన సింధు ఆ గేమ్ ను సునాయాసంగా గెలుచుకున్నారు. కాగా, రెండో గేమ్ లో బింగ్జియావో నుంచి సింధుకు ఊహించని ప్రతి ఘటన ఎదురైంది.
రెండో గేమ్ లో సింధు 9-6 తేడాతో ఆధిక్యంలో నిలిచిన సమయంలో ఒక్కసారి బింగ్జియావో విజృంచింది. తొలుత 13-12తో సింధు ఆధిక్యాన్ని తగ్గించిన బింగ్జియావో.. అదే ఊపులో వరుస పాయింట్లను సాధించి గేమ్ ను కూడా సొంతం చేసుకుంది. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది. హోరాహోరీగా సాగిన మూడో గేమ్ ను సింధు సొంతం చేసుకోవడమే కాకుండా మ్యాచ్ ను కూడా సాధించి తుదిపోరు అర్హత సాధించారు. ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో సింధు తలపడనుంది. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో ఒకుహరా చేతిలో పరాజయం పాలైన సింధు ప్రతీకారం తీర్చుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది.