సింగిల్స్‌లో ప్రణయ్, సమీర్ వర్మ, ఆకర్షి ముందంజ
సిడ్నీ: ఆ్రస్టేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ వరుసగా రెండో విజయం సాధించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్ ద్వయం 21–11, 21–11తో కాయ్ చెన్ తియో–కాయ్ కి తియో (ఆ్రస్టేలియా) జంటను ఓడించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జోడీ జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా)తో సిక్కి–సుమీత్ జంట తలపడుతుంది.
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్‌వన్ ప్రణయ్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... కిరణ్ జార్జి ఓడిపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సమీర్ 21–14, 14–21, 21–19తో 2021 ప్రపంచ చాంపియన్ లో కీన్ యె (సింగపూర్)ను బోల్తా కొట్టించగా... ప్రణయ్ 21–17, 21–15తో మిషా జిల్బెర్‌మన్ (ఇజ్రాయెల్)పై గెలిచాడు. కిరణ్ జార్జి 20–22, 6–21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓడిపోయాడు.
మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ క్వార్టర్ ఫైనల్ చేరగా... మాళవిక, అనుపమ నిష్క్రమించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆకర్షి 21–16, 21–13తో కాయ్ కి తియో (ఆస్ట్రేలియా)పై గెలిచింది. మాళవిక 17–21, 21–23తో ఎస్తెర్ నురిమి (ఇండోనేసియా) చేతిలో, అనుపమ 11–21, 18–21తో పుత్రి కుసుమ వర్ధిని (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు.
Comments
Please login to add a commentAdd a comment