క్వార్టర్స్‌లో ఓడిన సింధు
స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్
మాడ్రిడ్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ (సూపర్ 300) టోర్నీ స్పెయిన్ మాస్టర్స్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఓడగా...మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి – సుమీత్ రెడ్డి జోడి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్‌లో, పురుషుల డబుల్స్‌లో కూడా భారత జోడీలు క్వార్టర్స్‌లో వెనుదిరిగాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో సింధు పోరాడి ఓడింది.
ఈ మ్యాచ్‌లో థాయిలాండ్‌కు చెందిన ఆరో సీడ్ సుపనిద కేట్‌టాంగ్ 24–26, 21–17, 22–20తో రెండో సీడ్ సింధును ఓడించింది. 77 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఇద్దరు షట్లర్లూ ఒక్కో పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. తొలి గేమ్‌లో 4–8తో వెనుకబడిన తర్వాత వరుస 7 పాయింట్లతో సింధు 11–8కి వెళ్లింది. అయితే ఆ తర్వాత సుపనిద కోలుకుంది. దాంతో స్కోరు 17–17, 20–20, 24–24 వరకు సమంగా సాగగా, చివరకు గేమ్ సింధు గెలుచుకుంది.
రెండో గేమ్‌లో 8–11తో వెనుకబడి కూడా సుపనిద పోరాడి గేమ్‌ను సొంతం చేసుకోగలిగింది. చివరి గేమ్‌లో 8–4తో సింధు ముందంజ వేసింది. అయితే భారత షట్లర్ వరుస తప్పిదాలతో ప్రత్యర్థికి అవకాశం కల్పించింది. ఒక దశలో వరుస 10 పాయింట్లలో 9 సుపనిద ఖాతాలోకే చేరాయి. 15–20తో ఓటమి దాదాపు ఖాయమైన దశలో సింధు వరుసగా 5 మ్యాచ్ పాయింట్లు సాధించి 20–20 వరకు తీసుకొచ్చింది. అయితే వరుస రెండు పాయింట్లతో సుపనిద ఆట ముగించడంతో రాకెట్ విసిరేసి సింధు కోర్టులోనే కుప్పకూలిపోయింది.
డబుల్స్ జోడీల పరాజయం...
41 నిమిషాల పాటు సాగిన మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సుమీత్ – సిక్కి జోడి 14–21, 21–11, 21–17 స్కోరుతో ఇండోనేసియాకు చెందిన రేహన్ నౌఫల్ – లిసా ఆయు ద్వయంపై విజయం సాధించింది. తొలి గేమ్‌ను కోల్పోయినా...పట్టుదలగా ఆడిన భారత జంట తర్వాతి రెండు గేమ్‌లలో సత్తా చాటి సెమీస్‌లోకి అడుగు పెట్టింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కు చెందిన మూడో సీడ్ అశ్విని పొన్నప్ప – తనీషా క్రాస్టోకు ఓటమి ఎదురైంది.
ఆరో సీడ్ లీ చియా సిన్ – టెంగ్ చున్ సున్ (చైనీస్ తైపీ) వరుస గేమ్‌లలో 21–12, 21–10తో అశ్విని – తనీషాలను చిత్తు చేశారు. పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లోలో భారత్‌కు చెందిన ఎనిమిదో సీడ్ ధ్రువ్ కపిల – ఎంఆర్ అర్జున్ 19–21, 23–21, 17–21 తేడాతో మలేసియాకు చెందిన జునేదీ ఆరిఫ్ – రాయ్ కింగ్ చేతిలో పరాజయంపాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment