Sumeeth Reddy
-
క్వార్టర్ ఫైనల్లో సిక్కి–సుమీత్ జోడీ
సిడ్నీ: ఆ్రస్టేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ వరుసగా రెండో విజయం సాధించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్ ద్వయం 21–11, 21–11తో కాయ్ చెన్ తియో–కాయ్ కి తియో (ఆ్రస్టేలియా) జంటను ఓడించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జోడీ జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా)తో సిక్కి–సుమీత్ జంట తలపడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్‌వన్ ప్రణయ్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... కిరణ్ జార్జి ఓడిపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సమీర్ 21–14, 14–21, 21–19తో 2021 ప్రపంచ చాంపియన్ లో కీన్ యె (సింగపూర్)ను బోల్తా కొట్టించగా... ప్రణయ్ 21–17, 21–15తో మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)పై గెలిచాడు. కిరణ్ జార్జి 20–22, 6–21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ క్వార్టర్ ఫైనల్ చేరగా... మాళవిక, అనుపమ నిష్క్రమించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆకర్షి 21–16, 21–13తో కాయ్ కి తియో (ఆస్ట్రేలియా)పై గెలిచింది. మాళవిక 17–21, 21–23తో ఎస్తెర్ నురిమి (ఇండోనేసియా) చేతిలో, అనుపమ 11–21, 18–21తో పుత్రి కుసుమ వర్ధిని (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. -
సిక్కి–సుమీత్ జోడీ శుభారంభం
సిడ్నీ: ఆ్రస్టేలియన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్ ద్వయం 21–17, 21–19తో వోంగ్ టియెన్ సి–లిమ్ చియెవ్ సియెన్ (మలేసియా) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకృష్ణప్రియ–కోన తరుణ్ (భారత్) జంట 6–21, 11–21తో హూ పాంగ్ రోన్–చెంగ్ సు యెన్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. ప్రణయ్, సమీర్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లు హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ, కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–10, 23–21తో యోగర్ కోల్హో (బ్రెజిల్)పై, సమీర్ వర్మ 21–10, 21–10తో రికీ టాంగ్ (ఆస్ట్రేలియా)పై, కిరణ్ 21–17, 21–10తో జియోడాంగ్ షాంగ్ (కెనడా)పై గెలిచారు.ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మిథున్ మంజునాథ్ (భారత్) 17–21, 17–21తో అల్వి ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో, శంకర్ ముత్తుస్వామి (భారత్) 16–21, 21–18, 10–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో, అభిషేక్ (భారత్) 9–21, 15–21తో మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్) చేతిలో ఓడిపోయారు. పోరాడి ఓడిన సామియా మహిళల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక, అనుపమ ఉపాధ్యాయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరారు. హైదరాబాద్ అమ్మాయి సామియా ఫారూఖీ తొలి రౌండ్లో 23–21, 13–21, 22–24తో టాప్ సీడ్ పాయ్ యు పో (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయింది. ఆకర్షి 21–14, 21–11తో పొలీనా బురోవా (ఉక్రెయిన్)పై, మాళవిక 21–10, 21–8తో మోపాటి కెయురపై, అనుపమ 21–14, 23–21తో వోంగ్ లింగ్ చింగ్ (మలేసియా)పై గెలిచారు. -
సెమీస్‌లో సిక్కి–సుమీత్ జోడి
మాడ్రిడ్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ (సూపర్ 300) టోర్నీ స్పెయిన్ మాస్టర్స్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఓడగా...మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి – సుమీత్ రెడ్డి జోడి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్‌లో, పురుషుల డబుల్స్‌లో కూడా భారత జోడీలు క్వార్టర్స్‌లో వెనుదిరిగాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో సింధు పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో థాయిలాండ్‌కు చెందిన ఆరో సీడ్ సుపనిద కేట్‌టాంగ్ 24–26, 21–17, 22–20తో రెండో సీడ్ సింధును ఓడించింది. 77 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఇద్దరు షట్లర్లూ ఒక్కో పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. తొలి గేమ్‌లో 4–8తో వెనుకబడిన తర్వాత వరుస 7 పాయింట్లతో సింధు 11–8కి వెళ్లింది. అయితే ఆ తర్వాత సుపనిద కోలుకుంది. దాంతో స్కోరు 17–17, 20–20, 24–24 వరకు సమంగా సాగగా, చివరకు గేమ్ సింధు గెలుచుకుంది. రెండో గేమ్‌లో 8–11తో వెనుకబడి కూడా సుపనిద పోరాడి గేమ్‌ను సొంతం చేసుకోగలిగింది. చివరి గేమ్‌లో 8–4తో సింధు ముందంజ వేసింది. అయితే భారత షట్లర్ వరుస తప్పిదాలతో ప్రత్యర్థికి అవకాశం కల్పించింది. ఒక దశలో వరుస 10 పాయింట్లలో 9 సుపనిద ఖాతాలోకే చేరాయి. 15–20తో ఓటమి దాదాపు ఖాయమైన దశలో సింధు వరుసగా 5 మ్యాచ్ పాయింట్లు సాధించి 20–20 వరకు తీసుకొచ్చింది. అయితే వరుస రెండు పాయింట్లతో సుపనిద ఆట ముగించడంతో రాకెట్ విసిరేసి సింధు కోర్టులోనే కుప్పకూలిపోయింది. డబుల్స్ జోడీల పరాజయం... 41 నిమిషాల పాటు సాగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సుమీత్ – సిక్కి జోడి 14–21, 21–11, 21–17 స్కోరుతో ఇండోనేసియాకు చెందిన రేహన్ నౌఫల్ – లిసా ఆయు ద్వయంపై విజయం సాధించింది. తొలి గేమ్‌ను కోల్పోయినా...పట్టుదలగా ఆడిన భారత జంట తర్వాతి రెండు గేమ్‌లలో సత్తా చాటి సెమీస్‌లోకి అడుగు పెట్టింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కు చెందిన మూడో సీడ్ అశ్విని పొన్నప్ప – తనీషా క్రాస్టోకు ఓటమి ఎదురైంది. ఆరో సీడ్ లీ చియా సిన్ – టెంగ్ చున్ సున్ (చైనీస్ తైపీ) వరుస గేమ్‌లలో 21–12, 21–10తో అశ్విని – తనీషాలను చిత్తు చేశారు. పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లోలో భారత్‌కు చెందిన ఎనిమిదో సీడ్ ధ్రువ్ కపిల – ఎంఆర్ అర్జున్ 19–21, 23–21, 17–21 తేడాతో మలేసియాకు చెందిన జునేదీ ఆరిఫ్ – రాయ్ కింగ్ చేతిలో పరాజయంపాలయ్యారు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి–సుమీత్ జోడీ
గువాహటి: స్వదేశంలో జరుగుతున్న గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్ ద్వయం 20–22, 21–15, 21–16తో రఫ్లీ రమంద–ఇందా సరి జమీల్ (ఇండోనేసియా) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 21–14, 17–21, 7–21తో కువో కువాన్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో... తరుణ్ 11–21, 14–21తో జియా జెంగ్ జేసన్ (సింగపూర్) చేతిలో... ప్రణయ్ 12–21, 17–21తో కార్తికేయ (భారత్) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో హైదరాబాద్ అమ్మాయి సామియా 21–12, 21–11తో తెలంగాణకే చెందిన గద్దె రుత్విక శివానిపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
Swiss Open 2022: మెయిన్ ‘డ్రా’కు సుమీత్ రెడ్డి–అశ్విని జంట
Swiss Open 2022: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో సుమీత్–అశ్విని ద్వయం 18–21, 21–16, 21–17తో మ్యాడ్స్ వెస్టర్‌గార్డ్–నటాషా (డెన్మార్క్) జోడీపై నెగ్గింది. ఇదిలా ఉండగా.. సిక్కి రెడ్డి–సాయిప్రతీక్; పుల్లెల గాయత్రి–ధ్రువ్; అర్జున్–ట్రెసా జాలీ జోడీలకు నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు దక్కింది. చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. -
ఘనంగా సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డిల వివాహం
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ నేలకుర్తి సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డిల వివాహం హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా, పీవీ సింధు, తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. -
ఘనంగా : సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డిల వివాహం
-
సెమీస్‌లో సుమీత్ జంట
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో తెలంగాణ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి మను అత్రితో కలిసి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో సుమీత్–మను ద్వయం 17–21, 21–19, 21–18తో భారత్‌కే చెందిన అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జంటపై గెలుపొందింది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సాయి ప్రణీత్ 12–21, 14–21తో లీ చెయుక్ యియు (హాంకాంగ్) చేతిలో... సమీర్ వర్మ 14–21, 6–21తో లూ గ్వాంగ్జు (చైనా) చేతిలో ఓడిపోయారు. -
మా డబ్బులు ఇప్పించండి!
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడో రెండేళ్ల క్రితం 2016 ఫిబ్రవరిలో దక్షిణాసియా (శాఫ్) క్రీడలు జరిగితే విజేతలకు ప్రకటించిన ప్రోత్సాహకాలు మాత్రం ఇప్పటికీ దక్కలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన నగదు పురస్కారాల కోసం ఇప్పటికీ ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ ఆటగాళ్లు తిరగాల్సిన పరిస్థితి... చివరకు నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా ఆటగాళ్లకు డబ్బులు అందలేదు! కామన్వెల్త్ క్రీడలకు బయల్దేరాల్సిన సమయంలో తమకు రావాల్సిన డబ్బు కోసం క్రీడాకారులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ తమ సమస్య తీరకపోవడంతో ఆవేదనగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పి. సుమీత్ రెడ్డి ‘శాఫ్’ క్రీడల పురుషుల డబుల్స్, టీమ్ విభాగాల్లో రెండు స్వర్ణాలు సాధించాడు. నిబంధనల ప్రకారం అతనికి రూ. 8.10 లక్షలు రావాల్సి ఉంది. అయితే అతనికి ఒక్క పైసా అందలేదు. తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించమంటూ ఈ నెల 20న సుమీత్... రాష్ట్ర క్రీడా శాఖ మంత్రికి లేఖ రాశాడు. నిజానికి గత డిసెంబర్ 30న అకౌంట్ విభాగం మొత్తం రూ. 65 లక్షల 20 వేలు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కానీ అధికారులు మూడు నెలలుగా తిప్పుతూనే ఉన్నారు. కామన్వెల్త్ క్రీడలకు వెళ్లాల్సిన సమయంలో ప్రభుత్వం తమకు అండగా నిలవాలని వారు కోరుతున్నారు. ఈ జాబితాలో సుమీత్‌తో పాటు షట్లర్లు సిక్కి రెడ్డి (రూ. 12.6 లక్షలు), మనీషా (రూ.6.6 లక్షలు), రుత్విక (రూ.9.6 లక్షలు), పీవీ సింధు (రూ.7.6 లక్షలు), జ్వాల (రూ.8.1 లక్షలు), సాయిప్రణీత్ (రూ. 3.6 లక్షలు) ఉన్నారు. ఇతర క్రీడాకారుల్లో అథ్లెట్ ప్రేమ్‌కుమార్‌కు రూ. 4 లక్షలు... మహేందర్ రెడ్డి, తేజస్విని (కబడ్డీ), రంజిత్, నందిని (ఖోఖో)లకు తలా రూ.1.25 లక్షలు రావాల్సి ఉంది. -
నాన్న ప్రోత్సాహంతోనే ఒలింపిక్స్ స్థాయికి..
వరంగల్ స్పోర్ట్స్ : క్రీడాకారుడికి సాధించాలనే తపన, అందుకు తగిన కృషి ఉంటేనే సరిపోదు, అనుకున్న క్రీడల్లో రాణించాలంటే ఆటల్లో కొత్త మెళకవల కోసం సరికొత్తగా ఆలోచించే సృజనాత్మకమైన శక్తి కలిగి ఉండాలని ఇండియన్ డబుల్స్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు బుస్సు సుమిత్‌రెడ్డి అన్నారు. హన్మకొండ భీమారంలో సమీపంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న క్రీడా వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుమిత్రెడ్డిని ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా ఆయన ఒలింపిక్స్ స్థాయికి ఎదిగిన తీరుతోపాటు యువ క్రీడాకారులకు పలు సూచనలు అందించారు. అవి ఆయన మాటల్లోనే.. మాది రంగారెడ్డి జిల్లా గున్గల్. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో ఉంటున్నాం. అమ్మ నిర్మలాదేవి ఆబిడ్స్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలు. నాన్న చంద్రభాస్కర్‌రెడ్డి సైతం వ్యాయామ ఉపాధ్యాయుడే. ఆయన ప్రస్తుతం ధూల్‌పేటలోని జలక్షత్రియ పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ వ్యాయామ ఉపాధ్యాయులే కావడం నా అదృష్టంగా భావిస్తా. నేను మొదటిసారి 2001లో బ్యాడ్మింటన్ రాకెట్‌ను పట్టుకున్నా. నా మొదటి కోచ్ గోవర్ధన్‌రెడ్డి నాకు క్రీడల్లో ఓనమాలు నేర్పిస్తే, పుల్లెల గోపీచంద్ కోచింగ్ క్రీడా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా చేసింది. ప్రతిరోజు నాన్న దగ్గరుండి ప్రాక్టీస్ చేయించేవాడు. అలా 17 సంవత్సరాల శిక్షణలో ఒలింపిక్స్ స్థాయికి ఎదిగాను. అదంతా నాన్న అందించిన ప్రోత్సాహమే. ఇండియా నుంచి షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్‌లో ఒలింపిక్స్‌లో ఆడే మొదటి అవకాశం నాకు రావడం అవధుల్లేని సంతోషాన్నిచ్చింది. నా జోడి మన్హోత్రితో కలిసి అనేక అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మా సత్తా చాటాం. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంటుంది. మన్హోత్రి తో కలిసి 2016 రియో ఒలంపిక్స్‌లో మా శాయశక్తులా ఆడాం. మూడు మ్యాచ్‌ల్లో మొదట జపాన్‌పై విజయం సాధించాం. అదే ఉత్సాహంతో చైనా, ఇండోనేషియాలతో ఆడినప్పటికీ విజయం సాధించలేకపోయాం. అయినప్పటికీ బలమైన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చామన్న సంతృప్తి మాత్రం మాకు కలిగింది. వరంగల్ వేదికగా గతంలో రెండు రాష్ట్ర స్థాయి టోర్నమెంటుల్లో పాల్గొన్నాను. త్వ రలో వరంగల్ మా అత్తారి ఊరు కాబో తుండడం సంతోషంగా ఉంది. మహబూ బాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నెలకుర్తి సిక్కిరెడ్డితో ఇటీవల నిశ్చితార్థమైంది. ఇద్ద రం క్రీడాకారులం కావడం, అందులోనూ ఇద్దరం బ్యాడ్మింటన్ క్రీడాకారులం సంతో షంగా ఉంది’ అని ఆయన వెల్లడించారు. -
రియో ఒలింపిక్స్‌లో జిల్లా తేజం
♦ అంతర్జాతీయ స్థాయికి గున్గల్ యువకిరణం ♦ బ్యాడ్మింటన్‌లో బెర్త్ దక్కించుకున్న సుమీత్‌రెడ్డి ♦ ‘మను’తో జోడీగా డబుల్స్‌లో బరిలోకి.. విశ్వవ్యాప్తంగా క్రీడా కారులకు స్వర్గధామం.. హేమాహేమీలకే పరిమితమైన ఒలిపింక్స్ సమరాంగణంలో బరిలోకి దిగే అరుదైన అవకాశాన్ని మన జిల్లాకు చెందిన యువ కిరణం బుస్సు సుమీత్‌రెడ్డి దక్కించుకున్నారు. ఆగస్టు తొలివారంలో బ్రెజిల్ రాజధాని రియోడిజనీరోలో జరగనున్న ఒలింపిక్స్‌లో ఆయన పాల్గొననున్నారు. యాచారం మండలం గున్‌గల్‌కు చెందిన ఈ పాతికేళ్ల యువ కిషోరం బ్యాడ్మిం టన్ (డబుల్స్) విభాగంలో భారత్ తరుఫున ఆడనున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్‌లో 20వ స్థానంలో ఉన్న సుమీత్‌రెడ్డి మను ఆత్రి జోడితో కలిసి బరిలోకి దిగనున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : నాన్న స్ఫూర్తి.. పట్టుదల సుమీత్‌ను ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ దరికి చేర్చాయి. అథ్లెటిక్స్ కోచ్‌గా, పీఈటీగా పనిచేస్తున్న చంద్రభాస్కర్‌రెడ్డి తన రెండో కుమారుడైన సుమీత్‌ను పరుగుల వీరుడిగా మలచాలని కలలుకన్నారు. ఈ లక్ష్యంతో కుమారుడికి అథ్లెటిక్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అయితే, కుమారుడు అథ్లెటిక్స్ కంటే బ్యాడ్మింటన్‌పై చూపుతున్న ఆసక్తిని గమనించి.. ఎనిమిదో ఏటా బ్యాడ్మింటన్ వైపు మళ్లించారు. అంతే.. నాన్న ప్రేరణతో బ్యాడ్మింటన్ క్రీడలోకి అడుగిడిన సుమీత్ వరుస విజయాలతో ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకున్నారు. పట్టుదలతో పతాకస్థాయికి.. హైదరాబాద్‌లోని ఆల్‌సెయింట్స్ స్కూల్లో పాఠశాల విద్య, ఏవీ కాలేజీలో చదివిన ఈ కుర్రాడు.. 2009 వరకు జాతీయ స్థాయిలో సింగిల్స్‌లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించారు. ఆ తర్వాత గాయాలబారిన పడిన సుమీత్.. మూడేళ్లు ఆటకు దూరమయ్యారు. ఈ దశలో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి బ్మాడ్మింటన్ కోర్టులోకి అడుగుపెట్టిన ఆయన డబుల్స్‌లో రికార్డుల పరంపర కొనసాగిస్తునే ఉన్నారు. మనుతో జతకట్టిన సుమీత్ జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో సత్తా చాటుతున్నారు. 2013, 2014లలో టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ విజేతలుగా నిలిచిన ఈ డబుల్ జోడి 2015 లాగోస్ ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్‌ను సాధించింది. సౌత్ ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించాడు. తాజాగా కెనడా గ్రాండ్ఫ్రిక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో చాంపియన్లుగా నిలిచారు. వచ్చేనెలలో జరిగే రియో ఒలంపిక్స్‌లోనూ సుమిత్ ఇదే దూకుడు ప్రదర్శించి భారత్ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని ఆశిద్దాం! బెస్టాఫ్ ఆఫ్ లక్ సుమీత్!! -
రెండో రౌండ్లో సిక్కి-ప్రణవ్ జోడీ
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి డబుల్స్ విభాగంలో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా ద్వయం 21-8, 21-9తో జొనాథన్ సన్-జెన్నిఫర్ టామ్ (న్యూజిలాండ్) జంటను ఓడించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జోడీ 21-11, 17-21, 21-16తో షాంగ్ కాయ్ లిన్-లూ చింగ్ యావో (చైనీస్ తైపీ) ద్వయంపై గెలిచింది. -
‘టాప్’లో సుమీత్, మనూ
జ్వాల, అశ్వినిలకు కూడా కేంద్ర క్రీడా శాఖ ప్రకటన న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశం ఉన్న ఆటగాళ్లకు మరింత అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జంట సుమీత్ రెడ్డి, మను అత్రిలకు చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన సుమీత్ రెడ్డి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనూ అత్రి జతగా ఇటీవల కాలంలో అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. ఈ ఏడాది నాలుగు టోర్నీల్లో ఈ జంట ఫైనల్‌కు చేరగా... రెండింట్లో విజేతగా నిలిచి, మరో రెండింట్లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. వీరితో పాటు ఇన్నాళ్లుగా ‘టాప్’లో చోటు కోసం నిరసన గళం వినిపిస్తున్న మహిళల డబుల్స్ జంట గుత్తా జ్వాల, అశ్వినిలకు కూడా చోటు కల్పించారు. ఈ నలుగురి పేర్లతో క్రీడా శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తమకు ఎలాంటి వసతులు, శిక్షణ కావాలో డబుల్స్ చీఫ్ కోచ్ కిమ్ టాన్ హర్‌తో సంప్రదింపులు జరపాలని వీరికి క్రీడా శాఖ సూచించింది. 2016 రియో ఒలింపిక్స్ కోసం ‘టాప్’లో ఉన్న ఆటగాళ్లకు ఎన్ఎస్డీఎఫ్ నుంచి భారీగా నిధులు అందుతాయి. గత ఏప్రిల్‌లో సైనా, సింధు, కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్, ప్రణయ్‌లతో కూడిన తొలి జాబితా విడుదలయ్యింది. దీంతో తమకు కూడా చోటు కల్పించాలని జ్వాల జోడి విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. -
సుమీత్ జంటకు టైటిల్
లువెన్ (బెల్జియం) : టాప్ సీడింగ్ హోదాకు తగ్గట్టు రాణించిన సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) ద్వయం బెల్జియం ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్-మనూ జోడీ 22-10, 19-21, 22-20తో రెండో సీడ్ ఆడమ్ వాలినా-ప్రెజ్మైస్లావ్ (పొలెండ్) జంటపై విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి ఈ ఏడాది నాలుగు టోర్నీల్లో ఫైనల్‌కు చేరగా... రెండుసార్లు విజేతగా, మరో రెండుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. -
రన్నరప్ సుమీత్ జంట
యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ న్యూయార్క్: తొలిసారి గ్రాండ్‌ప్రి గోల్డ్ స్థాయి టోర్నమెంట్ టైటిల్ సాధించాలని ఆశించిన సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) జంటకు నిరాశ ఎదురైంది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఈ జోడీ రన్నరప్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంక్‌లో ఉన్న సుమీత్-మనూ అత్రి ద్వయం 12-21, 16-21తో ప్రపంచ 29వ ర్యాంక్‌లో ఉన్న జున్హు లీ-యుచెన్ లియు (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. -
టైటిల్ పోరుకు సుమీత్ జంట
న్యూయార్క్: తమ సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ భారత డబుల్స్ జంట సుమీత్ రెడ్డి-మనూ అత్రి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి 21-17, 21-17తో నాలుగో సీడ్ తకెషి కముర-కిగో సొనోడా (జపాన్)పై సంచలన విజయం సాధించాడు. తద్వారా ఈ ఇద్దరు తమ కెరీర్లో తొలిసారి గ్రాండ్‌ప్రి గోల్డ్ స్థాయి టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత పొందారు. ఫైనల్లో సుమీత్-మనూ అత్రి చైనాకు చెందిన జున్హు లీ-యుచెన్ లియులతో తలపడతారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో జాతీయ చాంపియన్, హైదరాబాద్‌కే చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా)తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ 9-21, 17-21తో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 17-21, 11-21తో అయాని కురిహారా-నరూ షినోయా (జపాన్) జంట చేతిలో ఓటమి చవిచూసింది.