రియో ఒలింపిక్స్లో జిల్లా తేజం
♦ అంతర్జాతీయ స్థాయికి గున్‌గల్ యువకిరణం
♦ బ్యాడ్మింటన్‌లో బెర్త్ దక్కించుకున్న సుమీత్‌రెడ్డి
♦ ‘మను’తో జోడీగా డబుల్స్‌లో బరిలోకి..
విశ్వవ్యాప్తంగా క్రీడా కారులకు స్వర్గధామం.. హేమాహేమీలకే పరిమితమైన ఒలిపింక్స్ సమరాంగణంలో బరిలోకి దిగే అరుదైన అవకాశాన్ని మన జిల్లాకు చెందిన యువ కిరణం బుస్సు సుమీత్‌రెడ్డి దక్కించుకున్నారు. ఆగస్టు తొలివారంలో బ్రెజిల్ రాజధాని రియోడిజనీరోలో జరగనున్న ఒలింపిక్స్‌లో ఆయన పాల్గొననున్నారు. యాచారం మండలం గున్‌గల్‌కు చెందిన ఈ పాతికేళ్ల యువ కిషోరం బ్యాడ్మిం టన్ (డబుల్స్) విభాగంలో భారత్ తరుఫున ఆడనున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్‌లో 20వ స్థానంలో ఉన్న సుమీత్‌రెడ్డి మను ఆత్రి జోడితో కలిసి బరిలోకి దిగనున్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : నాన్న స్ఫూర్తి.. పట్టుదల సుమీత్‌ను ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ దరికి చేర్చాయి. అథ్లెటిక్స్ కోచ్‌గా, పీఈటీగా పనిచేస్తున్న చంద్రభాస్కర్‌రెడ్డి తన రెండో కుమారుడైన సుమీత్‌ను పరుగుల వీరుడిగా మలచాలని కలలుకన్నారు. ఈ లక్ష్యంతో కుమారుడికి అథ్లెటిక్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అయితే, కుమారుడు అథ్లెటిక్స్ కంటే బ్యాడ్మింటన్‌పై చూపుతున్న ఆసక్తిని గమనించి.. ఎనిమిదో ఏటా బ్యాడ్మింటన్ వైపు మళ్లించారు. అంతే.. నాన్న ప్రేరణతో బ్యాడ్మింటన్ క్రీడలోకి అడుగిడిన సుమీత్ వరుస విజయాలతో ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకున్నారు.
పట్టుదలతో పతాకస్థాయికి..
హైదరాబాద్‌లోని ఆల్‌సెయింట్స్ స్కూల్‌లో పాఠశాల విద్య, ఏవీ కాలేజీలో చదివిన ఈ కుర్రాడు.. 2009 వరకు జాతీయ స్థాయిలో సింగిల్స్‌లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించారు. ఆ తర్వాత గాయాలబారిన పడిన సుమీత్.. మూడేళ్లు ఆటకు దూరమయ్యారు. ఈ దశలో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి బ్మాడ్మింటన్ కోర్టులోకి అడుగుపెట్టిన ఆయన డబుల్స్‌లో రికార్డుల పరంపర కొనసాగిస్తునే ఉన్నారు. మనుతో జతకట్టిన సుమీత్ జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో సత్తా చాటుతున్నారు. 2013, 2014లలో టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ విజేతలుగా నిలిచిన ఈ డబుల్ జోడి 2015 లాగోస్ ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్‌ను సాధించింది. సౌత్ ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించాడు. తాజాగా కెనడా గ్రాండ్‌ఫ్రిక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో చాంపియన్లుగా నిలిచారు.
వచ్చేనెలలో జరిగే రియో ఒలంపిక్స్‌లోనూ సుమిత్ ఇదే దూకుడు ప్రదర్శించి భారత్ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని ఆశిద్దాం! బెస్టాఫ్ ఆఫ్ లక్ సుమీత్!!