మా డబ్బులు ఇప్పించండి! | South Asian Games incentive eludes State's sports stars | Sakshi
Sakshi News home page

మా డబ్బులు ఇప్పించండి!

Published Thu, Mar 29 2018 4:35 AM | Last Updated on Thu, Mar 29 2018 4:35 AM

South Asian Games incentive eludes State's sports stars - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎప్పుడో రెండేళ్ల క్రితం 2016 ఫిబ్రవరిలో దక్షిణాసియా (శాఫ్‌) క్రీడలు జరిగితే విజేతలకు ప్రకటించిన ప్రోత్సాహకాలు మాత్రం ఇప్పటికీ దక్కలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన నగదు పురస్కారాల కోసం ఇప్పటికీ ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ ఆటగాళ్లు తిరగాల్సిన పరిస్థితి... చివరకు నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా ఆటగాళ్లకు డబ్బులు అందలేదు!  కామన్వెల్త్‌ క్రీడలకు బయల్దేరాల్సిన సమయంలో తమకు రావాల్సిన డబ్బు కోసం క్రీడాకారులు ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికీ తమ సమస్య తీరకపోవడంతో ఆవేదనగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పి. సుమీత్‌ రెడ్డి ‘శాఫ్‌’ క్రీడల పురుషుల డబుల్స్, టీమ్‌ విభాగాల్లో రెండు స్వర్ణాలు సాధించాడు. నిబంధనల ప్రకారం అతనికి రూ. 8.10 లక్షలు రావాల్సి ఉంది. అయితే అతనికి ఒక్క పైసా అందలేదు. తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించమంటూ ఈ నెల 20న సుమీత్‌... రాష్ట్ర క్రీడా శాఖ మంత్రికి లేఖ రాశాడు. నిజానికి గత డిసెంబర్‌ 30న అకౌంట్‌ విభాగం మొత్తం రూ. 65 లక్షల 20 వేలు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

కానీ అధికారులు మూడు నెలలుగా తిప్పుతూనే ఉన్నారు. కామన్వెల్త్‌ క్రీడలకు వెళ్లాల్సిన సమయంలో ప్రభుత్వం తమకు అండగా నిలవాలని వారు కోరుతున్నారు. ఈ జాబితాలో సుమీత్‌తో పాటు షట్లర్లు సిక్కి రెడ్డి (రూ. 12.6 లక్షలు), మనీషా (రూ.6.6 లక్షలు), రుత్విక (రూ.9.6 లక్షలు), పీవీ సింధు (రూ.7.6 లక్షలు), జ్వాల (రూ.8.1 లక్షలు), సాయిప్రణీత్‌ (రూ. 3.6 లక్షలు) ఉన్నారు. ఇతర క్రీడాకారుల్లో అథ్లెట్‌ ప్రేమ్‌కుమార్‌కు రూ. 4 లక్షలు... మహేందర్‌ రెడ్డి, తేజస్విని (కబడ్డీ), రంజిత్, నందిని (ఖోఖో)లకు తలా రూ.1.25 లక్షలు రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement