execution of orders
-
గాంధీజీ విగ్రహాన్నీ వదల్లేదు
వాషింగ్టన్: నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానంతరం హింసాకాండకు పాల్పడిన నిరసనకారులను ‘బందిపోటు ముఠా’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. చివరకు వారు, వాషింగ్టన్ డీసీలోని మహాత్మాగాంధీ విగ్రహాన్నీ విడిచిపెట్టలేదన్నారు. శ్వేతజాతి పోలీసు అధికారి డెరెక్ చౌవిన్ మే 25న జార్జ్ ఫ్లాయిడ్ మెడపైన మోకాలితో తొక్కిపట్టగా, ఊపిరాడక ఫ్లాయిడ్ మరణించారు. ఈ విషయం వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై అమెరికాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. కొందరు ఆందోళనకారులు దేశవ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడ్డారు. దీనిపై, అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మిన్నెసోటాలో ట్రంప్ మాట్లాడారు. ఆందోళనకారులను ఉద్దేశించి ‘వారు అబ్రహం లింకన్ విగ్రహాన్ని కూల్చివేశారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియలేదు. మన గత చరిత్రని వారు ధ్వంసం చేస్తున్నారు. నేను అధికారంలో ఉన్నంత కాలం అమెరికా చరిత్రను వారేమీ చేయలేరు’ అని వ్యాఖ్యానించారు. అందుకే విగ్రహాల విధ్వంసానికి పాల్పడే వారికి పదేళ్ళు జైలు శిక్ష విధించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. దీంతో విగ్రహాల విధ్వంసం ఆగిపోయిందని ట్రంప్ అన్నారు. కూల్చి వేసిన గాంధీ విగ్రహాన్ని భారత ఎంబసీ సాయంతో పునర్నిర్మించినట్టు తెలిపారు. -
ఉరి వాయిదాపై హైకోర్టుకు కేంద్రం
న్యూఢిల్లీ: ‘నిర్భయ’దోషుల ఉరి అమలును నిరవధిక వాయిదా వేస్తూ ఢిల్లీలోని ట్రయల్ కోర్టు చెప్పిన తీర్పును కేంద్రం ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. అత్యవసరంగా విచారించాలంటూ శనివారం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ ఈ పిటిషన్‌ను ఆదివారం విచారిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి నలుగురు దోషులకు, జైళ్ల శాఖ డీజీ, తీహార్జైలు అధికారులకు కూడా నోటీసులు పంపించారు. ఉరిని వాయిదా వేస్తున్నట్లు ట్రయల్‌కోర్టు శుక్రవారం తీర్పునివ్వగా, శనివారమే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హైకోర్టును చేరింది. ట్రయల్ కోర్టు తమ పరిధిని మించి తీర్పునిచ్చిందని పిటిషన్లో పేర్కొంది. కేంద్రం తరఫునవాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దోషులకు ఉన్న అన్ని చట్టపరమైన అవకాశాలు ఉపయోగించుకొనేందుకు తగిన సమయం ఇచ్చామని, అయితే వారు ఉద్దేశపూర్వకంగానే విచారణ ఆలస్యమయ్యేలా పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు. ఇది న్యాయ వ్యవస్థను అవమానపర్చడమేనని పేర్కొన్నారు. దోషులకు ఉరి వాయిదా పడడంపై నిర్భయ తల్లి ఆశా దేవి స్పందిస్తూ.. దోషులకు మరణశిక్ష పడేవరకూ తన పోరాటం ఆగదని చెప్పారు. తిరస్కరించిన రాష్ట్రపతి ‘నిర్భయ’కేసులో దోషి వినయ్‌కుమార్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి కోవింద్ తిరస్కరించారు. ఇప్పటికే వినయ్ కుమార్ శర్మ, అక్షయ్‌ల క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీకోర్టు కొట్టేసింది. -
‘నిర్భయ’ దోషుల ఉరి మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: ‘నిర్భయ’దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు శిక్షను అమలు చేయరాదంటూ ఢిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. చట్టపరంగా తమలో కొందరికి మిగిలి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాల్సి ఉన్నందున శిక్ష అమలును నిరవధికంగా వాయిదా వేయాలంటూ దోషులు పెట్టుకున్న పిటిషన్‌పై అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఈ మేరకు ఆదేశాలిచ్చారు. నిర్భయ కేసులో దోషులైన పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్, ముకేశ్ కుమార్ సింగ్‌లను ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలంటూ కోర్టు జనవరి 17వ తేదీన ఆదేశించిన విషయం తెలిసిందే. వినయ్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి కోవింద్ వద్ద పెండింగ్‌లో ఉండగా, మిగతా ఇద్దరు చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉరి శిక్ష అమలును వాయిదా వేయాలంటూ దోషులు పవన్, వినయ్, అక్షయ్‌ల తరఫున లాయర్ ఏపీ సింగ్ గురువారం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం జడ్జి ధర్మేందర్ రాణా విచారణ చేపట్టారు. నలుగురిలో ఏ ఒక్కరి పిటిషన్ పెండింగ్‌లో ఉన్నా మిగతా వారిని ఉరి తీయడం నిబంధనలకు విరుద్ధమని దోషుల తరఫు న్యాయవాది వాదించారు. ఏకీభవించిన న్యాయమూర్తి డెత్ వారెంట్లను వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చారు. పవన్ పిటిషన్ కొట్టివేత మరోవైపు, నిర్భయ కేసులో మరో దోషి పవన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నేరానికి పాల్పడిన సమయానికి మైనర్ అయినందున తనకు విధించిన ఉరిశిక్షపై సమీక్ష జరపాలంటూ అతడు పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆఖరి అవకాశంగా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇలా ఉండగా, న్యాయం దక్కే దాకా పోరాటం కొనసాగిస్తామని నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో అన్నారు. ఉరిశిక్ష వాయిదా పడేలా దోషులు వ్యవహరిస్తున్న తీరుపై చర్చ జరగాల్సి ఉందని హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మరోవైపు, హేయమైన నేరాలకు విధించిన ఉరిశిక్ష అమలుపై బాధితుల కోణంలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందంటూ కేంద్రం వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
మా డబ్బులు ఇప్పించండి!
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడో రెండేళ్ల క్రితం 2016 ఫిబ్రవరిలో దక్షిణాసియా (శాఫ్) క్రీడలు జరిగితే విజేతలకు ప్రకటించిన ప్రోత్సాహకాలు మాత్రం ఇప్పటికీ దక్కలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన నగదు పురస్కారాల కోసం ఇప్పటికీ ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ ఆటగాళ్లు తిరగాల్సిన పరిస్థితి... చివరకు నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా ఆటగాళ్లకు డబ్బులు అందలేదు! కామన్వెల్త్ క్రీడలకు బయల్దేరాల్సిన సమయంలో తమకు రావాల్సిన డబ్బు కోసం క్రీడాకారులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ తమ సమస్య తీరకపోవడంతో ఆవేదనగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పి. సుమీత్ రెడ్డి ‘శాఫ్’ క్రీడల పురుషుల డబుల్స్, టీమ్ విభాగాల్లో రెండు స్వర్ణాలు సాధించాడు. నిబంధనల ప్రకారం అతనికి రూ. 8.10 లక్షలు రావాల్సి ఉంది. అయితే అతనికి ఒక్క పైసా అందలేదు. తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించమంటూ ఈ నెల 20న సుమీత్... రాష్ట్ర క్రీడా శాఖ మంత్రికి లేఖ రాశాడు. నిజానికి గత డిసెంబర్ 30న అకౌంట్ విభాగం మొత్తం రూ. 65 లక్షల 20 వేలు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కానీ అధికారులు మూడు నెలలుగా తిప్పుతూనే ఉన్నారు. కామన్వెల్త్ క్రీడలకు వెళ్లాల్సిన సమయంలో ప్రభుత్వం తమకు అండగా నిలవాలని వారు కోరుతున్నారు. ఈ జాబితాలో సుమీత్‌తో పాటు షట్లర్లు సిక్కి రెడ్డి (రూ. 12.6 లక్షలు), మనీషా (రూ.6.6 లక్షలు), రుత్విక (రూ.9.6 లక్షలు), పీవీ సింధు (రూ.7.6 లక్షలు), జ్వాల (రూ.8.1 లక్షలు), సాయిప్రణీత్ (రూ. 3.6 లక్షలు) ఉన్నారు. ఇతర క్రీడాకారుల్లో అథ్లెట్ ప్రేమ్‌కుమార్‌కు రూ. 4 లక్షలు... మహేందర్ రెడ్డి, తేజస్విని (కబడ్డీ), రంజిత్, నందిని (ఖోఖో)లకు తలా రూ.1.25 లక్షలు రావాల్సి ఉంది. -
మా బడి.. మాకే కావాలి
హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు విద్యార్థుల లేఖలు పెద్దపల్లి రూరల్: ‘మా బడి మాకే కావాలి.. మా పాఠశాలను తిరిగి ప్రారంభించేలా అధికారులకు ఆదేశాలివ్వండి..’ అంటూ పెద్దపల్లి జిల్లాలోని బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు గురువారం లేఖలు రాశారు. ప్రభుత్వం పాఠశాలలను మూసివేయవద్దంటూ అధికారులను ఆదేశించినప్పటికీ ఆ ఉత్తర్వులను అమలు చేయడం లేదంటూ ఉత్తరాల్లో పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిందన్న నెపంతో ఇక్కడ పని చేసే ఉపాధ్యాయులను వివిధ పాఠశాలలకు డిప్యుటేషన్‌పై పంపించి తమ చదువులకు ఆటంకం కలిగించడం సరికాదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ పాఠశాలను పునఃప్రారంభించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని చీఫ్ జస్టిస్‌ను లేఖల ద్వారా వేడుకున్నారు.