న్యూఢిల్లీ: ‘నిర్భయ’దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు శిక్షను అమలు చేయరాదంటూ ఢిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. చట్టపరంగా తమలో కొందరికి మిగిలి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాల్సి ఉన్నందున శిక్ష అమలును నిరవధికంగా వాయిదా వేయాలంటూ దోషులు పెట్టుకున్న పిటిషన్‌పై అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
నిర్భయ కేసులో దోషులైన పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్, ముకేశ్ కుమార్ సింగ్‌లను ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలంటూ కోర్టు జనవరి 17వ తేదీన ఆదేశించిన విషయం తెలిసిందే. వినయ్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి కోవింద్ వద్ద పెండింగ్‌లో ఉండగా, మిగతా ఇద్దరు చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉరి శిక్ష అమలును వాయిదా వేయాలంటూ దోషులు పవన్, వినయ్, అక్షయ్‌ల తరఫున లాయర్ ఏపీ సింగ్ గురువారం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం జడ్జి ధర్మేందర్ రాణా విచారణ చేపట్టారు. నలుగురిలో ఏ ఒక్కరి పిటిషన్ పెండింగ్‌లో ఉన్నా మిగతా వారిని ఉరి తీయడం నిబంధనలకు విరుద్ధమని దోషుల తరఫు న్యాయవాది వాదించారు. ఏకీభవించిన న్యాయమూర్తి డెత్ వారెంట్లను వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చారు.
పవన్ పిటిషన్ కొట్టివేత
మరోవైపు, నిర్భయ కేసులో మరో దోషి పవన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నేరానికి పాల్పడిన సమయానికి మైనర్ అయినందున తనకు విధించిన ఉరిశిక్షపై సమీక్ష జరపాలంటూ అతడు పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆఖరి అవకాశంగా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇలా ఉండగా, న్యాయం దక్కే దాకా పోరాటం కొనసాగిస్తామని నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో అన్నారు. ఉరిశిక్ష వాయిదా పడేలా దోషులు వ్యవహరిస్తున్న తీరుపై చర్చ జరగాల్సి ఉందని హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మరోవైపు, హేయమైన నేరాలకు విధించిన ఉరిశిక్ష అమలుపై బాధితుల కోణంలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందంటూ కేంద్రం వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
‘నిర్భయ’ దోషుల ఉరి మళ్లీ వాయిదా
Published Sat, Feb 1 2020 4:19 AM | Last Updated on Sat, Feb 1 2020 5:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment