న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరితీతకు ఇంకా కొన్ని గంటలే(అన్నీ సజావుగా సాగితే) మిగిలి ఉన్న వేళ వరుసగా వాళ్లకు కోర్టులు షాకిస్తున్నాయి. నిర్భయ దోషులు పవన్ గుప్తా, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ దాఖలు చేసిన వివిధ పిటిషన్లను ఢిల్లీ కోర్టు, ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టు కొట్టివేశాయి. సుప్రీంకోర్టు సైతం పవన్ గుప్తా క్యూరేటివ్ పిటిషన్‌ను గురువారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మరో కొన్ని గంటల్లో వారిని ఉరితీసేందుకు తీహార్ జైలు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే డమ్మీ ఉరి కూడా పూర్తైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టు వద్ద గురువారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. (నిర్భయ దోషులకు ఏ అవకాశాలు లేవు: ఢిల్లీ కోర్టు)
ఈ నేపథ్యంలో దోషుల పిటిషన్లపై వాదోపవాదాలు జరుగుతున్న వేళ అక్షయ్ ఠాకూర్ భార్య పునీతా దేవి కోర్టు ప్రాంగణంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డను తన పక్కనే కూర్చోబెట్టుకున్న ఆమె... చెప్పులతో తన ముఖంపై కొట్టుకుంటూ... బిగ్గరగా ఏడ్చారు. ఈ క్రమంలో స్పృహ తప్పిపడిపోయారు. మెలకువ వచ్చిన తర్వాత మళ్లీ అదే విధంగా చేస్తూ... ‘‘నాకు బతకాలని లేదు. శిక్ష అమలైతే నేను చచ్చిపోతా’’ అంటూ బెదిరింపులకు దిగారు. కాగా అక్షయ్ భార్య ఇదివరకే తనకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ‘‘ నా భర్త అమాయకుడు. ఆయనను ఉరి తీసేముందు నాకు చట్టపరంగా విడాకులు కావాలి. ఎందుకంటే నేను అత్యాచార దోషి భార్యగా ఉండాలనుకోవడం లేదు’’ అని ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక నిర్భయ దోషులను మార్చి 20 ఉదయం 5.30 గంటలకు ఉరితీయాలంటూ డెత్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉరిశిక్షను నిలిపివేసేందుకు దోషులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.(‘ప్రతీకారమే శక్తికి నిర్వచనం కాదు’)
Comments
Please login to add a commentAdd a comment