కోర్టు వద్ద నిర్భయ తల్లిదండ్రులు
న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్యకేసులో దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలుకు తేదీ ఖరారయ్యింది. నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు తాజాగా డెత్ వారంట్ జారీచేసింది. రోజుకో మలుపు తిరుగుతూ యావత్ దేశం దృష్టినీ ఆకర్షిస్తోన్న నిర్భయ కేసులో దోషులకు మార్చి 3న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలుచేయాలని ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. ఇంకా దోషులకు శిక్ష అమలును ఆలస్యం చేయడం బాధితుల హక్కులకు భంగకరమని కోర్టు వ్యాఖ్యానించింది. ముకేశ్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ కుమార్ శర్మ(26), అక్షయ్‌కుమార్(31)లకు మార్చి 3వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరి శిక్ష అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించాలని కోర్టు ఆదేశించడం ఇది మూడోసారి.
జనవరి 7, 2020 తేదీన కోర్టు ఇచ్చిన ఆదేశాలు మార్చి 3న అమలులోకి వస్తాయని ఢిల్లీ కోర్టు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా వెల్లడించారు. దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ జనవరి 7, 2020న కోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే జనవరి 17, జనవరి 31న రెండు సార్లు దోషులకు విధించిన మరణశిక్ష వాయిదాపడింది. శిక్ష అమలును ఇంకా వాయిదా వేయడం వల్ల బాధితుల హక్కులకూ, సత్వర న్యాయానికీ నష్టమని కోర్టు అభిప్రాయపడింది. ‘నిర్భయ’ కేసులో నలుగురు దోషులకు కొత్తగా డెత్ వారంట్ జారీ చేసేందుకు ట్రయల్ కోర్టును ఆశ్రయించొచ్చంటూ సుప్రీంకోర్టు అధికారులకు స్వేచ్ఛనివ్వడంతో, నిర్భయ దోషుల తల్లిదండ్రులూ, ఢిల్లీ ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తులను పటియాలా హౌజ్ కోర్టు విచారించింది.
ఉరిశిక్ష అమలుపై నిర్భయ తల్లి ఆశాభావం
తన కుమార్తె నిర్భయపై సామూహిక అత్యాచారంచేసి, హత్య చేసిన నలుగురు దోషులకూ ఒకేసారి శిక్షపడుతుందని నిర్భయ తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు అమలు జరుగుతాయని ఆమె భావిస్తున్నానన్నారు.
క్షమాభిక్ష కోరతాం: పవన్, అక్షయ్
పవన్‌గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేయాలనీ, రాష్ట్రపతి ఎదుట క్షమాభిక్ష పిటిషన్ వేయాలని భావిస్తున్నట్టు న్యాయవాది రవిఖాజీ కోర్టుకి వెల్లడించారు. అలాగే, అక్షయ్ కూడా త్వరలోనే రాష్ట్రపతికి పూర్తిస్థాయిలో క్షమాబిక్ష పిటిషన్ దాఖలు చేస్తాడని న్యాయవాది ఏపీ సింగ్ కోర్టుకి విన్నవించారు.
వినయ్ శర్మ దీక్ష విరమణ
తీహార్ జైల్లో వినయ్ శర్మ నిరాహార దీక్ష చేస్తున్న విషయం కోర్టుకి తెలిసింది. ఆ తరువాత అతడు దీక్షను విరమించుకున్నట్టు కోర్టు వెల్లడించింది. వినయ్ మానసిక ఆరోగ్యం సరిగాలేనందున ఉరితీయడం కుదరదనీ అతడి తరఫు న్యాయవాది వాదించారు. అయితే కోర్టు ఈ వాదనని తోసిపుచ్చింది.
33 నెలలు...
దోషుల అప్పీల్‌ను 2017, మే 5న సుప్రీంకోర్టు కొట్టివేసింది. 33 నెలల తరువాత కూడా నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా ఎటువంటి క్యూరేటివ్ పిటిషన్‌ను గానీ, క్షమాభిక్ష పిటిషన్‌ని కానీ దాఖలు చేయలేదని కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయపరమైన అవకాశాలన్నింటినీ వినియోగించుకోని ఏకైక వ్యక్తి పవన్ గుప్తాయేనని కోర్టు వెల్లడించింది.
నిర్భయ దోషులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment