హెల్త్ ఇన్సూరెన్స్‌పై జీఎస్‌టీ తొలగించాలి
మరింత మందికి చేరువ చేయాలి
పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలపై ప్రశ్నార్థకం
బడ్జెట్ 2025పై పరిశ్రమ వర్గాల అంచనాలు
న్యూఢిల్లీ: పౌరులందరికీ బీమా రక్షణను చేరువ చేసే దిశగా 2025 బడ్జెట్‌లో కీలక చర్యలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘2047 నాటికి అందరికీ బీమా’ లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా ఇన్సూరెన్స్‌కు పన్ను ప్రయోజనాలు, ఆరోగ్య సంరక్షణకు ప్రోత్సాహకాలు కల్పించాని పరిశ్రమ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లింది.
దీనిపై ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో నవీన్ చంద్ర ఝా మాట్లాడుతూ.. రానున్న బడ్జెట్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ విస్తరణ దిశగా మరిన్ని చర్యలు ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘బీమా సుగమ్’కు నియంత్రణ, నిధుల పరమైన మద్దతు అవసరమన్నారు. ఆర్థిక సేవలు తగినంత అందుబాటులో లేని ప్రాంతాల్లోని వారికి బీమా సేవలు చేరువ చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం, సబ్సిడీలపైనా బడ్జెట్‌లో దృష్టి సారించొచ్చని అభిప్రాయపడ్డారు.
→ ఎన్‌పీఎస్ మాదిరి పన్ను ప్రయోజనాలను లైఫ్ ఇన్సూరెన్స్ యాన్యుటీ ఉత్పత్తులకు సైతం కల్పించాలని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఎండీ, సీఈవో తరుణ్ ఛుగ్ కోరారు. కొత్త పన్ను విధానంలోనూ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై పన్ను ప్రయోజనాన్ని కల్పించాలని, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేక పన్ను మినహాయింపు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
→ ఐఆర్‌డీఏఐ నివేదిక ఆధారంగా జీవిత బీమా విస్తరణ (జీడీపీలో) 2022–23లో ఉన్న 4 శాతం నుంచి 2023–24లో 3.7 శాతానికి తగ్గినట్టు తెలుస్తోంది.
→ బడ్జెట్‌లో పెన్షన్, యాన్యుటీ ప్లాన్లకు మద్దతు చర్యలు ఉండొచ్చని పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఎండీ, సీఈవో సమీర్ బన్సాల్ పేర్కొన్నారు. పెన్షనర్లకు ప్రోత్సాహకంగా యాన్యుటీ ప్లాన్ల ప్రీమియంపై జీఎస్‌టీని తొలగించాలని బన్సాల్ డిమాండ్ చేశారు. దీంతో యాన్యుటీలు మరింత అందుబాటులోకి వస్తాయన్నారు.
→ బీమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు, బీమా ఉత్పత్తుల స్వీకరణను ప్రోత్సహించే దిశగా సంస్కరణలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ అవకాశం కల్పిస్తోందని ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో సుబ్రత మోండల్ పేర్కొన్నారు. మరింత మంది బీమా రక్షణను తీసుకునేందుకు వీలుగా పన్ను రాయితీలు కల్పిస్తారన్న అంచనాను ఆయన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్ భారత్‌కు సైతం బడ్జెట్‌లో కేటాయింపులు పెంచొచ్చని భావిస్తున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని వారు, ఆర్థికంగా బలహీన వర్గాలకు బీమా అందుబాటులోకి వస్తుందన్నారు.
→ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్‌టీని తొలగించడం ఎంతో అవసరమని యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో శరద్ మాధుర్ అభిప్రాయపడ్డారు. బీమా మరింత మందికి చేరేందుకు వీలుగా ఆవిష్కరణలను ప్రోత్సహించాలని కోరారు.
సుంకాలు, లైసెన్సు ఫీజులు తగ్గించాలి
ఓటీటీలు కూడా యూఎస్‌వో ఫండ్‌కి నిధులివ్వాలి
కేంద్రానికి టెల్కోల బడ్జెట్ వినతులు
న్యూఢిల్లీ: 4జీ, 5జీ నెట్‌వర్క్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలను, లైసెన్సు ఫీజులను తగ్గించాలని కేంద్రాన్ని టెలికం సంస్థలు కోరాయి. అలాగే భారీగా డేటా వినియోగానికి కారణమయ్యే ఓటీటీ ప్లాట్‌ఫాంలు, స్ట్రీమింగ్ సేవల సంస్థలు (ఎల్‌టీజీ) కూడా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్‌వోఎఫ్)/డిజిటల్ భారత్ నిధి ఫండ్‌కి తప్పనిసరిగా చందా ఇచ్చేలా బడ్జెట్‌లో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ఈ మేరకు బడ్జెట్‌పై తమ వినతులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మొదలైనవి ఇందులో సభ్యులుగా ఉన్నాయి. లైసెన్సు ఫీజును 3 శాతం నుంచి 1 శాతానికి తగ్గిస్తే టెలికం సంస్థలపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని సీవోఏఐ తెలిపింది. ఇక తాము బోలెడంత ఖర్చు పెట్టి నెలకొల్పిన నెట్‌వర్క్‌ల ద్వారా కార్యకలాపాలు సాగిస్తూ, లాభాలు గడిస్తున్నా ఎల్‌టీజీలు .. పైసా కూడా కట్టడం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో అవి కూడా తమలాగే యూఎస్‌వో ఫండ్‌కి చందా కట్టేలా చూడాలని కోరింది. తమపై విధిస్తున్న యూఎస్‌వో లెవీని పూర్తిగా తొలగించవచ్చని లేదా ప్రస్తుతమున్న రూ. 86,000 కోట్ల కార్పస్ పూర్తిగా ఖర్చు చేసేంతవరకైనా చందాలను నిలిపివేయొచ్చని సీవోఏఐ పేర్కొంది. టెల్కోలపై సుంకాల భారాన్ని తగ్గించడం, పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించడం వల్ల దేశ భవిష్యత్తుపై వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టినట్లవుతుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment