‘టాప్’లో సుమీత్, మనూ
జ్వాల, అశ్వినిలకు కూడా
కేంద్ర క్రీడా శాఖ ప్రకటన
న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశం ఉన్న ఆటగాళ్లకు మరింత అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జంట సుమీత్ రెడ్డి, మను అత్రిలకు చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన సుమీత్ రెడ్డి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనూ అత్రి జతగా ఇటీవల కాలంలో అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. ఈ ఏడాది నాలుగు టోర్నీల్లో ఈ జంట ఫైనల్‌కు చేరగా... రెండింట్లో విజేతగా నిలిచి, మరో రెండింట్లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
వీరితో పాటు ఇన్నాళ్లుగా ‘టాప్’లో చోటు కోసం నిరసన గళం వినిపిస్తున్న మహిళల డబుల్స్ జంట గుత్తా జ్వాల, అశ్వినిలకు కూడా చోటు కల్పించారు. ఈ నలుగురి పేర్లతో క్రీడా శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తమకు ఎలాంటి వసతులు, శిక్షణ కావాలో డబుల్స్ చీఫ్ కోచ్ కిమ్ టాన్ హర్‌తో సంప్రదింపులు జరపాలని వీరికి క్రీడా శాఖ సూచించింది. 2016 రియో ఒలింపిక్స్ కోసం ‘టాప్’లో ఉన్న ఆటగాళ్లకు ఎన్‌ఎస్‌డీఎఫ్ నుంచి భారీగా నిధులు అందుతాయి. గత ఏప్రిల్‌లో సైనా, సింధు, కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్, ప్రణయ్‌లతో కూడిన తొలి జాబితా విడుదలయ్యింది. దీంతో తమకు కూడా చోటు కల్పించాలని జ్వాల జోడి విజ్ఞప్తి చేస్తూ వచ్చింది.