మెల్‌బోర్న్: గత ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్‌కు దూరంగా ఉన్న ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లోస్ అల్‌కరాజ్ ఈ ఏడాది మాత్రం జోరు మీదున్నాడు. మరో అలవోక విజయంతో ఈ స్పెయిన్ స్టార్ తొలిసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 20 ఏళ్ల అల్‌కరాజ్ 6–4, 6–4, 6–0తో మియోమిర్ కెచ్‌మనోవిచ్ (సెర్బియా)పై గెలిచాడు.
గంటా 49 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్ ఐదు ఏస్‌లు సంధించాడు. 43 విన్నర్స్ కొట్టిన ఈ మాజీ నంబర్‌వన్ 19 అనవసర తప్పిదాలు చేశాడు. ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన అల్‌కరాజ్ తన సర్విస్‌లో మాత్రం ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో అల్‌కరాజ్ తలపడతాడు.
హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 4 గంటల 5 నిమిషాల్లో 7–5, 3–6, 6–3, 4–6, 7–6 (10/3)తో 19వ సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్)ను ఓడించి ఊపిరి పీల్చుకున్నాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–3, 7–6 (7/4), 5–7, 6–1తో నునో బోర్జెస్ (పోర్చుగల్)పై, తొమ్మిదో సీడ్ హుర్కాజ్ (పోలాండ్) 7–6 (8/6), 7–6 (7/3), 6–4తో ఆర్థర్ కాజుక్స్ (ఫ్రాన్స్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు.
డయానా సంచలనం
మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 93వ ర్యాంకర్, క్వాలిఫయర్ డయానా యాస్‌ట్రెమ్‌స్కా సంచలన విజయంతో తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. కెరీర్‌లో 16వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న ఈ ఉక్రెయిన్ క్రీడాకారిణి ప్రిక్వార్టర్ ఫైనల్లో 7–6 (8/6), 6–4తో రెండుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్, 18వ సీడ్ అజరెంకా (బెలారస్)ను బోల్తా కొట్టించింది.
లిండా నొస్కోవా (చెక్ రిపబ్లిక్), అనా కలిన్‌స్కాయ (రష్యా) కూడా తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరగా... చైనా అమ్మాయి, 12వ సీడ్ కిన్‌వెన్ జెంగ్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. నొస్కోవా 3–0తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి స్వితోలినా (ఉక్రెయిన్) గాయంతో వైదొలిగింది. కిన్‌వెన్ జెంగ్ 6–0, 6–3తో ఒసీన్ డోడిన్ (ఫ్రాన్స్)పై, కలిన్‌స్కాయ 6–4, 6–2తో జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment