గ్రాండ్‌స్లామ్‌ ఓపెనింగ్‌ ఎవరిదో | Australian Open from today | Sakshi
Sakshi News home page

గ్రాండ్‌స్లామ్‌ ఓపెనింగ్‌ ఎవరిదో

Published Sun, Jan 12 2025 2:22 AM | Last Updated on Sun, Jan 12 2025 2:22 AM

Australian Open from today

అల్కరాజ్, సినెర్‌లే ఫేవరెట్లు 

హ్యాట్రిక్‌ వేటలో సబలెంకా  

నేటి నుంచి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ 

ఉ. గం. 5:30 నుంచి ‘సోనీ’ నెట్‌ వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం

కొత్త తరం చాంపియన్లు కార్లోస్‌ అల్కరాజ్, యానిక్‌ సినెర్‌ ఒక వైపు... ఆల్‌టైమ్‌ గ్రేట్, 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ ఇలా హేమాహేమీలంతా ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌తో ఈ సీజన్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పాలని పట్టుదలతో ఉన్నారు.  

మహిళల సింగిల్స్‌లో గత రెండేళ్లుగా విజేతగా నిలుస్తున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ అరినా సబలెంక ‘హ్యాట్రిక్‌’ టైటిల్‌పై కన్నేయగా, స్వియాటెక్, కోకో గాఫ్‌లు కూడా ఈ సీజన్‌కు విజయంతో శుభారంభం పలకాలని చూస్తున్నారు. 

మెల్‌బోర్న్‌: సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ కోసం రంగం సిద్ధమైంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) గత సీజన్‌ ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌ విజయంతో జోరుమీదున్నాడు. 23 ఏళ్ల ఇటలీ సంచలనం డోపింగ్‌ మరక దరిమిలా ఎదురవుతున్న విమర్శలను టైటిల్‌ నిలబెట్టుకొని అధిగమించాలనే పట్టుదలతో ఉన్నాడు. 

మరోవైపు నాదల్‌ శకం తర్వాత స్పెయిన్‌ జైత్రయాత్రకు కొత్త చిరునామాగా అల్కరాజ్‌ ఎదిగాడు. 21 ఏళ్ల వయసులోనే ఇప్పటికే నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను సాధించేశాడు. 2022లో యూఎస్‌ ఓపెన్, 2023లో ప్రతిష్టాత్మక వింబుల్డన్, గతేడాది వరుసగా ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌లను గెలుచుకున్నాడు. అయితే నాలుగు గ్రాండ్‌స్లామ్‌లనైతే గెలిచాడు.... కానీ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ వెలితి మాత్రం అలాగే వుంది. 

ఇక్కడ గత సీజన్‌లో క్వార్టర్‌ఫైనల్లో నిష్క్రమించిన ఈ స్పెయిన్‌ స్టార్‌ బహుశా ఈ ఏడాది ఆ ముచ్చట తీర్చుకుంటాడేమో చూడాలి. మరో వైపు ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకరైన 37 ఏళ్ల సెర్బియన్‌ దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ 25వ రికార్డు గ్రాండ్‌స్లామ్‌పై దృష్టిపెట్టాడు. వీరితో పాటు 27 ఏళ్ల జర్మనీ స్టార్, రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) గత సెమీఫైనల్‌ అంచెను దాటాలనే పట్టుదలతో ఉన్నాడు.   

జొకో గెలిస్తే రజతోత్సవమే! 
గతేడాది సెర్బియన్‌ సూపర్‌ స్టార్‌ జొకోవిచ్‌ సెమీఫైనల్స్‌తో సరిపెట్టుకున్నాడు. అంతమాత్రాన 37 ఏళ్ల వెటరన్‌ ప్లేయర్‌లో సత్తా తగ్గిందంటే పొరబడినట్లే. తనకు బాగా అచ్చొచ్చిన ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో పది టైటిళ్లు గెలిచిన నొవాక్‌ 11వ సారి విజేతగా నిలిస్తే గ్రాండ్‌స్లామ్‌ల రజతోత్సవాన్ని (25వ) మెల్‌బోర్న్‌లో జరుపుకుంటాడు. ఏడో సీడ్‌గా ఆసీస్‌ ఓపెన్‌ మొదలుపెట్టబోతున్న నొవాక్‌కు ఇక్కడ ఘనమైన రికార్డు ఉంది. 

2011–13 హ్యాట్రిక్, 2019–21 హ్యాట్రిక్‌లు సహా 2008, 2015, 2016, 2023లలో విజేతగా నిలిచిన విశేషానుభవం సెర్బియన్‌ సొంతం. రష్యా స్టార్, ఐదో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ ఫైనల్‌కు వచి్చన మూడుసార్లు టైటిల్‌ వేటలో చతికిలబడ్డాడు. రష్యన్‌ స్టార్‌ 2021, 2022లతో పాటు గత సీజన్‌లో సినెర్‌ చేతిలో అమీతుమీలో మూడో ‘సారీ’ టైటిల్‌ను కోల్పోయాడు. 

ఇప్పుడు ఫామ్‌లో ఉన్న సినెర్, అల్కరాజ్‌లను అధిగమించి విజేతగా నిలువడం అంత సులువైతే కాదు. ఆరో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే), 9వ సీడ్‌ అండ్రీ రుబ్లెవ్‌ (రష్యా)లు సంచలన స్టార్లకు షాక్‌లిచ్చేందుకు సిద్ధమయ్యారు. తొలిరౌండ్లలో షెవ్‌చెంకో (కజకిస్తాన్‌)తో అల్కరాజ్, ఫ్రాన్స్‌ వైల్డ్‌కార్డ్‌ ప్లేయర్‌ లుకాస్‌ పౌలీతో జ్వెరెవ్, నికోలస్‌ జెర్రీ (చిలీ)తో టాప్‌సీడ్‌ సినెర్‌ ఆసీస్‌ ఓపెన్‌ను ప్రారంభిస్తాడు. 

హ్యాట్రిక్‌ వేటలో సబలెంక 
మహిళల సింగిల్స్‌లో బెలారస్‌ స్టార్‌ ప్లేయర్‌ అరియానా సబలెంక ‘హ్యాట్రిక్‌’ కలను సాకారం చేసుకునే పనిలోవుంది. 26 ఏళ్ల ఈ టాప్‌సీడ్‌ గత రెండేళ్లుగా (2023, 2024లలో) టైటిళ్లను నిలబెట్టుకుంటోంది. ఈ సీజన్‌లో ఆమె... స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా)తో తొలిరౌండ్‌ సమరానికి సిద్ధమైంది. మిగతా మేటి ప్లేయర్లలో  20 ఏళ్ల అమెరికన్‌ మూడో సీడ్‌ కోకో గాఫ్‌ సహచర ప్లేయర్‌ సోఫియా కెనిన్‌తో తలపడుతుంది. 2

024 సీజన్‌లో ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌లలో వరుసగా సెమీఫైనల్స్‌ చేరిన గాఫ్‌ ఈ సారి సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉంది. పోలండ్‌ సూపర్‌స్టార్‌ 23 ఏళ్ల ఇగా స్వియాటెక్‌... చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన కెటెరినా సినియకొవాతో ఆసీస్‌ ఓపెన్‌ను ఆరంభించనుంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ (2022, 2023, 2024) హ్యాట్రిక్‌ విజేతకు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మాత్రం కలిసిరావడం లేదు. 

ఇక్కడ కనీసం ఆమె క్వార్టర్‌ ఫైనల్‌ కూడా చేరలేకపోవడం గమనార్హం. మూడుసార్లు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. గతేడాది అయితే మూడో రౌండ్‌నే దాటలేకపోయింది. ఇప్పుడు రెండో సీడ్‌గా ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ పరీక్షకు సిద్ధమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement