భారత బ్యాడ్మింటన్ ముఖచిత్రం గత పదేళ్లలో ఎంతగానో మారింది. అయితే గొప్ప విజయాలన్నీ సింగిల్స్‌లోనే వస్తుండటం... డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫలితాలు మరీ గొప్పగా లేకపోవడంతో ఏదో లోటుగా కనిపించేది. అయితే కొంతకాలంగా డబుల్స్‌లోనూ మన వాళ్లు మెరిపించి, మురిపిస్తున్నారు. ఒకప్పుడు బలహీన విభాగం అనే స్థాయి నుంచి నేడు బలమైన విభాగం స్థాయికి డబుల్స్ కేటగిరీ ఎదిగింది.
సాక్షి క్రీడావిభాగం: ఇప్పటివరకు భారత బ్యాడ్మింటన్ చరిత్రను పరిశీలిస్తే సింగిల్స్ విభాగానికి ఇచ్చినంత ప్రాధా న్యం డబుల్స్‌కు ఇవ్వలేదు. అయితే ఇప్పుడిపుడే ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. డబుల్స్ విభాగాలకు ప్రత్యేక కోచ్‌ను ఏర్పాటు చేశాక నెమ్మదిగా ఫలితాలు వస్తున్నాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్స్ జోడీల ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. 2006, 2010, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లలో మలేసియా జట్టు మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో విజేతగా నిలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఏ రకంగా చూసినా మలేసియా జట్టు పటిష్టమైనదే. డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి, ప్రణవ్ చోప్రా అద్భుతంగా ఆడి మలేసియాను ఓడించి తొలిసారి భారత్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించారు.
ఆశలు రేకెత్తిస్తూ...
కామన్వెల్త్ గేమ్స్‌లోనే కాకుండా గతేడాది కాలంగా పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ జంట అద్భుత ఫలితాలు సాధిస్తోంది. తమకంటే మెరుగైన జోడీలకు గట్టిపోటీనిస్తూ, ఒక్కోసారి వారిని ఓడిస్తూ సంచలన విజయాలు సాధిస్తోంది. ముఖ్యంగా 17 ఏళ్ల సాత్విక్ ఆటతీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆరు అడుగుల ఎత్తు ఉన్న సాత్విక్ సంధిస్తున్న స్మాష్‌లు, భాగస్వాములతో కనబరుస్తున్న సమన్వయం అతనికి ఉజ్వల కెరీర్ ఉందని చెబుతున్నాయి. మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్వినితో కలిసి సాత్విక్ అద్భుత ఆట కనబరుస్తున్నాడు. 2016లో సాత్విక్–చిరాగ్ జంట నాలుగు అంతర్జాతీయ డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. మనీషాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆడిన సాత్విక్ 2016లో మూడు అంతర్జాతీయ టైటిల్స్ గెల్చుకున్నాడు. గతేడాది చిరాగ్‌తో కలిసి వియత్నాం ఇంటర్నేషనల్ టోర్నీ టైటిల్ గెలిచిన సాత్విక్... ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ రెండో రౌండ్‌లో చిరాగ్‌తో కలిసి ప్రపంచ రెండో ర్యాంక్ జంట మథియాస్ బో–మోగెన్సన్ (డెన్మార్క్) జంటను ఓడించినంత పనిచేశాడు. సూపర్ సిరీస్ స్థాయి టోర్నీల్లో ఇంతవరకు భారత పురుషుల డబుల్స్ జంటకు టైటిల్ లభించలేదు. ప్రస్తుతం సాత్విక్–చిరాగ్ శెట్టి ఆటతీరు పరిశీలిస్తే భవిష్యత్‌లో ఆ లోటు తీరుతుందనే నమ్మకం కనిపిస్తోంది.
అశ్విని అద్భుతః
కామన్వెల్త్ గేమ్స్‌లో అశ్విని పొన్నప్ప ప్రదర్శనను ఎంత ప్రశంసించినా తక్కువే. క్లిష్టమైన పరిస్థితుల్లో ఆమె ఒకేరోజు నాలుగు డబుల్స్ మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఫైనల్లో తొలి మ్యాచ్‌లో సాత్విక్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో అందించిన విజయం భారత శిబిరంలో నూతనోత్సాహన్ని నింపింది. 2007 నుంచి అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో కొనసాగుతున్న 28 ఏళ్ల అశ్విని మహిళల డబుల్స్‌లో వరుసగా మూడు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు నెగ్గడం విశేషం. 2010 గేమ్స్‌లో జ్వాలతో స్వర్ణం... 2014 గేమ్స్‌లో జ్వాలతో కలిసి రజతం... 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో సిక్కి రెడ్డితో కలిసి కాంస్యం సాధించింది. ఇవే కాకుండా ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో, ఉబెర్ కప్‌లో అశ్విని పతకాలు సాధించింది. జ్వాలతో భాగస్వామ్యం ముగిశాక కొంతకాలం తడబడిన అశ్వినికి సిక్కి రూపంలో మంచి భాగస్వామి లభించడంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.
సూపర్ సిక్కి...
డబుల్స్‌లో నిలకడగా రాణిస్తున్న మరో ప్లేయర్ సిక్కి రెడ్డి. తెలంగాణకు చెందిన 24 ఏళ్ల సిక్కి ఒకప్పుడు సింగిల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేది. 2008లో పుణేలో జరిగిన కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో మహిళల సింగిల్స్‌లో సైనా విజేతగా నిలువగా... సిక్కి రెడ్డి రన్నరప్‌గా నిలిచింది. మహిళల డబుల్స్‌లో తులసీతో కలిసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే గాయాల కారణంగా డబుల్స్‌వైపు మొగ్గు చూపిన ఆమె ఈ విభాగంలోనూ రాణిస్తూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో అశ్వినితో కలిసి మహిళల డబుల్స్‌లో కాంస్యం గెలిచిన సిక్కి... గతేడాది సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ మహిళల డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. అదే టోర్నీలో ప్రణవ్ చోప్రాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో టైటిల్ గెలిచింది. 2016లో ప్రణవ్‌తోనే కలిసి రష్యా, బ్రెజిల్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. 2014, 2016 ఉబెర్ కప్‌లో టీమ్ విభాగంలో... 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉన్న సిక్కి ఓవరాల్‌గా తొమ్మిది అంతర్జాతీయ టైటిల్స్‌ను గెల్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment