సిక్కిరెడ్డికి స్వర్ణం | sikki reddy get gold medal in Commonwealth | Sakshi
Sakshi News home page

సిక్కిరెడ్డికి స్వర్ణం

Published Tue, Apr 10 2018 1:53 PM | Last Updated on Tue, Apr 10 2018 1:53 PM

sikki reddy get gold medal in Commonwealth - Sakshi

జాతీయ జెండా, సాధించిన గోల్డ్‌ మెడల్‌తో సిక్కిరెడ్డి

అంతర్జాతీయ వేదికపై ఓరుగల్లు క్రీడాతేజం ప్రతిభ కనబరిచింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో వరంగల్‌ ముద్దుబిడ్డ సిక్కిరెడ్డి షటిల్‌ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బంగారు పతకం సాధించింది. భారత కీర్తిపతాకను ప్రపంచపటాన రెపరెపలాడించింది. ఇప్పటికే షటిల్‌ బ్యాడ్మింటన్‌లో అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న ఆమె ప్రతిష్టాత్మక కామన్‌వెల్త్‌ క్రీడల్లో గోల్డ్‌మెడల్‌ సాధించడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా క్రీడాకారులు, క్రీడాభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

వరంగల్‌ రూరల్‌, నర్సింహులపేట(డోర్నకల్‌): ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ నగరంలో జరుగుతున్న కామన్‌వెల్త్‌ క్రీడల్లో షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి నెలకుర్తి సిక్కిరెడ్డి స్వర్ణం సాధించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించి భారత కీర్తిపతాకను ప్రపంచపటాన రెపరెపలాడించారు. డబుల్‌ మిక్స్‌డ్‌ విభాగం ఫైనల్‌ మ్యాచ్‌లో మలేషియాకు చెందిన వివాన్‌ షూ, మీ కూన్‌ చౌతో ఇండియా తరఫున సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప తలపడ్డారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 21–18, 21–19 తేడాతో మలేషియా టీమ్‌పై గెలిచారు.

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామానికి చెందిన నెలకుర్తి కృష్ణారెడ్డి, మాధవి దంపతుల కుమార్తె సిక్కిరెడ్డి బాల్యం నుంచే ఆటలపై ఆసక్తి కనబరిచేవారు. కొన్నేళ్లుగా ఆమె హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 101 సార్లు ఇండియా తరఫున ప్రాతినిథ్యం వహించి పోటీల్లో పాలొన్నారు. 16 బంగారు పతకాలు, మూడు బ్రాంజ్, ఐదు సిల్వర్‌ పతకాలు సాధించారు. ఆమె ప్రపంచంలో పాకిస్థాన్‌ మినహా షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడలు జరిగిన దాదాపు అన్ని దేశాల్లో ఆడడం విశేషం. ఎంబీఏ పూర్తి చేసిన సిక్కిరెడ్డి షటిల్‌ బ్యాడ్మింటన్‌లో నంబర్‌ వన్‌ ర్యాంకింగ్‌ కోసం శిక్షణ తీసుకుంటున్నారు. దక్షిణ కొరియాలో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొని బ్రాంజ్‌ మెడల్‌ సాధించినందుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో ఆమెకు ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం ఇచ్చారు.

ఆమె సాధించిన మరికొన్ని ప్రముఖ టైటిల్స్‌
2013లో జరిగిన బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి జంట స్వర్ణం సాధించింది.  
మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి ద్వయం రన్నరప్‌గా నిలిచింది.
పోలిష్‌ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీని సిక్కిరెడ్డి జోడీ గెలుచుకుంది.
తొలిసారిగా భారత మహిళా జట్టు ఉబెర్‌ కప్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టించిన ఘనత కూడా సిక్కిరెడ్డిదే కావడం విశేషం.  

గోపీచంద్‌ అకాడమీలోమూడో క్రీడాకారిణి
2004 నుంచి సింగిల్స్‌లోనే షటిల్‌ ఆడిన సిక్కిరెడ్డికి 2010లో మోకాలికి సర్జరీ కావడంతో  డబుల్స్‌లోనే ఆడుతున్నారు. కొన్నేళ్లుగా గోపీచంద్‌ అకాడమీలో బ్యాడ్మింటన్లో శిక్షణ పొందుతూ అంతర్జాతీయ స్థాయి టైటిల్‌ దక్కించుకున్న వారిలో సిక్కిరెడ్డి మూడో క్రీడాకారిణి. మొదటి, రెండు స్థానాల్లో సైనా నెహ్వాల్, సింధూ ఉన్నారు. వారు సింగిల్‌ ప్లేయర్స్‌ కాగా.. సిక్కిరెడ్డి డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సత్తా చాటుతున్నారు. ప్రతిష్టాత్మక కామన్‌వెల్త్‌ క్రీడల్లో గోల్డ్‌మెడల్‌ సాధించడంతో క్రీడాకారులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement