Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page
breaking news

ప్రధాన వార్తలు

YSR Jayanthi 2025: YS Jagan Pays Tributes YSR at YSR Ghat Tweet Updates1
YSR Jayanthi: ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద వైఎస్‌ జగన్‌ నివాళి

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 76వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సతీమణి విజయమ్మ, వైఎస్‌ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు.వైఎస్‌ జగన్‌ రాకతో ఇడుపులపాయ కోలాహలంగా మారింది. జననేతను చూసేందుకు, కరచలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు భారీ ఎత్తున అభిమానులు ఘాట్‌ వద్దకు పోటెత్తారు.

Nallapareddy Prasanna Kumar Allegations On Vemireddy Prashanthi reddy2
నా తల్లిని బెదిరించారు.. నేను ఇంట్లో ఉంటే చంపేవారు: ప్రసన్నకుమార్‌

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో టీడీపీ మూకలు అరాచకం సృష్టించాయి. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. ఈ నేపథ్యంలో పచ్చ మూకల దాడిపై ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంట్లో ఉంటే ఆయనను కచ్చితంగా హత్య చేసేవారిని అన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిన్న రాత్రి నా నివాసం పై జరిగిన దాడి నన్ను హతమార్చడానికే అని అర్థమవుతోంది. నేను ఇంట్లో ఉండి ఉంటే నన్ను ఖచ్చితంగా చంపేసేవారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నా తల్లిని బెదిరించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయాలకు పాల్పడతారని అనుకోలేదు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చరిత్ర నెల్లూరు వాసులు అందరికీ తెలిసిన విషయమే. నేను చేసిన ప్రతీ వ్యాఖ్యకి కట్టుబడి ఉన్నాను. గతంలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. ఈ దాడి విషయంలో పోలీస్ శాఖ న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు లేదు. ఇటువంటి దాడులపై పవన్ కళ్యాణ్ స్పందించాలి. డిప్యూటీ సీఎం అయిపోయినంత మాత్రాన కుర్చీలో కూర్చుని పోవటం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. మరోవైపు.. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మీ మాట్లాడుతూ..‘200 మంది అరాచక వ్యక్తులు ఒక్కసారిగా ఇంట్లో ప్రవేశించారు. కంటికి కనపడిన వస్తువులు అన్నింటినీ ధ్వంసం చేశారు. నీ కుమారుడు ఎక్కడ అంటూ నన్ను బెదిరించారు. నాకు ఆరోగ్యం సరిగా లేదు. నిన్న రాత్రి జరిగిన ఘటనతో భయాందోళనకు గురయ్యాను. ఇలాంటి దాడులు ఏనాడు చూడలేదు. నా కుమారుడు ఇంట్లో ఉండి ఉంటే అతన్ని చంపేసేవారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. మారణాయుధాలతో దాడి..ఇదిలా ఉండగా.. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. 70–80 మంది సోమవారం రాత్రి 9 గంటల సమ­యంలో మారణాయుధాలతో నెల్లూరు నగరం సుజాతమ్మ కాలనీలోని ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. వారిని ఎవరూ గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను ముందుగా ధ్వంసంచేశారు. ఇంటి ముందు నుంచి కొందరు.. వెనుక వైపు కిచెన్‌ తలు­పులను పగులగొట్టి మరికొందరు లోపలికి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. కింద గదితోపాటు పైభా­గంలోని గదిలో వస్తువులన్నింటినీ పగులగొట్టారు. అడ్డుకోబోయిన సిబ్బందిపైనా పచ్చమూకలు దాడిచేశాయి. పోర్టికోలో ఉన్న రెండు కార్లను ధ్వంసం చేశారు. అరగంట పాటు నానా బీభత్సం సృష్టిం­చారు. కంటి ఆపరేషన్‌ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ టీడీపీ మూకల దాడితో భీతిల్లిపోయి కుప్పకూలిపోయారు. తమతో పెట్టుకుంటే అంతుచూస్తామని, ఎవరిని వదిలిపెట్ట­బోమని దుండగులు హెచ్చరించారు.అయితే, పోలీసులు వస్తున్నా­రని తెలుసుకుని దుండగులు బైక్‌లపై పరార­య్యారు. దాడి సమాచారం అందుకున్న నెల్లూరు నగర డీఎస్పీ పి. సింధుప్రియ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. మంత్రి లోక్‌శ్‌ నెల్లూరులో ఉండగానే ఈ ఘటన జరగడం చూస్తే.. దీని వెనుక పెద్దస్థాయిలో కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రసన్నను హత్య చేసేందుకేనా?దుండగులు పథకం ప్రకారం నల్లపరెడ్డి ప్రసన్నకు­మా­ర్‌రెడ్డిని హత్యచేసేందుకే ఈ దుశ్చర్యకు ఒడిగ­ట్టినట్లు తెలుస్తోంది. రాత్రయితే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో ఉంటారని భావించిన దుండగులు మారణా­యుధాలతో ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆ సమయంలో ప్రసన్నకుమార్‌రెడ్డి లేకపోవడంతో ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. కోవూరు సమావేశం అనంతరం ప్రసన్న­కుమార్‌రెడ్డి, ఆయన కుమారుడు, స్థానిక నేతలతో కలిసి కోవూరులోనే ఉన్నారు. ఇంట్లో ఉండి ఉంటే ఆయన పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు.

Keeravani Father Sivadatta Passed AWAY3
సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి పితృవియోగం కలిగింది. కీరవాణి తండ్రి 'శివశక్తి దత్త' (92) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఆయన తెలుగు సినిమా గీత రచయిత, స్క్రీన్ రైటర్, చిత్రకారుడిగా గుర్తింపు పొందారు. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా గీత రచయితగా అనేక పాటలను రచించారు. ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘రామం రాఘవం’ ను ఆయనే రాశారు. అతను తెలుగు చిత్రాలలో సంస్కృతం ఆధారిత పాటలకు సాహిత్యాన్ని వ్రాసినందుకు ప్రసిద్ధి చెందారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్తా సోదరులు అనే విషయం తెలిసిందే.ఆంధ్ర ప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలోని కొవ్వూరుకు చెందిన శివశక్తి దత్తా అప్పట్లోనే ఇంటర్‌ వరకు చదువుకున్నారు. చిన్నప్పటి నుంచీ కళల వైపు మొగ్గు చూపిన అతను చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయి ముంబైలోని సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చేరారు . రెండు సంవత్సరాల తరువాత డిప్లొమా పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత మళ్లీ తన స్వస్థలం కొవ్వూరుకు తిరిగి వచ్చారు. చిత్రకారుడిగా కమలేష్ అనే కలం పేరును ఉపయోగించడం ప్రారంభించారు . తరువాత సుబ్బారావు తన పేరును శివ శక్తి దత్తగా మార్చుకున్నారు. దత్తాకు సంగీతంపై కూడా ఆసక్తి ఉంది. గిటార్ , సితార్ , హార్మోనియం వాయించడం నేర్చుకున్నారు.రాఘవేంద్రరావుతో తొలిసారి జానకి రాముడు (1988) కోసం స్క్రీన్ రైటర్‌గా శివశక్తి దత్తా పనిచేశారు. సై , చత్రపతి , రాజన్న , బాహుబలి: ది బిగినింగ్ , బాహుబలి 2: ది కన్‌క్లూజన్ , RRR , హను-మాన్ వంటి చిత్రాలలో వివిధ పాటలకు సాహిత్యం రాశారు . దర్శకుడిగా చంద్రహాస్‌ (2007) సినిమా కోసం ఆయన పనిచేశారు. బాహుబలి సినిమాలో 'సాహోరే బాహుబలి' , 'మమతల తల్లి' 'దీవర' వంటి సాంగ్స్‌ రాశారు.

We are close Trump On Making Trade deal with India4
భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి మరింత చేరువయ్యాం: ట్రంప్‌

భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందానికి మరింత చేరువయ్యామని వ్యాఖ్యానించారాయన. 14 దేశాలకు టారిఫ్ లేఖలు పంపిన తదనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజాగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూకు ఇచ్చిన ప్రైవేట్ డిన్నర్ సందర్భంగా ట్రంప్‌ భారత వాణిజ్య ఒప్పందంపై వ్యాఖ్యానించారు. ‘‘భారత్‌తో ఒక గొప్ప ఒప్పందం జరగబోతోంది. ఇది చాలా ప్రత్యేకమైన డీల్ అవుతుంది’’ అని అన్నారు. ఇప్పటికే యూకే, చైనాతో ఒప్పందాలు కుదిరాయన్న ఆయన.. ఇతర దేశాలు అమెరికా షరతులకు అంగీకరించకపోతే సుంకాల మోత తప్పదని హెచ్చరించారు. వారు(ఒప్పందాలకు దిగిరాని వారు) ఎంత టారిఫ్ చెల్లించాలో లేఖలో చెబుతున్నాం అని ట్రంప్‌ చెప్పారు. భారత్‌కు కలిగే లాభాలు:మార్కెట్ ప్రాప్యత: అమెరికా మార్కెట్‌కు భారత ఉత్పత్తులకు ఎగుమతుల అవకాశాలు పెరగొచ్చు.తక్కువ దిగుమతి సుంకాలు: భారత్‌కు వస్తువులు దిగుమతి చేసుకునే ఖర్చు తగ్గవచ్చు.టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్: మౌలిక సదుపాయాలు, హైటెక్ రంగాల్లో భాగస్వామ్యం మెరుగుకావొచ్చు.భద్రతా సహకారం: వ్యూహాత్మక మైత్రి బలపడే అవకాశం ఉంటుంది.మరోవైపు.. భారత వాణిజ్య ప్రతినిధి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం వాషింగ్టన్‌లో చర్చలు జరుపుతోంది. వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్‌లు, డిజిటల్ గోప్యత, పౌర హక్కులు వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఒప్పందం కుదరకపోతే, తాత్కాలికంగా నిలిపిన 26% దిగుమతి సుంకాలు మళ్లీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈ ఒప్పందం కుదిరితే మాత్రం రెండు దేశాల ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశం లేకపోలేదు. ఏ దేశాలపై.. ట్రంప్‌ ఎంతెంత టారిఫ్‌ (ఆగస్టు 1 నుంచి అమలు):దేశంటారిఫ్ శాతంజపాన్, దక్షిణ కొరియా, కజకస్తాన్, మలేషియా, ట్యునీషియా25%మయన్మార్, లావోస్40%దక్షిణాఫ్రికా, బోస్నియా30%ఇండోనేషియా32%బంగ్లాదేశ్, సెర్బియా35%కంబోడియా, థాయిలాండ్36%

Tamil nadu Cuddalore Train Hits School Van News Details5
స్కూల్‌వ్యాన్‌ను ఢీ కొన్న రైలు.. తమిళనాడులో ఘోర ప్రమాదం

తమిళనాడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరు జిల్లాలో మంగళవారం ఉదయం ఓ స్కూల్‌ వ్యాన్‌ పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.సాక్షి, చెన్నై: తమిళనాడు కడలూరులో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం చెమ్మంగుప్పం వద్ద ఓ స్కూల్‌ వ్యాన్‌ రైలు పట్టాలను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది విధ్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని తెలుస్తోంది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని, గేట్‌మెన్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం ధాటికి వ్యాన్‌ తునాతునకలైన దృశ్యాలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి.

ZIM VS SA 2nd Test: Wiaan Mulder Comments On Not Breaking Brian Lara Quadruple Century Record6
అందుకే లారా క్వాడ్రపుల్‌ సెంచరీ (400) రికార్డును బద్దలు కొట్టలేదు: వియాన్‌ ముల్దర్‌

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్‌ వియాన్‌ ముల్దర్‌ అజేయ ట్రిపుల్‌ సెంచరీతో (367) చెలరేగాడు. ఈ ట్రిపుల్‌తో ముల్దర్‌ చాలా రికార్డులను బద్దలు కొట్టాడు.విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్‌ స్కోర్‌ చేసిన ఆటగాడిగా..సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగా.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ ట్రిపుల్‌ సెంచరీ (297 బంతుల్లో) చేసిన ఆటగాడిగా..టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున హాషిమ్‌ ఆమ్లా (311 నాటౌట్‌) ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.ఈ రికార్డులన్నీ పక్కన పెడితే ముల్దర్‌ ఓ చారిత్రక రికార్డును బద్దలు కొట్టే సువర్ణావకాశాన్ని వదిలేసి వార్తల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో అత్యంత అరుదైన క్వాడ్రపుల్‌ సెంచరీ (400) చేసే అవకాశాన్ని ముల్దర్‌ చేజేతులారా జారవిడిచాడు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు విండీస్‌ దిగ్గజం​ బ్రియాన్‌ లారా మాత్రమే క్వాడ్రపుల్‌ సెంచరీ చేశాడు.మ్యాచ్‌ రెండో రోజు తొలి సెషన్‌లోనే ట్రిపుల్‌ సెంచరీ పూర్తి చేసిన ముల్దర్‌.. క్వాడ్రపుల్‌ సెంచరీకి 33 పరుగుల దూరంలో (367 నాటౌట్‌) ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.టెస్ట్‌ క్రికెట్‌లో ఎప్పుడో కాని ఇలాంటి అవకాశం రాదు. అలాంటిది ముల్దర్‌ ఈ అవకాశాన్ని వదిలేసి చారిత్రక తప్పిదం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ముల్దర్‌ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే మరో 20 బంతుల్లో ఈజీగా క్వాడ్రపుల్‌ సెంచరీ పూర్తయ్యేది. అయితే అతను అనూహ్యంగా లంచ్‌ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి సంచలన నిర్ణయం తీసకున్నాడు.తగినంత సమయం, అవకాశం ఉండి కూడా ముల్దర్‌ క్వాడ్రపుల్‌ సెంచరీని కాదనుకోవడాన్ని సగటు క్రికెట్‌ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. అత్యంత అరుదుగా వచ్చే అవకాశాన్ని కాదనుకొని ముల్దర్‌ చాలా పెద్ద తప్పిదం చేశాడని వాపోతున్నారు. ప్రస్తుత జమానాలో ఇలాంటి అవకాశం బహుశా ఎవరికీ రాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.ఈ ఇన్నింగ్స్‌ అనంతరం వియాన్‌ క్వాడ్రపుల్‌ సెంచరీని కాదనుకోవడంపై స్పందించాడు. లారా ఓ దిగ్గజం. అలాంటి ఆటగాడి పేరు మీదనే క్వాడ్రపుల్‌ సెంచరీ రికార్డు ఉండాలి. ఆ రికార్డును నిలబెట్టుకోవడానికి అతను అర్హుడు. నాకు మళ్లీ క్వాడ్రపుల్‌ సెంచరీ చేసే అవకాశం​ వచ్చినా ఇలాగే చేస్తాను. ఈ విషయాన్ని షుక్రీ కాన్రడ్‌తో (దక్షిణాఫ్రికా హెడ్‌ కోచ్‌) చెప్పాను. అతను కూడా నా అభిప్రాయంతో ఏకీభవించాడు. లంచ్‌ విరామం తర్వాత ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయడానికి మరో కారణం​ కూడా ఉంది. మ్యాచ్‌ గెలవడానికి సరిపడా స్కోర్‌ చేశామని భావించాను. ఈ రెండు కారణాల చేత ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసినట్లు చెప్పుకొచ్చాడు.MULDER TALKS ABOUT HIS DECLARATION:"Lara's Record is exactly where it Should be". pic.twitter.com/PWwKGlvoL6— Johns. (@CricCrazyJohns) July 7, 2025ముల్దర్‌ కామెంట్స్‌ విన్న తర్వాత యావత్‌ క్రికెట్‌ ప్రపంచం అతనికి సెల్యూట్‌ కొట్టింది. దిగ్గజాలను గౌరవించే సంస్కారవంతమైన క్రికెటర్‌ అంటూ జేజేలు పలికింది. లారా క్వాడ్రపుల్‌ రికార్డును త్యాగం చేసి చిరకాలం తన పేరును స్మరించుకునేలా చేశాడని కామెంట్లు చేస్తుంది. నిస్వార్థ నాయకుడు, గొప్ప ఆటగాడని కీర్తిస్తుంది. వ్యక్తిగత రికార్డులు కాకుండా జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకునే ఇలాంటి నాయకుడిని చూడలేమని జేజేలు పలుకుతుంది.వియాన్‌ లారా క్వాడ్రపుల్‌ సెంచరీ రికార్డు కాదనుకున్నా టెస్ట్‌ల్లో ఐదో అత్యధిక​ వ్యక్తిగత స్కోర్‌ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో అత్యధిక పరగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో లారా (400 నాటౌట్‌), మాథ్యూ హేడెన్‌ (380), బ్రియాన్‌ లారా (375), మహేళ జయవర్దనే (374) మాత్రమే ముల్దర్‌ కంటే ముందున్నారు.మ్యాచ్‌ విషయానికొస్తే.. ముల్దర్‌ అజేయ ట్రిపుల్‌ సెంచరీతో (334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు) చెలరేగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 626 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్‌ బెడింగ్హమ్‌ 82, లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌ 78, డెవాల్డ్‌ బ్రెవిస్‌ 30, వెర్రిన్‌ 42 (నాటౌట్‌) పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో చివంగ, మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. మసకద్జ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.అనంతరం సౌతాఫ్రికా బౌలర్లు కూడా రెచ్చిపోవడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఫాలో ఆన్‌ ఆడుతుంది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌ను సుబ్రాయన్‌ (10-1-42-4), కోడి యూసఫ్‌ (7-1-20-2), కార్బిన్‌ బాష్‌ (7-1-27-1), ముత్తస్వామి (13-2-59-1) కుప్పకూల్చారు. అజేయ ట్రిపుల్‌తో రికార్డులను తిరగరాసిన ముల్దర్‌ బౌలింగ్‌లోనూ రాణించాడు. 6 ఓవర్లలో 20 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సీన్‌ విలియమ్స్‌ (83 నాటౌట్‌) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఫాలో ఆన్‌ ఆడుతూ జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. 31 పరుగుల వద్ద ఆ జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే స్కోర్‌ 51/1గా ఉంది. కైటానో (34), నిక్‌ వెల్చ్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్‌ పరాజయాన్ని తప్పించుకోవాలంటే మరో 405 పరుగులు చేయాలి. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది.

Israels Benjamin Netanyahu Nominates Trump for Nobel Prize7
‘నోబెల్‌‌కు ట్రంప్‌ అర్హతలివే..’: నెతన్యాహు

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు, నమ్మకస్తులైన చట్టసభ సభ్యులు చాలాకాలంగా కోరుతూ వస్తున్నారు. ఇందుకు అనుగుణంగా వారు తమ నామినేషన్లను కూడా సమర్పించారు. ఇదే సమయంలో ట్రంప్‌ తనకు ఈ ప్రతిష్టాత్మ అవార్డు అందకపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారంటూ పలు వార్తలు కూడా వినిపించాయి.తాజాగా ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నోబెల్‌ బహుమతి కమిటీకి అధ్యక్షుడు ట్రంప్‌ను నామినేట్‌ చేస్తూ ఒక లేఖ రాశారు. శాంతిని నెలకొల్పడంలో ట్రంప్‌ తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఆయనను నామినేట్ చేస్తున్నట్లు నెతన్యాహు ఆ లేఖలో పేర్కొన్నారు. సోమవారం వైట్ హౌస్‌లో జరిగిన విందు కార్యక్రమంలో నెతన్యాహు తాను బహుమతి కమిటీకి పంపిన నామినేషన్ లేఖ కాపీని కూడా మీడియాకు అందజేశారు.‘అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే ఎన్నో ఘనమైన పురస్కారాలను, అవార్డులను అందుకున్నారు. ఇరు దేశాల మధ్య ఆయన శాంతిని నెలకొల్పారు. అందుకే నోబెల్ బహుమతి కమిటీకి ఆయనను నామినేట్‌ చేస్తూ లేఖ పంపాను. దీనిలో ఈ పురస్కారానికి అధ్యక్షుడు ట్రంప్‌ అర్హుడని తెలియజేశాను’ అని నెతన్యాహు పేర్కొన్నారు. మిడిల్‌ ఈస్ట్‌లో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలను నెతన్యాహు ఆ లేఖలో ప్రశంసించారు. ట్రంప్‌ నాయకత్వం, న్యాయమైన లక్ష్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఎంతో గొప్పవి. మధ్యప్రాచ్యంలో ఆయన శాంతిభద్రతలకు చేస్తున్న ప్రయత్నాలను ఇజ్రాయెలీయులకే కాకుండా పలువురు అభినందిస్తున్నారన్నారని నెతన్యాహు పేర్కొన్నారు.చాలా కాలంగా తనను తాను శాంతి దూతగా అభివర్ణించుకుంటున్న ట్రంప్ తాజాగా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు నామినేషన్ చూసి సంబరపడ్డారు. ఈ సందర్భంగా నెతన్యాహుకు కృతజ్ఞతలు చెబుతూ, ఇది చాలా అర్థవంతమైనదని పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకూ ముగ్గురు అమెరికా అధ్యక్షులు నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. 1906లో థియోడర్ రూజ్‌వెల్ట్, 1919లో వుడ్రో విల్సన్, 2009లో బరాక్ ఒబామా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఇది కూడా చదవండి: Maharashtra: బాల్‌ థాక్రే పాత వీడియో వైరల్.. ‘హిందీ’పై ఏమన్నారు?‌

Today 76th birth anniversary of the great leader YS Rajasekhara Reddy8
తెలుగు నేలంతా నీ అడుగు జాడలే..

కడలిపాలవుతున్న నదీ జలాలను మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి రూ.లక్ష కోట్ల వ్యయంతో పోలవరం, పులిచింతల, ఎల్లంపల్లితో పాటు 86 సాగునీటి ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టిన భగీరథుడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా.. పేదింటి పిల్లలు ఉన్నత విద్య చదివేలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆరోగ్యానికి భరోసా కల్పించే ఆరోగ్యశ్రీ వంటి విప్లవాత్మక పథకాలతో పాలకులకు టార్చ్‌బేరర్‌గా నిలిచిన పాలనాదక్షుడు..పారదర్శక పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు ప్రవహించేలా చేసి.. ఉపాధి అవకాశాలను సమృద్ధిగా కల్పించి.. మూడు పోర్టులు నిర్మించి ఎగుమతులకు ఉమ్మడి ఏపీని గమ్యస్థానంగా మార్చి, ఆర్థిక మాంద్యం ముప్పును అధిగమించడమెలాగో చాటిచెప్పిన ఆర్థికవేత్త..­సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత...పాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన సంస్కరణశీలి.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి..! ఆ మహా నేత 76వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..సాక్షి, అమరావతి : మనసు ఉండాలే కానీ ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చేతల్లో చాటారు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (వైఎస్సార్‌). ఉమ్మడి ఏపీకి ఆయన సీఎంగా పనిచేసినది ఐదేళ్ల మూడు నెలలే. ఆ కొద్ది కాలంలోనే మైలురాళ్లలాంటి సంక్షేమ పథకాలను, చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి కార్యకమ్రాలను చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వైఎస్‌ పథకాలను కొనసాగించక తప్పని పరిస్థితి. వాటి పేర్లు మార్చి వైఎస్‌ ముద్రను చెరిపేసేందుకు ప్రయత్నించిన ప్రభుత్వాలు విఫలమయ్యాయి. జనం కోసం ఎందాకైనా.. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. 1978లో రాజకీయ అరంగేట్రం నుంచి 2009 సెప్టెంబర్‌ 2న హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం వరకు తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. అటు కేంద్రంలో... ఇటు ఉమ్మడి రాష్ట్రంలో వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్‌ పార్టీ జీవచ్ఛవంలా మారిన దశలో పాదయాత్ర చేశారు వైఎస్సార్‌. మండుటెండలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి 2003 ఏప్రిల్‌ 9న ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించి 1,475 కిలోమీటర్లు నడిచి జూన్‌ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. కాంగ్రెస్‌ను 2004లో ఉమ్మడి రాష్ట్రం, కేంద్రంలో అధికారంలోకి తెచ్చారు. పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పిన నేత2004 మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్సార్‌ పునాది వేశారు. పంటలు పండక విద్యుత్‌ చార్జీలు కట్టలేని రైతులపై నాటి టీడీపీ సర్కారు రాక్షసంగా బనాయించిన కేసులను ఒకే ఒక్క సంతకంతో ఎత్తివేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ బకాయిలను మాఫీ చేశారు. 35 లక్షలకు పైగా పంపుసెట్లకు ఉచిత విద్యుత్‌ అందించారు. పంటలకు గిట్టుబాటు ధర కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. 2004–09 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాకు రూ.550 నుంచి రూ.1000 వరకు పెరగడమే దీనికి సాక్ష్యం. ఆరోగ్యశ్రీతో ప్రజారోగ్యానికి భరోసా రూ.168.52 కోట్లు..: 2004 మే 14–2007 జూన్‌ 26 మధ్య సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద వైఎస్సార్‌ విడుదల చేసిన మొత్తం. ఆ సమయంలో జబ్బునపడ్డ పేదల వేదన గమనించారు. ఆపత్కాలంలో సీఎం కార్యాలయానికి రావాల్సిన ప్రయాసకు స్వస్తి పలుకుతూ ఉచితంగా కార్పొరేట్‌ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. ప్రమాదంలో గాయపడినవారిని, అత్యవసర వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రికి తరలించేలా 108 అంబులెన్స్‌ సర్వీసును తీసుకొచ్చారు వైఎస్సార్‌. గ్రామాలకు వైద్య సేవలను విస్తరిస్తూ 104 సర్వీసులను ప్రారంభించారు. పేదరికానికి విద్యతో విరుగుడు పేదరికంతో ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదని ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూపకల్పన చేశారు. దీంతో లక్షలాది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న అగ్రవర్ణ విద్యార్థులు సైతం ఉన్నత చదువులు చదివి దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం... తాడేపల్లిగూడెంలో ఉద్యాన వర్శిటీ, తిరుపతిలో పశు వైద్య కళాశాలను నెలకొల్పారు. ప్రతిష్ఠాత్మక ఐఐటీ హైదరాబాద్‌ సమీపంలో ఏర్పాటయ్యేలా చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడులో ట్రిపుల్‌ ఐటీలను స్థాపించి లక్షలమందికి ఉన్నత చదవులు దక్కేలా చేశారు. తెలుగునేల సుభిక్షం కోసం భగీరథ యత్నం ‘1978లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాక.. కోస్తా జిల్లాల పర్యటనకు వెళ్లాను. అక్కడి కాలువలను చూశాను. కరువు ప్రాంతాల్లో కూడా ఇలా నీళ్లు పారించాలని నాలో సంకల్పం ఏర్పడింది. నాటి సీఎం మర్రి చెన్నారెడ్డిని కరువు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని అడిగితే దోసిలి పట్టు పోస్తానని ఎగతాళిగా మాట్లాడారు. దీంతో నా సంకల్పం మరింత బలపడింది’ అని 2004లో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టే సమయంలో వైఎస్సార్‌ గుర్తు చేసుకున్నారు. కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి, తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఒకేసారి పోలవరంతో సహా 86 ప్రాజెక్టుల నిర్మా­ణానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 41 ప్రాజెక్టులను పూర్తి చేసి దేశ సాగునీటి రంగంలో రికార్డు నెలకొల్పారు. పొదుపు వ్యవస్థలో విప్లవం ‘పావలా వడ్డీ’ ప్రైవేట్‌ మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు పేదల నుంచి అతి భారీ వడ్డీలు వసూలు చేస్తున్న సమయంలో... మహా నేత ఆలోచనల్లోంచి రూపుదిద్దుకున్న పావలా వడ్డీ పథకం చలనం సృష్టించింది. దేశమంతా డ్వాక్రా వ్యవ­స్థలో విప్లవం తీసుకొచ్చింది. రాష్ట్రంలో నేడు గ్రామీ­ణ ప్రాంతాల్లో 8 లక్షల వరకు పొదుపు సంఘాలున్నాయి. వీటిలో 2,90,928 సంఘాలు వైఎస్సార్‌ సీఎంగా ఉన్న 2004–08 మధ్య ఏర్పడినవే. దీనికి పావలా వడ్డీ అమలే ప్రధాన కారణం. కేంద్ర ప్రభు­త్వం ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. పావలా వడ్డీ పథకం ప్రభావంతో నేడు పొదు­పు సంఘాలకు రూ.3 లక్షల్లోపు రుణాలను బ్యాంకులు 7% వడ్డీకే ఇస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అజేయుడువైఎస్సార్‌ 1978ఎన్నికల్లో పులివెందుల నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1983, 1985 లోనూ గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. 1989, 1991, 1996, 1998లో కడప ఎంపీగా గెలుపొందారు. 1999 నాటికి తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఏడాదితో పాటు, 2004, 2009 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. 31 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఓటమి లేకుండా.. ఆరుసార్లు అసెంబ్లీకి, నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.నేడు వైఎస్సార్‌ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం హాజరు కానున్న మాజీ ఎంపీలు, హైకోర్టు మాజీ జడ్జీలుసాక్షి, హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా హైటెక్‌ సిటీ బుట్టా కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు వైఎ­స్సార్‌ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌ స్ఫూర్తి ఫౌండేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో మా­జీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, మాజీ న్యాయమూర్తులు పి.లక్ష్మణ రెడ్డి, నాగార్జున రెడ్డి, బి.శేషశయన రెడ్డి, జి.కృష్ణ మోహన్‌ రెడ్డి, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు అజేయ కల్లం, కేఎస్‌ జవహర్‌ రెడ్డి, మాజీ డీజీపీలు వి.దినేష్‌ రెడ్డి, సీఎన్‌ గోపీనాథ్‌ రెడ్డిలతో పాటు వైఎస్సార్‌తో కలిసి పనిచేసిన అధికా­రు­లు పాల్గొంటారని ఈశ్వర ప్రసాదరెడ్డి పేర్కొన్నా­రు.ఆయన పథకాలు.. దేశానికే మార్గదర్శకాలువ్యవసాయాన్ని పండుగ చేసే ఉచిత విద్యుత్, బంజరు నేలను సస్యశ్యామలం చేసే జలయజ్ఞం.. పేదలను విద్యావంతులను చేసే ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదల వైద్యానికి భరో­సా ఇచ్చే ఆరోగ్యశ్రీ,.. ఆపత్కాలంలో ఆదుకునే 108.. ఇతరరాష్ట్రాలూ చేపట్టాయి. ఆరోగ్య శ్రీ స్ఫూర్తితో మోదీ సర్కారు ఆయుష్మాన్‌ భారత్‌ను చేప­ట్టడం విశేషం. ఉచిత విద్యుత్‌ ఇస్తే తీగలపై దుస్తులు ఆరేసుకోవాల్సిందేనని అప్పట్లో ఎగ­తా­ళి చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం.. అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని కొనసాగించారంటేనే వైఎస్‌ గొప్పదనం ఏమిటో తెలుస్తోంది.

Delhi CM Rekha Gupta Letter To Yogi Adityanath Yamuna Sand Mining9
యోగి ఆదిత్యనాథ్‌కు ఢిల్లీ సీఎం సంచలన లేఖ.. యమునపై కొత్త ట్విస్ట్‌!

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా.. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా యమునా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని యోగి సర్కార్‌ను ఆమె కోరారు. అక్రమ తవ్వకాల కారణంగా ఢిల్లీకి ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇసుక అక్రమ తవ్వకం విషయాన్ని అంతర్-రాష్ట్ర సమస్యగా చెప్పుకొచ్చారు.ఢిల్లీ-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు సమీపంలోని యమునా నది వెంట అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విషయం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా దృష్టికి చేరడంతో ఆమె స్పందించారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో రేఖా గుప్తా.. యమునా నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇలాంటి మైనింగ్ కార్యకలాపాలు నది కరకట్టలను బలహీనపరుస్తున్నాయి. దీంతో, దేశ రాజధానిలో వరదల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. ఇటువంటి కార్యక్రమాలు నది సహజ మార్గాన్ని కూడా మారుస్తాయి. ఇది నది పరిసర ప్రాంతాల్లో నివసించే వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇసుక అక్రమ తవ్వకం వరద ప్రమాదాన్ని కలిగించడమే కాకుండా దీర్ఘకాలిక పర్యావరణ నష్టాన్ని తెచ్చిపెడుతోంది. అక్రమ మైనింగ్‌పై అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమ ఇసుక తవ్వకాన్ని తీవ్రమైన పర్యావరణ సమస్యగా ఎన్జీటీ గుర్తించింది. అందుకే ఇప్పటికైనా యూపీ ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించాలని కోరుతున్నాను. దీనిపై తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టాలి’ అని యోగి ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సమయంలో మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ తవ్వకం విషయాన్ని అంతర్-రాష్ట్ర సమస్యగా చెప్పుకొచ్చారు. దీనిపై రెండు ప్రభుత్వాల మధ్య ఉమ్మడి చర్యలు అవసరమని అన్నారు. దీని అమలు బాధ్యతలో గందరగోళాన్ని నివారించడానికి నది వెంబడి అధికార పరిధిని ఉమ్మడిగా గుర్తించడంతో సహా ఢిల్లీ, యూపీ ప్రభుత్వాల మధ్య సమన్వయ చర్యలు తీసుకోవాలని ఆమె ప్రతిపాదించారు. స్పష్టమైన సరిహద్దులు లేకపోవడం వల్లే పర్యవేక్షణ చర్యలు క్లిష్టతరంగా మారినట్టు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం సహకార విధానాన్ని కోరుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి యూపీ పరిపాలనా సమన్వయాన్ని ప్రారంభించాలని అభ్యర్థించారు.

Bastar IG Sundarraj P Strong Warning To Moaist Top Leaders10
లొంగిపోతారా?.. ఎన్‌కౌంటరై పోతారా?

బస్తర్‌: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మరోసారి అలజడి రేగింది. నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు భారీ సంఖ్యలో చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. మావోయిస్టు కీలక నేతలే లక్ష్యంగా ఈ భారీ ఆపరేషన్‌ చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేతలకు మరోసారి తీవ్ర హెచ్చరికలు వెళ్లాయి. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ల నేపథ్యంలో.. బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. లొంగి పోతారా? లేదంటే ఎన్‌కౌంటరై పోతారా? అంటూ హెచ్చరికలు జారీ చేశారాయన. గణపతి, హిడ్మా టార్గెట్‌గా.. సుమారు 25 వేల మందితో ఈ భారీ కూంబింగ్‌ ఆపరేషన్‌ జరుపుతున్నట్లు సమాచారం. తాజాగా.. కొండగావ్-నారాయణ్‌పూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు హతమయ్యారు. వారిపై కలిపి రూ.13 లక్షల రివార్డులు ఉన్నాయి. భద్రతా బలగాలు ఏకే-47 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన తరుణంలోనే బస్తర్‌ ఐజీ పై వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో 140 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. వీరిలో 123 మంది బస్తర్ డివిజన్‌లోనే ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఛత్తీస్‌గఢ్ బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ మావోయిస్టులకు గట్టి హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారేం కాదు. నంబాల ఎన్‌కౌంటర్‌ తర్వాత.. ఆయనలాగే ఎన్‌కౌంటర్‌లో చనిపోవాలా? లేక లొంగిపోవాలా? అనేది మావోయిస్టు టాప్‌ లీడర్లే నిర్ణయించుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారాయన. ‘‘ఈ సంఘటన తర్వాత, మిగిలిన మావోయిస్టు నేతలకు ఇక బస్తర్‌లో తలదాచుకోవడానికి స్థలం లేకుండా పోయింది. గణపతి, దేవ్జీ, సోను, హిడ్మా, సుజాత, రామ్ చంద్ర రెడ్డి, బర్సే దేవా.. వీళ్లందరినీ కూడా ఇదే తరహాలో ఎదుర్కొంటాం. మావోయిస్టు గ్రూపుల్లో ప్రస్తుతం నాయకత్వ సంక్షోభం ఉంది. బసవరాజు మరణం మానసికంగా కూడా వారిని కుంగదీసింది అని ఐజీ సుందర్‌ ఆ టైంలో వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement