ప్రణవ్, సిక్కి రెడ్డి
జకార్తా : ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో భారత జోడీలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మిక్స్‌డ్ డబుల్స్‌లో తెలంగాణ ప్లేయర్ నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట... పురుషుల డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 20–22, 22–20, 20–22తో వివియన్ హూ–యాప్ చెంగ్ వెన్ (మలేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది.
75 నిమిషాలపాటు జరిగిన ఈ హోరాహోరీ మ్యాచ్‌లో మూడో గేమ్‌లో సిక్కి ద్వయం 20–19తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచింది. అయితే మలేసియా జోడీ మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడంతోపాటు వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 25–23, 16–21, 21–19తో రాబిన్ తబెలింగ్–సెలెనా పీక్ (నెదర్లాండ్స్) జంటపై కష్టపడి గెలిచింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట తొలి గేమ్‌లో 16–20తో వెనుకబడింది. ఈ కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా ఆడిన సిక్కి–ప్రణవ్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి స్కోరును 20–20తో సమం చేశారు. ఆ తర్వాత ఆధిక్యం దోబూచులాడినా చివరకు సిక్కి జోడీదే పైచేయిగా నిలిచింది. రెండో గేమ్‌లో తడబడిన భారత జంట నిర్ణాయక మూడో గేమ్‌లో 14–18తో వెనుకంజలో నిలిచింది. మరోసారి భారత ద్వయం సంయమనంతో ఆడి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 20–18తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత మరో పాయింట్ చేజార్చుకున్నా... వెంటనే మరో పాయింట్ గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 21–19, 18–21, 21–19తో గో సె ఫె–నూర్ ఇజుద్దీన్ (మలేసియా) జంటను ఓడించింది.
నేడు జరిగే సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత స్టార్స్ పీవీ సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మను అత్రి జోడీ... మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ –అశ్విని జంట బరిలోకి దిగనున్నాయి. అయా ఒహోరి (జపాన్)తో సింధు; నిషిమోటో (జపాన్)తో శ్రీకాంత్; వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; షి యుకి (చైనా)తో ప్రణయ్ తలపడతారు. మిన్ చున్– హెంగ్ (చైనీస్ తైపీ)లతో సుమీత్–మను అత్రి; తొంతోవి అహ్మద్–విన్నీ కాండో (ఇండోనేసియా)లతో సాత్విక్–అశ్విని ఆడతారు. (ఉదయం 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం)
Comments
Please login to add a commentAdd a comment