Pranav Chopra
-
ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ జంట
పారిస్: ఓర్లియాన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ ద్వయం 21–7, 21–18తో డొమినిక్–సెరెనా (ఆస్ట్రియా) జోడీపై గెలిచింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ 21–9, 21–5తో రాచెల్ (ఐర్లాండ్)పై, ఐరా శర్మ 12–21, 21–14, 21–17తో లియోనైస్ (ఫ్రాన్స్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో కిడాంబి శ్రీకాంత్ 21–15, 21–10తో భారత్‌కే చెందిన అజయ్ జయరామ్‌పై, కిరణ్ జార్జి 13–21, 21–16, 23–21తో సహచరుడు ప్రణయ్‌పై, చిరాగ్ సేన్ 21–13, 21–12తో చికో వార్దోయో (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్ 7–21, 17–21తో తోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. -
సిక్కి రెడ్డి జంటకు మిశ్రమ ఫలితాలు
జకార్తా : ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో భారత జోడీలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణ ప్లేయర్ నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట... పురుషుల డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 20–22, 22–20, 20–22తో వివియన్ హూ–యాప్ చెంగ్ వెన్ (మలేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ హోరాహోరీ మ్యాచ్‌లో మూడో గేమ్‌లో సిక్కి ద్వయం 20–19తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచింది. అయితే మలేసియా జోడీ మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడంతోపాటు వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 25–23, 16–21, 21–19తో రాబిన్ తబెలింగ్–సెలెనా పీక్ (నెదర్లాండ్స్) జంటపై కష్టపడి గెలిచింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట తొలి గేమ్‌లో 16–20తో వెనుకబడింది. ఈ కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా ఆడిన సిక్కి–ప్రణవ్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి స్కోరును 20–20తో సమం చేశారు. ఆ తర్వాత ఆధిక్యం దోబూచులాడినా చివరకు సిక్కి జోడీదే పైచేయిగా నిలిచింది. రెండో గేమ్‌లో తడబడిన భారత జంట నిర్ణాయక మూడో గేమ్‌లో 14–18తో వెనుకంజలో నిలిచింది. మరోసారి భారత ద్వయం సంయమనంతో ఆడి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 20–18తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత మరో పాయింట్ చేజార్చుకున్నా... వెంటనే మరో పాయింట్ గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 21–19, 18–21, 21–19తో గో సె ఫె–నూర్ ఇజుద్దీన్ (మలేసియా) జంటను ఓడించింది. నేడు జరిగే సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత స్టార్స్ పీవీ సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మను అత్రి జోడీ... మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ –అశ్విని జంట బరిలోకి దిగనున్నాయి. అయా ఒహోరి (జపాన్)తో సింధు; నిషిమోటో (జపాన్)తో శ్రీకాంత్; వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; షి యుకి (చైనా)తో ప్రణయ్ తలపడతారు. మిన్ చున్– హెంగ్ (చైనీస్ తైపీ)లతో సుమీత్–మను అత్రి; తొంతోవి అహ్మద్–విన్నీ కాండో (ఇండోనేసియా)లతో సాత్విక్–అశ్విని ఆడతారు. (ఉదయం 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం) -
సిక్కిరెడ్డి– ప్రణవ్ జోడి ఓటమి
బాసెల్ (స్విట్జర్లాండ్): భారత మిక్స్డ్ డబుల్స్ జంట ప్రణవ్ చోప్రా– సిక్కి రెడ్డి స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో 19–21, 17–21తో చైనా జంట జాంగ్నాన్– లి యిన్హుయి చేతిలో సిక్కి–ప్రణవ్ ఓటమి పాలయ్యారు. తొలి గేమ్‌లో భారత జోడీ 15–5తో ఉన్న దశలో చైనా జోడీ జోరుపెంచింది. 19–19 స్కోరు సమం చేసి అదే జోరులో మరో రెండు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను భారత్‌కు దూరం చేసింది. రెండో గేమ్‌లో ఇరు జట్లు ఒక దశలో 6–6, 14–14తో సమంగా నిలిచినా చివర్లో వరుసగా ఐదు పాయింట్లు ఇచ్చి భారత జోడీ పరాజయం ఎదుర్కొంది.