ఓడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని జంట 21–7, 21–11తో ఏరియల్ లీ–సిడ్నీ లీ (అమెరికా) జోడీపై ఘనవిజయం సాధించింది. కేవలం 20 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జంటకు ఏమాత్రం పోటీ ఎదురుకాలేదు. రెండు గేమ్‌ల ఆరంభ దశలో పాయింట్లు కోల్పోయినా ఆ వెంటనే జోరు పెంచి భారత జంట అలవోకగా విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (భారత్) జోడీ 17–21, 11–21తో ఎమ్మా కార్ల్‌సన్–జోనా మాగ్నుసన్ (స్వీడన్) ద్వయం చేతిలో ఓడింది.
మంగళవారం ఆలస్యంగా జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అలవోక విజయాన్ని అందుకున్నాడు. హాన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–16, 21–10తో గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో సాయిప్రణీత్ (భారత్) 21–12, 14–21, 15–21తో హువాంగ్ యుజియాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో చైనా దిగ్గజం లిన్ డాన్‌తో శ్రీకాంత్; జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో సమీర్ వర్మ; అకానె యామగుచి (జపాన్)తో సైనా నెహ్వాల్; లీ సో హీ–షిన్ సెయుంగ్ చాన్ (దక్షిణ కొరియా)లతో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప తలపడతారు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 1–3తో... సైనా 1–6తో వెనుకబడి ఉండగా... సమీర్ వర్మ 1–0తో ఆధిక్యంలో ఉన్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో చివరిసారి లిన్ డాన్‌తో తలపడ్డ శ్రీకాంత్ 3 గేములపాటు పోరాడి ఓడిపోయాడు. సైనా నెహ్వాల్ 2014 చైనా ఓపెన్‌లో చివరిసారి యామగుచిపై విజయం సాధించింది.
సిక్కి–అశ్విని జోడీ శుభారంభం
Published Thu, Oct 18 2018 12:52 AM | Last Updated on Thu, Oct 18 2018 12:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment