
ప్రిక్వార్టర్స్‌లో సిక్కి రెడ్డి జంట
ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి సిక్కి రెడ్డి మహిళల డబుల్స్ విభాగంలో, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో శుభారంభం చేసింది.
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి సిక్కి రెడ్డి మహిళల డబుల్స్ విభాగంలో, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 21–16, 21–16తో గాబ్రియెలా అడ్‌కాక్–జెస్సికా పగ్ (ఇంగ్లండ్) జంటపై... మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జోడీ 21–15, 21–19తో హఫీజ్ ఫైజల్–షీలా దేవి (ఇండోనేసియా) జంటపై విజయం సాధించింది. మహిళల డబుల్స్ మరో మ్యాచ్‌లో మనీషా–మహిమా అగర్వాల్ (భారత్) జోడీ 9–21, 8–21తో జాంగ్‌కోల్ఫాన్ కితిహరాకుల్–రవింద ప్రజోంగ్‌జాయ్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయింది.
పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) 14–21, 17–21తో కిమ్ యాస్‌ట్రప్–ఆండెర్స్ రస్‌ముసేన్ (డెన్మార్క్) చేతిలో... సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) 19–21, 19–21తో టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్) చేతిలో... కోనా తరుణ్–ఫ్రాన్సిస్ ఆల్విన్ (భారత్) 10–21, 7–21తో టకుటో ఇనూ–యుకి కనెకో (జపాన్) చేతిలో ఓడిపోయారు.
రితూపర్ణ ముందంజ
మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి రితూపర్ణ దాస్ ముందంజ వేయగా... శ్రీకృష్ణప్రియ, చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. రితూపర్ణ దాస్ 19–21, 21–15, 21–19తో చియాంగ్ మియ్ హుయ్ (చైనీస్ తైపీ)పై గెలుపొందగా... శ్రీకృష్ణప్రియ 11–21, 13–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా) చేతిలో, క్వాలిఫయర్ సాయి ఉత్తేజిత 17–21, 18–21తో లానీ అలెసాండ్రా మైనకి (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు.