Mahesh Babu, Prabhas, And Jr. NTR Plans Set To Take Pan India Movie - Sakshi
Sakshi News home page

అగ్రహీరోల సినిమాలు.. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఉండేలా ప్లాన్!

Published Wed, May 17 2023 12:35 AM | Last Updated on Wed, May 17 2023 10:37 AM

A pan India trend is seen in the industry - Sakshi

ఇండస్ట్రీలో పాన్‌ ఇండియా ట్రెండ్‌ కనిపిస్తోంది. సినిమాలు దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలవుతున్నాయి. దీంతో అన్ని భాషలవారికీ అనుగుణంగా ఉండే కథలను ఎంచుకుంటున్నారు. కథలు మాత్రమే కాదు.. టైటిల్‌ కూడా పాన్‌ ఇండియాకి సూట్‌ అయ్యేలా ఉండాలని ప్రయత్నం  చేస్తున్నారు. ఒకే టైటిల్‌తో అన్ని భాషల్లో ఓ చిత్రం విడుదలైతే అది ఆడియన్స్‌కు మరింత చేరువ అవుతుందని ప్రత్యేకంగా  చెప్పక్కర్లేదు.

ఈ క్రమంలో కొందరు టాప్‌ స్టార్స్‌ నటిస్తున్న చిత్రాల టైటిల్స్‌పై చర్చ జరుగుతోంది. ‘ఫలానా టైటిల్‌ అనుకుంటున్నారట’ అని వైరల్‌గా ఉన్న టైటిల్స్‌ ‘పాన్‌ ఇండియా టైటిల్‌’లా ఉన్నాయి. మరి.. ఫైనల్‌గా ఆ టైటిల్స్‌నే  ఫైనలైజ్‌ చేస్తారో? లేదో చెప్పలేం కానీ.. చర్చల్లో ఉన్న ఆ టైటిల్స్‌ గురించి మాత్రం చెప్పుకుందాం. 

రాజా డీలక్స్‌? 
ప్రస్తుతం ‘సలార్‌’, ప్రాజెక్ట్‌ కె’ వంటి భారీ యాక్షన్‌ సినిమాలు  చేస్తున్నారు ప్రభాస్‌. కేవలం యాక్షన్‌ జానర్‌కే పరిమితం కాకుండా కాస్త కామెడీ తరహా పాత్రల్లో కూడా ప్రభాస్‌ నటించాలను కుంటున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే  దర్శకుడు మారుతితో ఓ సినిమా చేస్తున్నారు ప్రభాస్‌. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది.

హారర్‌ అండ్‌ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా కథ రాజా డీలక్స్‌ అనే థియేటర్‌లో జరుగుతుందని, అందుకే ఈ సినిమాకు ‘రాజా డీలక్స్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేయాలనుకుంటున్నారని సమాచారం. ఒకవేళ ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో విడుదల చేయాలనుకుంటే.. అప్పుడు టైటిల్‌ మార్చే అవసరం లేకుండా పోతుంది. 

గుంటూరు కారమా? ఊరికి మొనగాడా? 
మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు. ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే జనవరి 13న విడుదల కానుంది. ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదలైంది. ఇక ఈ చిత్రానికి ‘అయోధ్యలో అర్జునుడు’, ‘ఊరికి మొనగాడు’, ‘పల్నాటి పోటుగాడు’, ‘అమరావతికి అటు ఇటు’, ‘గుంటూరు కారం’ టైటిల్స్‌ తెరపైకి వచ్చాయి.

ఎక్కువగా ‘గుంటూరు కారం’, ‘ఊరికి మొనగాడు’ వినిపిస్తున్నాయి. సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన హిట్‌ చిత్రాల్లో ‘ఊరికి మొనగాడు’ ఒకటి అని తెలిసిందే. కాగా ఈ నెల 31న కృష్ణ బర్త్‌ డే సందర్భంగా టైటిల్‌ ప్రకటించే చాన్స్‌ ఉంది. మరి, ఇక్కడ పేర్కొన్న టైటిల్స్‌లో ఏదో ఒకటి ఉంటుందా? వేరే టైటిల్‌ని ఫిక్స్‌ చేస్తారా? అనేది చూడాలి. 

దేవర? 
‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. ఓ లీడ్‌ రోల్‌ను సైఫ్‌ అలీఖాన్‌ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు ‘వస్తున్నా!’, ‘దేవర’ టైటిల్స్‌ను చిత్ర యూనిట్‌ పరిశీలిస్తోందనే టాక్‌ తెరపైకి వచ్చింది. ఈ నెల 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను అధికారికంగా ప్రకటిస్తారట.

కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానుంది. వీరే కాదు.. మరికొందరు స్టార్స్‌ చిత్రాల టైటిల్స్‌పైనా చర్చ జరుగుతోంది. ప్రేక్షకులను ఆకర్షించే విషయాల్లో ‘టైటిల్‌’ ఒకటి. ఆ విషయాన్ని, కథనీ దృష్టిలో పెట్టుకుని టైటిల్స్‌ పెడుతుంటారు. ఇప్పుడు పాన్‌ ఇండియా రేంజ్‌ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఫ్యాన్స్‌ గురించి చెప్పాలంటే టైటిల్‌ పవర్‌ఫుల్‌గా ఉంటే వారికి కిక్కే కిక్కు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement