2019 లగేజ్‌తో పాటు వచ్చి బంజారా హిల్స్‌లో నిలుచుని ఉంది. దాని సూట్‌కేస్‌లో ఏ హీరోకు ఏ సర్‌ప్రైజ్ ఉందో తెలియదు. అది బంగారు నాణేల మూటను ఏ నిర్మాత ముంగిట్లో జార విడుస్తుందో తెలియదు. సక్సెస్ అనే కిరీటాన్ని ఏ దర్శకుడి తలుపు తట్టి అతడి శిరస్సున ఉంచుతుందో తెలియదు. ఏ కొత్త అందాలను ముంబై నుంచి టికెట్లు బుక్ చేసి రప్పిస్తుందో తెలియదు. ఏ పాత చరిత్రలను బయోపిక్‌ల పేరుతో తిరగతోడుతుందో తెలియదు. మనకు తెలిసిందల్లా ఆశ పెట్టుకోవడమే.భవిష్యత్తుపై ఆశ పెట్టుకోవడమే. తెలుగు సినీ ఇండస్ట్రీకి 2019లో అంతా మంచే జరుగుతుందని నమ్మి ముందుకు అడుగు వేయడమే. 2018 కాలబిలంలోకి జారిపోయింది. 2019 కాలరెత్తుకొని అడుగుపెట్టింది. ఈ సంవత్సరం తెలుగు సినిమాను కళకళలాడించడానికి ఎవరెవరు ఏయే సినిమాలు చేస్తున్నారు? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఆ హ్యాపీ న్యూస్‌లు తెలుసుకుందాం.
చిరంజీవి... తెలుగు హీరోలలో ధృవతార చిరంజీవి. తెలుగు స్వాతంత్య్ర యోధులలో పోరాట తార ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. మరి వీరిద్దరూ కలిస్తే వెండితెర ఎటువంటి వెలుగులు విరజిమ్మాలి? ఎంతటి కాంతితో నిండిపోవాలి? 2019 అటువంటి సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను సౌతిండియాలో అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు టీజర్ రిలీజ్ ఫంక్షన్‌లో నిర్మాత రామ్‌చరణ్ చెప్పారు. అయితే సినిమా పోస్ట్‌ప్రొడక్షన్‌లో క్వాలిటీ కోసం మరింత శ్రమిస్తున్నారని టాక్. అందుకే ముందు అనుకున్నట్లు వేసవిలో కాకుండా కొంచెం లేట్‌గా ఈ సినిమా రావచ్చని తెలుస్తోంది. బహుశా జూన్ జూలైలో కావచ్చు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయనున్నారు. దీనికి డీవీవీ దానయ్య నిర్మాత. కొరటాల శివ దర్శకత్వంలో కూడా చిరంజీవి ఓ సినిమా చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి ఏది ముందో ఏది తర్వాతో కూడా ఈ సంవత్సరంలోనే తేలనుంది.
బాలకృష్ణ... 2019 ఒక ముఖ్యమైన బయోపిక్‌ను తెలుగువారికి అందించనుంది. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్యదైవం ఎన్.టి.ఆర్ బయోపిక్‌ను అది తెర మీదకు తేనుంది. మొదట కొన్ని సర్దుబాట్లు, మార్పులు జరిగినా దర్శకునిగా క్రిష్ రంగప్రవేశం తర్వాత నిరాటంకంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుని విడుదలకు సిద్ధమైంది. ఇందులో హీరోగా నటించిన బాలకృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. సంక్రాంతికి హిట్ కొట్టడం బాలకృష్ణకు ఆనవాయితీ. ఆ వరుసలో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిద్దాం. ‘యన్.టి.ఆర్–కథానాయకుడు’ జనవరి 9న విడుదల, రెండోభాగం ‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ ఫిబ్రవరి 7న రిలీజ్.
నాగార్జున... రాంగోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ 1990లో సక్సెస్ అయినంతగా 2018లో కాలేదు. వారి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆఫీసర్’ నిరుత్సాహపరిచింది. అయితే నానితో కలిసి నాగ్ చేసిన మల్టీస్టారర్ ‘దేవదాస్’ ఆడియన్స్ దగ్గర ఒప్పుకోలు పొందింది. ప్రస్తుతం నాగార్జున ‘బ్రహ్మాస్త్ర’ అనే హిందీ చిత్రంతో పాటు తమిళ హీరో ధనుశ్‌తో ఓ మల్టీస్టారర్‌లో నటిస్తున్నారు. ‘మన్మథుడు’ సీక్వెల్‌లో నాగార్జున నటించనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్‌లో కూడా నటించనున్నారు. 2019లో ఈ రెండు చిత్రాలతో బిజీ.
వెంకటేష్... 2018 వెంకటేష్‌కు ఏ కెరీర్ జ్ఞాపకమూ మిగల్చలేదు. ఎందుకంటే ఆయన సినిమా ఏదీ రాలేదు. ఆ కొసరు ఈ సంవత్సరం అసలు అంతా కలిపి ఇవ్వదలుచుకున్నారాయన. అందుకే ‘ఎఫ్ 2’తో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నాగచైతన్యతో ‘వెంకీమామ’ చేయనున్నారు. అలాగే నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందట. బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఓ కథ చెప్పారట. ఇలా 2019లో వెంకీ డైరీ ఖాళీ లేదు.
రాజశేఖర్... ‘పీఎస్వీ గరుడవేగ: 126.18ఎమ్’ సినిమాతో హిట్ బ్యాక్ ఇచ్చారు రాజశేఖర్. ఇప్పుడు ‘కల్కి’ అనే డిఫరెంట్ జానర్ సినిమా చేస్తున్నారు. యాభై శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయిందని టాక్. దీనికి దర్శకుడు ప్రశాంత్ వర్మ.
రవితేజ... 2018 రవితేజకు పెద్దగా అచ్చి రాలేదు. ఆ సంవత్సరం రిలీజైన ‘టచ్ చేసి చూడు, నేలటిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటొని’ మిశ్రమ ఫలితాలే ఇచ్చాయి. 2019 ఆయనకు సత్ఫలితాలు ఇస్తుందని ఆశిద్దాం. వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేయనున్నారు రవితేజ. చిత్రీకరణ త్వరలో ప్రారంభం అవుతుంది.
గోపీచంద్... 2018లో గోపీచంద్ ‘పంతం’తో తెరపైకి వచ్చారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరుతో చేతులు కలిపి ఓ స్పై థ్రిల్లర్‌ను ప్లాన్ చేశారు. ఈ నెలలో చిత్రీకరణ మొదలవుతుంది.
కల్యాణ్ రామ్... ‘ఎమ్మెల్యే’, ‘నా నువ్వే..’ ఈ ఏడాది కల్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన చిత్రాలివి. ఇప్పుడు ఆయన ‘118’ అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సినిమా కూడా జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదల అవుతుందని ఊహించవచ్చు.
శర్వానంద్... ఈ ఏడాదిలో ‘పడి పడి లేచె మనసు’ అనే ప్రేమకథతో థియేటర్స్‌లోకి వచ్చారు శర్వానం§Š.. ప్రస్తుతం సుధీర్‌వర్మ దర్శకత్వంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నారు శర్వానంద్. ఈ సినిమా వచ్చే ఏడాది మొదట్లో విడుదల కానుంది. అలాగే తమిళ్ హిట్ ‘96’ చిత్రంలో ఆయన హీరోగా నటించబోతున్నారని తాజా టాక్.
రామ్... ‘హలో గురు ప్రేమకోసమే..’ సినిమాతో ప్రేక్షకులకు హలో చెప్పారు రామ్. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించనున్నారు. ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
నితిన్... 2018లో నితిన్ ‘ఛల్ మోహన్‌రంగ’, ‘శ్రీనివాస కల్యాణం’ రెండు చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ అనే సినిమా చేస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకుడు. అలాగే తమిళంలో హిట్ సాధించిన ‘రాక్షసన్’ అనే సినిమా తెలుగు రీమేక్‌లో నితిన్ నటించనున్నారని సమాచారం. ఈ సినిమా రీమేక్స్ రైట్స్‌ను కూడా నితిన్ సొంతం చేసుకున్నారట. సుధీర్‌వర్మ దర్శకుడని టాక్.
రానా... ఈ ఏడాది రానా సిల్వర్‌స్రీన్‌పైకి రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. 2019లో కనీసం మూడు నెలలకోసారి రానాను చూడొచ్చు. అలా ప్లాన్ చేశారు ఆయన. ఆయన హీరోగా నటిస్తున్న ‘అరణ్య’, ‘1945’ సినిమాల చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. అలాగే ‘హిరణ్య కశ్యప’ అనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారాయన. ఎన్టీఆర్ బయోపిక్, హిందీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’లో క్యారెక్టర్స్ చేశారు రానా.
నాగచైతన్య.... 2019లో భార్య సమంతాతో కలిసి ‘మజిలీ’ సినిమాలో నటిస్తున్నారు నాగచైతన్య. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా వెంకటేష్‌తో కలిసి ‘వెంకీమామ’ అనే మల్టీస్టారర్ మూవీకి కమిట్ అయ్యారు. కేఎస్. రవీంద్ర ఈ సినిమాకు దర్శకుడు.
వరుణ్ తేజ్ ... 2019ని మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్2’తో స్టార్ట్ చేయనున్నారు వరుణ్ తేజ్. ఇందులో వెంకటేశ్ మరో హీరో. ఆ నెక్ట్స్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమా కమిట్ అయ్యారు. సాగర్‌చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ అయిన విషయం గుర్తుండే ఉంటుంది.
విజయ్ దేవరకొండ... విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ ఈ సమ్మర్‌లో విడుదల కానుంది. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారాయన. అలాగే మైత్రీమూవీమేకర్స్‌లో మరో సినిమా, నిర్మాత అశ్వనీదత్ బ్యానర్‌లో రెండు ప్రాజెక్ట్‌లు కమిట్ అయ్యారు.
అఖిల్... అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘మిస్టర్ మజ్ను’. ఈ సినిమా జనవరి 25న విడుదల కానుంది. ఆ నెక్ట్స్ తెలుగు, హిందీ భాషల్లో రూపొందే ఓ సినిమాలో అఖిల్ నటించనున్నారని టాక్.
మహేశ్‌బాబు... ‘భరత్ అనే నేను’ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న మహేశ్‌బాబు ప్రస్తుతం ‘మహర్షి’లో నటిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా సెకండ్ లుక్‌ని విడుదల చేశారు. ఏప్రిల్ 5న చిత్రం విడుదల కానుంది. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని టాక్.
ప్రభాస్.. చూడగా ‘సాహో’కు 2019 రాసి పెట్టినట్టుంది. 2018లో విడుదల కావాల్సిన ఈ చిత్రం యాక్షన్ సన్నివేశాలకు మరింత పెద్ద పీట వేయడంతో క్వాలిటీ పరంగా ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో 2019కి సిద్ధమవనుంది. ఆగస్టు 15న విడుదల. రాధాకృçష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తు్తన్న ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) ఈ సంవత్సరం సెకండాఫ్‌లో రిలీజ్ కానుంది. సో.. 2019కి డబుల్ ట్రీట్ ఇస్తారు ప్రభాస్.
ఎన్టీఆర్... 2018లో ‘అరవిందసమేత వీర రాఘవ’ సినిమాతో థియేటర్స్‌లోకి వచ్చిన ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్ ’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో ఒక కథానాయకుడిగా నటిస్తున్నారు. అశ్వనీదత్ బ్యానర్‌లో ఎన్టీఆర్ ఓ సినిమా కమిట్ అయ్యారు. దీనికి అట్లీ దర్శకుడని టాక్.
రామ్‌చరణ్... ‘రంగస్థలం’తో కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు రామ్‌చరణ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వినయ విధేయ రామ’జనవరి 11న విడుదల కానుంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో రామ్‌చరణ్ ఒక హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. 2019 ఆయనకు ఉత్సాహభరితంగా ఉండనుంది.
అల్లు అర్జున్... ఎప్పటినుంచో తన నెక్ట్స్ చిత్రం గురించి ఉన్న సస్పెన్స్‌కు న్యూ ఇయర్ సందర్భంగా తెరదించారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో హీరోగా నటించనున్నట్లు వెల్లడించారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంస్థ అధినేతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలలో ప్రారంభం కానుంది. మిగతా వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది. ఇంతకుముందు అల్లు అర్జున్, త్రివ్రికమ్ కాంబినేషన్‌లో ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. దీంతో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.
రజనీకాంత్... 2018 రజనీకాంత్‌కు రెండు సినిమాలను ఇచ్చింది. ‘కాలా’, ‘2.ఓ’. అభిమానులకు ఈ సంగతి ఆనందమే అయినా ఫలితాల విషయంలో నిజంగా అంత ఆనందంగా లేరు. వారికి కావాల్సిన సిసలైన రజనీ స్టైల్ మాస్ ఫిల్మ్ గత సంవత్సరం పడలేదనే చెప్పాలి. 2019 ఆ వెలితి తీర్చవచ్చు. ఆయన హంగామా చేసిన సినిమా ‘పేట’ జనవరి 10న విడుదల కానుంది. ఇందులోని గెటప్స్, ట్రైలర్ ఇప్పటికే కుతూహలం రేపుతున్నాయి. సినిమా కూడా ఆ లెవల్‌లోనే ఉండొచ్చు. దీని తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో రజనీ సినిమా ఉండబోతోంది. ఆ సినిమా కూడా 2019లోనే రిలీజ్ కావచ్చు.
కమల్ హాసన్... ‘విశ్వరూపం 2’ ఒక్కటే కమల్‌హాసన్‌కు 2018లో రిలీజ్. కానీ ఆ సినిమా ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. ఇప్పుడు ‘ఇండియన్ 2’ చిత్రానికి ప్రిపేర్ అవుతున్నారు. అలాగే పెండింగ్‌లో పడ్డ ‘శభాష్‌నాయుడు’ (తెలుగు టైటిల్) కూడా పూర్తి కావాల్సి ఉంది. ఈ చిత్రానికి కమలే దర్శకుడు. ఇందులో కమల్ కూతురిగా రియల్ లైఫ్ డాటర్ శ్రుతీహాసన్ నటిస్తున్నారు.
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’లో నటిస్తున్నారు. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ సినిమా చేస్తున్నారు. సందీప్ కిషన్ ‘నిను వీడను నీడను నేనే’ చేస్తున్నారు. ఈ సినిమాకు సందీప్ ఓ నిర్మాత కూడా. నిఖిల్ ‘ముద్ర’లో నటిస్తున్నారు. నారా రోహిత్ ‘శబ్దం’, ‘అనగనగా దక్షిణాదిలో’ సినిమాల్లో 2019లో కనిపించవచ్చు. అడవి శేష్ ప్రస్తుతం ‘2 స్టేట్స్’లో, పీవీపీ బేనర్‌లో ఓ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ‘గూఢచారి’కి సీక్వెల్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఆది పినిశెట్టి ‘ఆర్‌ఎక్స్ 100’ తమిళ రీమేక్‌లో నటించనున్నారు. ‘విజేత’ చిత్రంతో హీరోగా పరిచయమైన చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ ప్రస్తుతం పులి వాసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సాయిధరమ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఈ ఏడాది హీరోగా పరిచయం కానున్నారు. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకుడు.
‘మళ్ళీరావా...’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని నటిస్తున్న ‘జెర్సీ’ . ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. 1990ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. క్రికెటర్ అర్జున్ పాత్రలో నాని నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. నెక్ట్స్ ‘మనం’, ‘24’ చిత్రాల ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఇంకా అవసరాల శ్రీనివాస్, చంద్రశేఖర్ ఏలేటి, మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వాల్లో నాని సినిమాలు చేయనున్నారట.
బయోపిక్స్
బయోపిక్స్ హవా టాలీవుడ్‌లో పెరిగింది. 2019లో మహానేత వైయస్సార్ బయోపిక్ ‘యాత్ర’, ఎన్టీఆర్ బయోపిక్ (కథానాయకుడు, మహానాయకుడు) ఆల్రెడీ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితం ఆధారంగా ‘తెలంగాణ దేవుడు’, ‘ఉద్యమసింహం’ అనే సినిమాలు రూపొందుతున్నాయి. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్ రెడీ అవుతోంది. తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత బయోపిక్‌లను అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జీవితం ఆధారంగా ‘చంద్రోదయం’ అనే సినిమా వస్తోంది. ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ జీవితం ఆధారంగా ‘విశ్వదర్శనం’ అనే బయోపిక్, ప్రముఖ సంగీత విద్వాంసుడు ఘంటసాల జీవితం ఆధారంగా ‘ఘంటసాల: ది గ్రేట్’ బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. నటుడు కాంతారావు బయోపిక్, మల్లయోధుడు కోడి రామ్మూర్తి, నటి కన్నాంబ బయోపిక్‌లు తెరపైకి రానున్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment