ఐక్యరాజ్య సమితి వాళ్లకు సీరియస్ సమస్యలలో తలదూర్చి, తీర్పులు చెప్పి చెప్పీ బోర్ కొట్టేసింది. కాస్త రిలాక్స్ కోసం ఏదైనా చేయాలనుకున్నారు. వెంటనే ‘మీలో దమ్మున్నవాడు ఎవరు?’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీనిలో భాగంగా అసమాన అద్భుత సాహసాలు చేసేవారికి ‘యోధాను యోధ’ బిరుదు ఇచ్చి భారీ బహుమతి ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి ఎంతోమంది ఈ పోటీకి హాజరయ్యారు. అనేక వడపోతల తరువాత అయిదు దేశాల నుంచి అయిదుమంది ఎంపికయ్యారు.వారు ప్రదర్శించిన విద్యలు...
మొదటి వాడు:తన పొడవాటి గడ్డాన్ని ఒక కారుకు కట్టి కిలోమీటరు వరకు లాగాడు అమెరికాకు చెందిన మాక్స్‌వెల్ గూటెన్‌బర్గ్.ప్రేక్షకులు చప్పట్లు చరిచారు.
రెండవవాడు:‘పూల్ ఔర్ కాంటే’ సినిమాలో అజయ్ దేవగణ్‌లా రన్నింగ్‌లో ఉన్న రెండు బైక్‌ల మీద అటో కాలు ఇటో కాలు వేసి దర్జాగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లాడు జపాన్‌కు చెందిన అమి అకియో తుమితుమి.ప్రేక్షకులు గట్టిగా చప్పట్లు చరిచారు.
మూడోవాడు:‘ఫైర్‌వాక్’ పేరుతో మండుతున్న నిప్పుల్లో అటు ఇటు అరగంట పాటు నడిచాడు చైనాకు చెందిన షాంగ్ మింగ్ డాంగ్.‘ఇక తప్పుతుందా’ అన్నట్లు చప్పట్లు కొట్టారు ప్రేక్షకులు.
నాలుగవవాడు:రకరకాల విషసర్పాలను ఒంటి పై వేసుకొని హంగామా సృష్టించాడు రష్యాకు చెందిన వ్లాడిమీర్ మిస్తోలోవ్.సేమ్ సౌండ్!ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి ఇవన్నీ చూసి చిర్రెత్తుకొచ్చింది.‘‘ఎహే...చిన్నప్పుడు మా ఊరి అంగడిలో ఇంత కంటే మంచి సాహసాలు చూశాను’’ అని పెదవి విరిచాడు.‘‘వీటిని కూడా సాహసాలు అంటారా?’’ అని కోపగించుకున్నాడు ఐరాస కార్యదర్శి. ఈలోపు చివరి వ్యక్తి వచ్చాడు. అతడు అయిదు ఐటమ్స్ చేశాడు. ఏంచేశాడంటే...
ఒకటి:
తన జేబులో నుంచి ఒక కోడిగుడ్డును బయటకు తీసి దాన్ని ఆకాశంలోకి విసిరి గురిచూసి కాల్చాడు. అంతే.. ఆ గుడ్డులోని సొన కరెక్ట్‌గా వెళ్లి నేలపై ఉన్న పెనంపై పడి వేడి వేడి ఆమ్లెట్ అయింది!
‘అదిరిపోయింది’ అంటూ ప్రేక్షకుల నుంచి అరుపులు. ‘నిజమే సుమీ’ అన్నాడు ఐరాస కార్యదర్శి ఆనందంగా.
రెండు:
జేబులో నుంచి చిన్న బాక్స్ తీశాడు. అందులో నుంచి ఒక దోమను బయటకు తీసి గాల్లోకి ఎగిరేశాడు. తన అమ్ములపొదిలో నుంచి వాడిగల బాణాన్ని గురిచూసి సంధించాడు. అంతే...ఆ దోమ కళ్లు ఒక పక్క, కాళ్లు ఒక పక్క, రెక్కలు ఒక పక్క పడ్డాయి!
ప్రేక్షకులతో పాటు ఐరాస కార్యదర్శి చప్పట్లు చరిచాడు.
మూడు:
ఒకరాత్రి విమానం ఎక్కి ఆకాశంలోకి దూసుకెళ్లాడు. అంత పెద్ద ఆకాశాన్ని పట్టుకొని అయిదు నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా ఊపాడు. చింతచెట్టు నుంచి చింతకాయలు రాలిపడ్డట్లు ఆకాశం నుంచి చుక్కలు రాలిపడ్డాయి!‘కేక’ అని అరిచారు ప్రేక్షకులు. ‘డబుల్ కేక’ అని అరిచాడు కార్యదర్శి.
నాలుగు:
ఒక పెద్ద బకెట్ తీసుకొని హిందూ మహాసముద్రంలోని నీళ్లన్నీ తోడి సçహార ఎడారిలో పోశాడు. అక్కడ ఉన్న ఇసుకను బస్తాల్లో నింపి హిందూ మహాసముద్రంలో నింపాడు!
అయిదు:
సూర్యుడికి చంద్రుడికి మధ్య పెద్ద తాడు కట్టి దాన్ని ఉయ్యాలగా చేసుకొని ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్...ముద్దపప్పోయ్ మూడట్లోయ్’ అంటూ అట్లతద్ది పాటలు పాడాడు. ఇవన్నీ చూసిన తరువాత ‘‘ఈడు మగాడ్రా బుజ్జి...ఈడే విజేత’’ అని ప్రకటించాడు ఐరాస కార్యదర్శి.విజేతను అందరూ చుట్టుముట్టారు. ఆటోగ్రాఫ్‌లు, ఫోటోగ్రాఫ్‌లు. కొందరు అతనిపై పూలవర్షం కురిపించారు. కొందరు అతడి చేతిని ప్రేమగా ముద్డాడారు.‘ఆగండి’ అని గట్టిగా అరిచాడు ఐరాస కార్యదర్శి. గుండు సూది కింద పడినా శబ్దం వినిపించేంత నిశ్శబ్దం!
‘‘ఆనందంలో పడిపోయి అసలు విషయం మరిచిపోయాం. ఈయన పేరేమిటో, ఏ దేశం నుంచి వచ్చాడో తెలుసుకుందాం. ఈ పోటీలో గెలిచిన వ్యక్తి ఏ మూలన ఉన్న స్టేజీ మీదికి వచ్చి తన గురించి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అన్నాడు కార్యదర్శి.‘ఈ గండరగండడు ఏ దేశం వాడో... ఏంచేస్తుంటాడో’ అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నిండిపోయింది. ఈలోపు ప్రేక్షకుల మధ్య నుంచి చినిగిన బట్టలతో స్టేజీ మీదికి వచ్చాడు విజేత. మైక్ అందుకొని...‘‘అభిమానం అనేది బురదలాంటిది. షర్ట్ వెళ్లి బురదలో పడ్డా, బురద వెళ్లి షర్ట్ మీద పడ్డా షర్ట్‌కే డ్యామేజీ!’’ అని మొదలు పెట్టాడు విజేత.‘‘ఆ విషయం తరువాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు...ముందు నువ్వు ఏ దేశం నుంచి వచ్చావో చెప్పవయ్య!’’ ఆసక్తిగా అడిగాడు కార్యదర్శి.‘‘నా పేరు సిల్వర్‌స్టార్‌బాబు, సౌత్‌ఇండియన్ సినిమాల్లో హీరోగా పని చేస్తుంటాను’’ అంటూ తన గురించి చెప్పి కప్పు అందుకొని ఫొటోకు పోజు ఇచ్చాడు ‘మీలో దమ్మున్నవాడు ఎవరు?’ విజేత!
– యాకుబ్ పాషా
గండర గండడు
Published Sun, Sep 2 2018 12:21 AM | Last Updated on Sun, Sep 2 2018 12:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment