‘భారత బ్యాడ్మింటన్‌కు ఇది
గొప్ప రోజు. ఒకే టోర్నీలో మన ఇద్దరు ప్లేయర్లు టైటిల్స్ నెగ్గడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఈ సమయంలో భారత జాతీయ గీతం వినేందుకు నేను అక్కడ ఉంటే బాగుండేదనిపిస్తోంది. రెండూ ప్రత్యేకమైన విజయాలే. సైనా ఈ టోర్నీలో తన అత్యుత్తమ ఆటతీరు కనబర్చింది. ఇటీవల ఆమె చాలా మంచి ఆటతీరు కనబర్చినా విజేతగా నిలువలేదు. ఈ విజయం ఆమెలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది.
కొంత మంది తక్కువ స్థాయి చైనా క్రీడాకారిణులు ఉన్నా... ఇది ఆమె సూపర్ సిరీస్ విజయాన్ని తక్కువ చేయలేదు. ఇక శ్రీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నా పుట్టిన రోజునాడు అతను అపురూపమైన కానుక ఇచ్చాడు. లిన్ డాన్‌లాంటి ఆటగాడిని ఫైనల్లో ఓడించి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గడం అసాధారణం. విజయంతో పాటు అతని ఆటతీరును ప్రత్యేకంగా ప్రశంసించాలి. శ్రీకాంత్ వయసు 21 ఏళ్లే. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలకు ఈ గెలుపు సూచనగా చెప్పగలను.’
- ‘సాక్షి'తో పుల్లెల గోపీచంద్, భారత చీఫ్ కోచ్
బహుమతిగా కారు
కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన కిడాంబి శ్రీకాంత్‌కు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కారును బహుమతిగా ప్రకటించారు. శ్రీకాంత్‌కు ‘ఫోర్డ్ ఫిగో స్పోర్ట్’ కారును ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.