కడవంత గుమ్మడి కాయ అయినా కత్తి పీటకు లోకువే... అని సామెత. గుమ్మడికాయ, సొరకాయ, బీరకాయ వంటి తీగజాతి కాయలు మనకు ఎన్నో పండుతాయి. లేతగా ఉన్నప్పుడే చెట్టు నుంచి కోసి, తరిగి పులుసులో వేసేస్తాం. చక్కగా భోంచేసి ఆ కాయ జీవితానికి ధన్యత్వాన్ని ప్రసాదించినట్లు పోజ్ కొడతాం.
పొరపాటున ఏ కాయ అయినా ముదిరిపోతే అది ఎందుకూ పనికిరానిదయిపోతుంది. ఎవరికీ కొరగానిదయిపోతుంది. సొరకాయ కూడా అంతే కానీ, క్రియేటివిటీ ఉన్న వాళ్ల కళ్లలో పడితే మాత్రం.. ముదిరిన కాయ కూడా ఇదిగో ఇలా ఎల్లకాలం ఇంట్లో ఒక డెకరేషన్ ఐటమ్‌గా ఉండిపోతుంది.
మన పూర్వికులు తమ బుర్రను ఉపయోగించి సొరకాయ బుర్రతో వీణ మీటారు, పొలం పోయే రైతులు మంచినీటి సీసాగా మలిచారు. ఆదివాసులైతే ధాన్యాన్ని దాచుకునేది పెద్ద సొరకాయ బుర్రల్లోనే. ఆధునిక ప్రపంచం.. పింగాణి గుమ్మడికాయలో గుమ్మడికాయ సాంబారు వడ్డిస్తోంది, పింగాణి పనసకాయ, దోసకాయల్లో పులుసు, పెరుగు వడ్డించి భుజాలు చరుచుకుంటోంది. కానీ... ఎవరెన్ని విన్యాసాలు పోయినా బస్తర్ ఆదివాసుల దగ్గర ఈ ఒరిజినల్ కళ ఇంకా బతికే ఉంది. కాయను చెట్టునే ఎండనిచ్చి గింజలు తీసి బుర్రను శుభ్రం చేసి ఉపయోగిస్తారు. మైసూర్‌కు చెందిన సీమా ప్రసాద్ సరిగ్గా ఇదే ఫార్ములాను పట్టుకున్నారు. అయితే ఆమెను ప్రభావితం చేసింది ఆఫ్రికా ఆదివాసులు.
తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం
సీమా ప్రసాద్ భర్త కృష్ణప్రసాద్ వ్యాపారరీత్యా కెన్యా, టాంజానియాలకు వెళ్లేవారు. అక్కడ వాటిని చూసిన సీమకు ఇండియాలో సొంతూరు గుర్తుకు వచ్చింది. పొలాల్లో తీగలకు ఎన్నెన్ని సొరకాయలు, వండినవి వండుకోగా మిగిలినవి ఎండి నేలపాలు కావడమే.
వాటికి మార్కెట్ పెద్దగా ఉండదు కాబట్టి కాపు ఎంత విరివిగా ఉన్నా సరే సొరకాయను సాగుచేసే వాళ్లుండరు. సొరకాయలతో ఇంత చక్కని కళాకృతులను చేయవచ్చని తన ఊరి వాళ్లకు నేర్పిస్తే... సొరకాయలను పండించడానికి రైతులు కూడా ముందుకు వస్తారు. పెట్టుబడి తక్కువ, లాభాలకు మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. రెండు రకాల ప్రయోజనాలున్నప్పుడు ఓ ముందడుగు తానే ఎందుకు వేయకూడదు.. అనుకుంది సీమ.
అలా పుట్టిందే ‘సీమసమృద్ధ’
సీమ బుర్రలో ఆలోచన తట్టినంత వేగంగానే సొంతూరులో అచరణలోకి వచ్చింది. ఇరుగుపొరుగు రైతు మహిళలనూ ఆమె కలుపుకుంది. ‘సీమ సమృద్ధ’ పేరుతో ఎన్‌జివో స్థాపించింది. మన సంప్రదాయ వంగడాలను సేకరించి పరిరక్షించే బాధ్యత తీసుకుంది. ఇండియాలో దొరికే దేశీయ సొరకాయ, గుమ్మడి వంటి తీగ పాదులతోపాటు ఆఫ్రికా నుంచి మన దగ్గర కనిపించని కొత్త రకం కాయల గింజలను సేకరించింది. పండించడం వరకు సరే, ఆ తర్వాత ఆ కాయలను కళాకృతులుగా మార్చడం ఎలా? అందుకోసం నిపుణులను మైసూరుకు పిలిపించింది.
ఆసక్తి ఉన్న మహిళలకు ట్రైనింగ్ ఇప్పించింది, తానూ నేర్చుకుంది. కాయ ఆకారం పాడవకుండా గుజ్జు, గింజలు తీసి శుభ్రం చేయడంతోపాటు డిజైన్‌కి అనుగుణంగా రంగులు వేయడం కూడా నేర్చుకున్నారు. సీమ ఆఫ్రికాలో చూసిన, మన దగ్గర లేని డిజైన్‌లను నేర్చుకోవడానికి మరోసారి ఆఫ్రికాకు వెళ్లింది. అరచేతులకు మెహిందీ డిజైన్ పెట్టుకున్నట్లు సొరకాయ బుర్రల మీద డిజైన్ గీసి, ఆ డిజైన్‌కి అనుగుణంగా రంధ్రాలు చేయడం, రంగు వేయడం నేర్చుకుంది. అలా అందంగా రూపుదిద్దుకున్న ల్యాంప్ షేడ్‌లకు ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కడ లేని గిరాకీ.
కాయ కూడా గిట్టుబాటే!
తినడానికి మార్కెట్‌కొచ్చే సొరకాయ ధర కిలో పది నుంచి పన్నెండు రూపాయలుంటే, కళాకృతుల కోసం పెంచే కాయలకు వంద రూపాయల వరకు పలుకుతోంది. అయితే ఇక్కడ కొద్దిగా మెలకువలు పాటించాల్సి ఉంటుంది. తినడానికి సొరకాయ ఏ రూపంలో ఉన్నా పట్టింపు ఉండదు. వీటికి ఆకారం తీరుగా ఉండాలి.
అందుకే పిందెగా ఉన్నప్పుడే ఆ తీగను ఎత్తు పందిరికి అల్లించి కాయ నిటారుగా కిందకు దిగేటట్లు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వాటికి ఆ ధర పలుకుతుంది. సీమ చేతిలో పడిన సొరకాయ ఇప్పుడు వాల్ హ్యాంగింగ్ అవుతోంది, కొండపల్లి బొమ్మలను పోలిన బొమ్మగానూ రూపాంతరం చెందుతోంది. ఈ ‘ట్యూమా క్రాఫ్ట్’కి మంచి డిమాండ్ ఉంది.
– మను
Comments
Please login to add a commentAdd a comment