సీతాకోక పూలు
ఇంటికి - ఒంటికి
‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున... లిప్‌స్టిక్ పెదాలకే ఎందుకు వేసుకోవాలి అని అడుగుతాడు. పెదాలకి మాత్రమే వేసుకోవాలని చివరకు డిసైడ్ చేస్తాడు. మరి నెయిల్ పాలిష్ కూడా అంతేనా గోళ్లకు మాత్రమే వేసుకోవాలా? అది కేవలం అందుకే పనికొస్తుందా? లేదు. నెయిల్ పాలిష్ గోళ్లకు మాత్రమే కాదు... మన ఇంటికి కూడా అందాన్ని తెస్తుంది. ఎలా అంటారా... ఒక్కసారి పక్కనున్న ఫొటోలపై ఓ లుక్కేయండి. అవన్నీ నెయిల్ పాలిష్‌తో చేసినవే. ఇంట్లో పెట్టుకునే డెకరేషన్ ఐటమ్స్ నుంచి ఒంటికి పెట్టుకునే ఫ్యాషన్ జ్యూయెలరీ వరకు అన్నింటికీ నెయిల్ పాలిష్ హంగును అద్దారు. కావాలంటే ఇవన్నీ మీరు కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే...
కావలసినవి: సులువుగా వంకులు తిరిగే సన్నని వైరు, రంగు రంగుల నెయిల్ పాలిష్‌లు (కొంచెం చిక్కబడినవి. అలాంటివి లేక పోతే నెయిల్ పాలిష్ సీసా మూత తీసి గాలి తగిలేలా పెడితే చిక్క బడుతుంది), క్విక్ డ్రై నెయిల్ పాలిష్ స్ప్రే (మార్కెట్లో దొరుకుతుంది; లేకున్నా ఫర్వాలేదు), కత్తెర, పెన్ లేదా సన్నని రాడ్, పట్టకారు
తయారీ విధానం: ముందుగా తీగను పెన్ లేదా రాడ్‌కు చుట్టాలి. అది ఒక పూరేకులాగా అవుతుంది. పెన్/రాడ్‌ను రింగ్ లోంచి బయటికి తీసేసి, ఆ రేకుకు పక్కనే మరో రేకులా చేయాలి. ఇలా తీగను తిప్పుకుంటూ పక్కపక్కనే అయిదు రేకులు వచ్చేలా చేసు కుని, దాన్ని పువ్వు ఆకారంలోకి తీసుకురావాలి. తర్వాత నెయిల్ పాలిష్‌ను తీగల మీద పూసుకుంటూ పోవాలి.
మొదట పలుచగా ఉన్నా కాసేపటికి దళసరి అవుతుంది. అప్పుడు దానిపై డ్రై నెయిల్ పాలిష్ స్ప్రే చల్లాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత, మళ్లీ రెండో కోటింగ్ వేస్తే రంగు బాగా కనిపిస్తుంది. ఇలా రంగురంగుల పూలు చేసు కుని వాటితో నెక్లెస్‌లు, బ్రేస్‌లెట్లు, ఉంగరాలు, హెయిర్ క్లిప్పులు చేసుకో వచ్చు. పూలగుత్తులు చేసుకుని ఫ్లవర్‌వాజుల్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడిదో ఫ్యాషన్. మీరూ దీన్ని అనుసరించి చూడండి!