decorations
-
లోటస్ స్టేటస్! ఈ వైపు ఓ లుక్ వేయండి..
ఎక్కువ హంగామా లేకుండా ఇంటికి కళ తెచ్చేది పూల అలంకరణే! అలాగని రోజూ తాజా పువ్వులకు తూగలేం కదా! అందుకే ఈ లోటస్ ఫ్రేమ్ వైపు ఓ లుక్ వేయండి.. దాంతో ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించవచ్చు!తామర పువ్వుల గుచ్ఛంతో ఉన్న ఫ్రేమ్స్, లోటస్ పెయింటింగ్‌ని లివింగ్ రూమ్ లేదా డైనింగ్ రూమ్‌లలో అలంకరించవచ్చు. వీటివల్ల ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా అనిపిస్తుంది.సూర్యోదయం వెలుగులో అప్పుడే విచ్చుకుంటున్న తామర పువ్వుల అందం ఇంటి వాతావరణాన్ని వైబ్రెంట్‌గా మారుస్తుంది. గోవుతో కలసి ఉన్న తామర పువ్వుల వాల్ పేపర్స్‌ను పూజ గది, పార్టిషన్స్కు ఉపయోగించవచ్చు.హంగు, ఆర్భాటాలు అక్కర్లేదనుకునేవారు లోటస్ క్యాండిల్ ఏర్పాటుతో ఇంటి శోభను పెంచుకోవచ్చు.లోటస్ థీమ్‌తో ఉన్న కుషన్ కవర్స్‌ను ఎంచుకుంటే గదికి అలంకరణ.. మనసుకు ఆహ్లాదం చేకూరుతాయి.వందల రూపాయల నుంచి లభించే రకరకాల లోటస్ డిజైన్స్‌ను మీ అభిరుచికి తగ్గట్టు ఎంచుకుని, ఇలా డెకరేషన్లో భాగం చేసి ఇంటి స్టేటస్‌నే మార్చేసుకోవచ్చు! -
దీపావళికి మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి ఇలా..
దీపావళి అంటే దీపాల పండుగే కాదు, ఇళ్లువాకిళ్లను శుభ్రం చేసి, ఇంటిని చక్కగా సర్దుకోవడం కూడా. ఇంటిని సర్దే క్రమంలో అందంగా అలంకరించుకోవడం కూడా ఈ పండగ సమయంలో చేసే ముఖ్యమైన పని. ఎంత అనుకున్నా ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఇంటిని డెకరేట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా ఏం పర్లేదు.. చిన్నచిన్న ఐడియాలు, చిట్కాలతో మీ ఇంటిని క్షణాల్లో అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో చూడండి. ►గాజు, రాగి, ఇత్తడి వెడల్పాటి పాత్రలో నీళ్లుపోసి తాజాపువ్వులతో నింపేయాలి. పూలమధ్యలో దీపాలను వెలిగించాలి. ఈ పాత్రను గుమ్మానికి ఎదురుగా, డోర్ పక్కన పెడితే చాలా అందంగా ఉంటుంది. ► ఇంటి గుమ్మం పెద్దగా ఉన్నట్లయితే సంప్రదాయబద్ధంగా అలంకరించాలి. గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులను పూలతో అలకరించి మధ్యలో దీపాలు పెట్టాలి. ఈ రంగవల్లుల పైన వేలాడే ల్యాంప్స్‌ను వెలిగిస్తే ఇంటి గుమ్మం కళకళలాడిపోతుంది. ► వివిధ రంగులతో మెరిసిపోయే చీరలు చున్నీలను గ్లాస్ విండో, డోర్లకు కర్టెన్స్లా పెట్టాలి. ఈ చీరలపైన సన్నని లైటింగ్ దండలను వేలాడదీయాలి. గది మధ్యలో సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిస్తే ఇల్లు మరింత కాంతిమంతంగా మారుతుంది. ► గుమ్మం ముందు, హాల్లో వేసే ముగ్గుని రెండు మూడు రకాల పువ్వులతో వేయాలి. ఈ ముగ్గు మధ్యలో మట్టిప్రమిదలు, సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ పెట్టి వెలిగించాలి. ► ఇంటిముందు పెద్దగా స్థలం లేనప్పుడు డోర్ పక్కనే ఉన్న గోడ మూలనుంచి దీపాలు పెట్టాలి. వీటిచుట్టూ పూలతో ఆలంకరించాలి. ఇవి ఇంటిని మరింత అందంగా చూపిస్తాయి. ► మార్కెట్లో దొరికే వివిధ రకాల వేలాడే దీపాలను వెలిగిస్తే చీకట్లో సైతం ఇల్లు కాంతులీని, పండుగ వాతావరణం కనిపిస్తుంది. ► గోడలకు వేలాడదీసే రంగురంగుల డెకరేషన్ వస్తువులు మార్కెట్లో చాలా కనిపిస్తాయి. కలర్‌ఫుల్ పూసలు, దారాలు, రంగురంగుల మెరిసే క్లాత్‌తో చేసిన, గంటలతో వచ్చే అలంకరణ వస్తువులను గోడకు వేలాడదీసి, కింద మట్టి దీపాలతో అలంకరిస్తే ఇల్లు కళకళలాడిపోతుంది. ► వీటిలో ఏదీ చేసే సమయం లేకపోతే మార్కెట్లో దొరికే చెక్క, యాక్రాలిక్ ల్యాంప్స్ కొనుక్కోని... కిటికీలు, గ్యాలరీలోవేలాడదీస్తే మీ ఇంటి దీపావళికి కళ వస్తుంది. ఇంకెందుకాలస్యం మీ ఇంటికి నప్పే విధంగా సింపుల్ డెకరేషన్ ప్రయత్నాలు మొదలుపెట్టండి. -
పెయింట్ల బిజినెస్‌కు గ్రాసిమ్ సై
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ పెయింట్ల బిజినెస్‌పై దృష్టి పెట్టింది. ప్రధానంగా డెకొరేటివ్ విభాగంలో పట్టు సాధించాలని యోచిస్తోంది. అత్యధిక వృద్ధికి వీలున్న ఈ విభాగంలో దేశంలోనే నంబర్ టూ కంపెనీగా ఆవిర్భవించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణరంగ మెటీరియల్స్ సరఫరాకు కొత్తగా ప్రవేశించిన బీటూబీ ఈకామర్స్ బిజినెస్‌కు జతగా పెయింట్ల బిజినెస్‌ను పెంచుకోవాలని ప్రణాళికలు వేసింది. పరివర్తన దశ వృద్ధిలో భాగంగా రెండు కొత్త బిజినెస్‌లవైపు దృష్టి సారించినట్లు కంపెనీ వార్షిక సమావేశంలో చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పేర్కొన్నారు. దిగ్గజాలతో పోటీ గతేడాది పెయింట్ల బిజినెస్‌పై పెట్టుబడి ప్రణాళికలను సవరిస్తూ గ్రాసిమ్ రెట్టింపునకు పెంచింది. వెరసి రూ. 10,000 కోట్లను పెయింట్ల బిజినెస్‌పై వెచ్చించేందుకు సిద్ధపడుతోంది. తద్వారా మార్కెట్లో ఇప్పటికే విస్తరించిన పెయింట్స్ తయారీ దిగ్గజాలు ఏషియన్, బెర్జర్, కన్సాయ్ నెరోలాక్, ఆక్జో నోబెల్ ఇండియా తదితరాలతో పోటీకి తెరతీయనుంది. ప్రణాళికలకు అనుగుణంగా ఆరు సైట్లలోనూ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నట్లు బిర్లా పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) నాలుగో త్రైమాసికానికల్లా ప్లాంట్లు ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. పరిశోధన, అభివృద్ధి యూనిట్ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు తెలియజేశారు. డెకొరేటివ్ పెయింట్ల విభాగంలో నంబర్ టూ కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంతో ఉన్నట్లు వాటాదారులకు బిర్లా తెలియజేశారు. గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 4,307 కోట్లు వెచి్చంచగా.. వీటిలో రూ. 1,979 కోట్లు పెయింట్ల బిజినెస్‌కు కేటాయించినట్లు వివరించారు. దేశీ పెయింట్ల బిజినెస్ ప్రస్తుత రూ. 62,000 కోట్ల స్థాయి నుంచి రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్లకు చేరనున్నట్లు కొన్ని నివేదికలు అంచనా వేశాయి. ఇటీవల గ్రాసిమ్తోపాటు.. జేఎస్‌డబ్ల్యూ, పిడిలైట్ సైతం పెయింట్ల బిజినెస్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. వారాంతాన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 1,775 వద్ద ముగిసింది. -
Diwali 2022: అరవిరిసిన కాంతులు.. పండుగ వేళ ఇంటిని ఇలా అలంకరించండి!
దీపపు కాంతులతో కూడిన పూల పరిమళాలు దీపావళి అందాన్ని పెంచి ఆనందం మిన్నంటేలా చేస్తాయి. పండుగరోజు ఇంటి అలంకరణలు చేయడం సాధారణమే కాని దానికి కొంచెం కళాత్మకత జోడిస్తే దీపావళి రోజు ఇల్లు గ్రాండ్ లుక్‌తో అదిరిపోతుంది. ఈ సరికొత్త అలంకరణ ఐడియాలపై ఒక లుక్... 1. దీపావళి అంటే తీపి లేకుండా జరగదు కదా! కుటుంబ సభ్యులందరూ కలసి తీపిని పంచుకునే డైనింగ్ టేబుల్ అలంకరణ ఇలా ఉంటే... 2. ఈ అలంకరణకు సమయం ఎక్కువే పట్టొచ్చు కాని మీ ఇంటి దీపావళిని ప్రత్యేకంగా మారుస్తుందనడంలో సందేహం లేదు. 3. చూడటానికి హాయిగా ఎంత బావుందో కదా! శ్రద్ధ తీసుకుని చేసే ఈమాత్రం చిన్న అలంకరణ చాలు ఇంటికి అద్భుతమైన అందం చేకూరడానికి! 4. వివిధ ఆకారాల్లో ఉండే వేలాడే దీపాలంకరణకు పూల సొబగులు అద్దితే కనులకు భలే విందు! 5. చూడటానికి ఎటువంటి హడావిడి లేకున్నా ప్రశాంతమైన భావనను కలిగించాలంటే అరటాకులలో దీపాలు పరిచి ఆహ్లాద దీపావళిని ఆహ్వానించండి. 6. కాదేదీ అలంకరణకు అనర్హం. ఇంట్లో పడున్న వాటితోనూ అందం తేవొచ్చు. గోడ మీద బొమ్మను చిత్రించి చిన్న వెదురు తట్టల్లో దీపాలు పెట్టి ఇంట్లో ఉన్న నిచ్చెనకి పూల అలంకరణలు చేస్తే చాలు.. -
ఎకో-ఫ్రెండ్లీ, ట్రెండీ లుక్‌లో మీ ఇంటికి దీపావళి కళ కావాలంటే!
సాక్షి, హైదరాబాద్: దీపావళి వేళ మీ ఇంటి శోభను రెట్టింపు చేయాలంటే ఇల్లును, ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయడమే కాదు.. చిన్న చిన్న మెళకువలతో ట్రెండీ లుక్ తీసుకురావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ అలంకరణ స్థానంలో ట్రెండీ లుక్ రావాలంటే ఎక్స్టీరియర్, ఇంటీరియర్ రెండు చోట్లా డెకరేటివ్ చేస్తే ఎకో-ఫ్రెండ్లీ దీపావళిగా మారుతుందంటున్నారు. ♦ సంప్రదాయమైన దీపాంతులు, కొవ్వొత్తులకు కాలం చెల్లింది. వీటి స్థానంలో సిరామిక్ లేదా మార్బుల్ పళ్లెంలో మట్టి దీపాంతలను వెలిగించండి. వీటిని హాల్, పూజ గదిలో పెట్టండి. డిస్కౌంట్ ధరల్లో వినూత్న డిజైన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరింత సృజనాత్మకత కావాలంటే బంగారపు వర్ణం ఉండే ఎలక్ట్రిక్ దీపాంతలు కూడా లభ్యమవుతాయి. ♦ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు బహుళ రంగుల లైట్లు, పోర్టబుల్ లైట్లు, లాంతర్లు వంటి వినూత్న లైటింగ్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వైర్లెస్ ఉత్పత్తులు కావటంతో మొబైల్‌తో మనకు ఎంత కావాలంటే అంత కాంతి స్థాయి, రంగులను ఎంపిక చేసుకోవచ్చు. ఇంటి ప్రధాన ద్వారం, మెయిన్ ఎంట్రెన్స్ లేదా భవనం మీద ఓం, స్వస్తిక్ వంటి చిహ్నాలను పెట్టుకోవచ్చు. ఇవి ఎల్ఈడీ లైట్లతో తయారు చేసిన ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ♦ రంగు రంగుల బాటిల్స్‌లో కొవ్వొత్తులను పెట్టి గోడల మూలల్లో లేదా ప్రధాన ద్వారానికి ఇరు వైపులా, ఇంటి చుట్టూ వేలాడదీయవచ్చు. దీంతో ఇల్లు రకరకాల వర్ణాల్లో అందంగా దర్శనమిస్తుంటుంది. ♦ మట్టి దీపాంతలు, లాంతర్లకు బదులు అకార్డియన్ పేపర్ లాంతర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి పగటి పూట సూర్యరశ్మిని సేకరించి.. రాత్రి సమయాల్లో ప్రకాశిస్తాయి -
వాటితో డిజైన్.. ఇంటిని ప్యాలస్‌లా మార్చండి!
ఆకాశంలో విరిసే హరివిల్లుతో పాటు అక్కడ ఉండే మబ్బులు, తారలు, చందమామ.. అన్నీ మన ఇంటి రూఫ్ మీద కనువిందు చేస్తుంటే ఎంత అందంగా కనిపిస్తుందో కదా! ‘ఆ హంగులన్నీ ఏ ప్యాలెస్‌లోనో కనిపిస్తాయి.. మన ఇళ్లకు అంత సీన్ లేదు’ అని అనుకోనక్కర్లేదు. ఇప్పుడు ఆ ప్యాలెస్ స్టైల్ ట్రెండ్‌లోకి వచ్చేసింది. సీలింగ్ స్టిక్కర్‌తో మనిళ్లనూ అలా అలంకరించుకోవచ్చు. గది గదికో తీరు లివింగ్ రూమ్ గ్రాండ్‌గా కనిపించే స్టిక్కర్ డిజైన్స్‌లో అడవి అందాలు, వన్యమృగాలు, పువ్వుల చందాలతో సీలింగ్ సిత్రాలు కనువిందు చేస్తున్నాయి. బెడ్రూమ్లో చుక్కల ఆకాశాన్ని, సముద్రపు సొగసును దించేస్తున్నాయి. ఎలాంటి ఆర్భాటాలూ వద్దూ అనుకునేవారికి సింపుల్ చిత్రాలూ ఉన్నాయి. మది మెచ్చిన జోరు కార్లు, విమానాలు.. ఏవి కోరుకుంటే అవి సీలింగ్‌కి అతికించేసి ముచ్చట తీర్చేసుకునే రోజు వచ్చేసింది. లైట్లు ఆర్పేస్తే తళుక్కున చుక్కలు మెరిసేలా రూఫ్ డిజైన్ చేయించుకునేవారు ఇదివరకు. ఇప్పుడు ఇది కాస్త అడ్వాన్స్ అయ్యి ఏకంగా ఆకాశాన్నే ఇంటి పైకప్పుకు కట్టేసుకుంటున్నారు ఈ రూఫ్ స్టిక్కర్స్‌తో. సీలింగ్ ఆర్ట్ యాంటిక్ థీమ్‌నూ రూఫ్ మీద పరచవచ్చు. దాని కోసం ఎంపిక చేసుకున్న డిజైన్‌ను వాల్ ఆర్ట్‌లాగే రూఫ్ మీదా ఆర్ట్‌గా వేయించుకోవచ్చు. కార్టూన్ హుషారు పిల్లల బెడ్రూమ్లలో పాలపుంతనే కాదు కామిక్ రూపాలనూ కనువిందుగా డిజైన్ చేయించవచ్చు. ఇందుకు సులువైన ఎంపిక సీలింగ్ స్టిక్కర్సే! పిల్లలకు ఇష్టమైన కామిక్ క్యారెక్టర్లు, బొమ్మల చిత్రాలు, కార్ల జోరు.. వగైరా రూఫ్ పేపర్స్ జాబితాలో ఉన్నాయి. రూ.200 నుంచి లభించే ఈ సీలింగ్ స్టిక్కర్స్‌తో ఇంటి రూపాన్నే మార్చేయచ్చు. కొంచెం బోర్ కొట్టిన ఇంటి రొటీన్ డిజైన్ నుంచి ‘వావ్’ అనిపించేలా క్రియేట్ చేయచ్చు. -
Christmas 2021: ఆర్నమెంట్ స్పాంజ్ బాల్స్, క్యాండీబాల్స్తో అందంగా..
క్రిస్మస్ రోజుల్లో పచ్చని జీవితానికి ప్రతీకగా పచ్చని చెట్టును ఇళ్లల్లో అలంకరించుకుంటారు. ఆ చెట్టుకు మనలోని ఆశలకు ప్రతిరూపాలుగా అందమైన బాల్స్, చిరుగంటలు, లైట్లతో అలంకరించడం చూస్తుంటాం. క్రిస్మస్ చెట్టుతో పాటు ఇంటి బాల్కనీలో, డైనింగ్–లివింగ్ రూమ్‌లలో అలంకరణకు ఉపయోగించే అందమైన బాల్స్ తయారీలో ఎన్నో డిజైన్లు కనువిందు చేస్తున్నాయి. ఆర్నమెంట్ స్పాంజ్ బాల్స్ ఎన్ని బాల్స్ కావాలో ముందే ఎంపిక చేసుకోవచ్చు. రకరకాల సైజుల్లో ఇవి మార్కెట్లో లభిస్తుంటాయి. ఈ బాల్స్‌ని పెయింట్ చేసి అలంకరించవచ్చు. మగ్గం వర్క్‌కి ఉపయోగించే బీడ్స్, లేస్, స్వరోస్కి వంటి పూసలను గమ్ సాయంతో అతికించి అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. గట్టి దారంతో లేదా రంగు రిబ్బన్‌తో వేలాడదీయచ్చు. క్యాండీబాల్స్ పలు పరిమాణాల్లో ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బాల్స్ దొరుకుతాయి. వీటిలో చిన్న చిన్న చాక్లెట్లు, క్యాండీలను నింపి వేలాడదీయొచ్చు. ఇవి పిల్లలను మరింతగా ఆకర్షిస్తాయి. పండగ సంబరాన్ని వారిలో రెట్టింపు చేస్తాయి. హెన్నా డిజైన్ బాల్స్ చేతులపై కోన్స్‌తో వేసే హెన్నా డిజైన్స్ గురించి మనందరికీ తెలిసిందే. ఆ డిజైన్స్‌ను పెయింట్‌తో ఈ బాల్స్‌పై వేసి మరింత అందంగా తయారుచేసుకోవచ్చు. నచ్చే డిజైన్ ఎవరికి వారు ఎంపిక చేసుకోవచ్చు. వీటి కాంబినేషన్‌కి కొన్ని పూసలు, దారాలు, రంగు రంగు రిబ్బన్లను కూడా జత చేసుకోవచ్చు. కుందన్–మిర్రర్ బాల్స్ రాత్రివేళ మరింతగా మెరుపులీనుతూ వేలాడదీసిన బాల్స్ కనువిందు చేస్తుంటే మనసు మరింత ఉల్లాసభరితంగా ఉంటుంది. అందుకని అందమైన బాల్స్ తయారీలో కుందన్స్, మిర్రర్ గ్లూ సాయంతో అతికించి తయారుచేసుకోవచ్చు. క్రిస్మస్ వచ్చేటప్పుడు ప్రేమాభిమానాలను, సుఖసంతోషాలను తీసుకురావాలని ఆహ్వానం పలికే ఈ ప్రక్రియ ఇంటిని కళాభరితంగా మార్చేస్తుంది. చదవండి: స్ఫూర్తి మినియేచర్ సృష్టి... మది దోచే మట్టి రూపాలు -
పూచిన తామరలు
కలంకారితో అలంకరణ ఎప్పుడూ బాగుంటుంది. ఆ కలంకారి డిజైన్‌లో పూచిన తామరలు ఉంటే ఇంకా బాగుంటుంది. మరి అంచులు బెనారస్ పట్టుతో ముడిపడితే? ఇక్కడ ఉన్నట్టుగా ఉంటుంది. కొత్తలుక్కు కోసం ఈ తామర కలంకారిని ఉపయోగించి చూడండి. వికసించిన కమల సౌందర్యం సొంతం చేసుకోండి. కలంకారీ డిజైన్స్ ఎన్నో ఏళ్ల నుంచి వాడుకలో ఉన్నవే. వీటిని ఎంత కొత్తగా చూపిస్తున్నామన్నదే ముఖ్యం. సాధారణంగా కలంకారీ అనగానే నెమళ్లు, తీగలు, కొమ్మలు.. ఇవే కనిపిస్తుంటాయి. ఈ చీరలలో వివిధ రూపాలలో ఉండే తామరపువ్వు డిజైన్స్‌ను ఒక థీమ్‌గా తీసుకున్నాం. ఈ పెన్ కలంకారీలో వాడిన రంగులన్నీ నేచరుల్ కలర్స్ మాత్రమే. డల్ లుక్ రాకుండా ఉండటం కోసం బెనారస్ పట్టును అంచులుగా జత చేశాం. ఇవి ఏ ప్రత్యేక సందర్భాలలోనైనా అన్ని వయసుల వారు ధరించవచ్చు. ►కలంకారీ కళ తెలుగువారి సొంతం. అద్భుతమైన చేతిపనితనంతో దుస్తులను అందంగా తయారుచేస్తారు కళాకారులు. ప్లెయిన్ ప్యూర్ పట్టు చీర మీద రూపుదిద్దుకున్న పెన్ కలంకారీ డిజైన్లు వేడుకల సందర్భంలో ఓ అద్భుతమైన కళను తీసుకుస్తాయి. ఎక్కడ ఉన్నా ప్రత్యేకతను చాటుతాయి. ప్లెయిన్ పట్టుకు కలంకారీ డిజైన్‌ను వేయించుకున్నాక బామ్మల కాలం నాటి బెనారస్, కంచి పట్టు చీరల పెద్ద పెద్ద అంచులనూ బార్డర్స్గా వాడుకోవచ్చు. దీని వల్ల చీరకు, లెహంగా, దుపట్టా డిజైన్లకు మరింత గ్రాండ్ లుక్ వస్తుంది. ఏ వేడుకలోనైనా హైలైట్ అవుతుంది. ►జాతీయస్థాయిలో పెన్ కలంకారీకి డిజైన్స్‌కి గొప్ప పేరుంది. కలంకారీ డిజైనర్ పట్టు చీరలు ఏ వేడుకల్లో ధరించినా కళను, హుందాతనాన్ని, గొప్పదనాన్ని, మనదైన ఆత్మను ప్రతిఫలింపజేస్తుంది. ఎవర్‌గ్రీన్‌గా నిలిచే కలంకారీ డిజైనర్ చీరలను యువతరం వారి అభిరుచిమేరకు ఏ కాలమైన మరో ఎంపిక అవసరం లేకుండా ధరించవచ్చు. -
పరమదేవుని నివాస స్థలమది
మహా గోపురాలు, విశాలమైన ఆవరణలు, పాలరాతి తాపడాలు, వెండి బంగారంతో చేసే అలంకరణలు చర్చికి సౌందర్యాన్నివ్వవు. దేవుని సాన్నిధ్యం, ఆయన పవిత్రత, ప్రేమ విలసిల్లే స్థలంగా విశ్వాసం జీవితం, విశ్వాసి కుటుంబం, చర్చి ఉండాలని ప్రభువు కోరుకొంటున్నాడు. మన గురించి మనమేమనుకొంటున్నామన్నదానికన్నా, మన గురించి దేవుడేమనుకొంటున్నాడన్నది చాలా ముఖ్యమైన అంశం. లవొదికయలో నున్న చర్చికి పరిశుద్ధాత్మ దేవుడు రాసిన లేఖ ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేవుని సాన్నిధ్యానికి, దేవుని ప్రసన్నతకు, పవిత్రతకు, ముఖ్యంగా దేవుని ప్రేమకు నిలయంగా దేవుడే నిర్దేశించిన స్థలం చర్చి. ఆదిమకాలంలో దేవుని ప్రేమను యేసుక్రీస్తులో సంపూర్ణంగా చవిచూసిన ఆదిమ అపొస్తలులు, విశ్వాసులు ఆ ప్రేమనే లోకానికి ఆచరణలో చాటడానికి, ఆయన సాన్నిధ్యంలోని అనిర్వచనీయమైన ఆనందాన్ని లోకానికి రుచిచూపించేందుకు భూదిగంతాలకు వెళ్లి అనేక ప్రాంతాల్లో స్థాపించినవే ఆ చర్చిశాఖలు. అందువల్ల చర్చి దేవుని నివాసస్థలం, ఆశ్రితులు, నిరాశ్రయులు, నిరుపేదలు, సమాజంలోని బలహీనులు అక్కడి విశ్వాసుల సహవాసంలో వారి ఆదరణను, సహాయాన్ని, అనునయాన్ని పుష్కలంగా పొంది దేవుని ప్రేమను అనుభవించే పరలోకానందానికి సాదృశ్యస్థలం. అందుకే దేవుడు లవొదికయలోని చర్చికి రాసిన లేఖలో తన బాధనంతా వ్యక్తం చేశాడు. ఒక కుమారుడు తన తల్లిదండ్రుల ప్రాపకంలో పెరిగి పెద్దవాడై, ఉన్నతవిద్యలనభ్యసించి, ఒక గొప్పసంస్థను స్థాపించి, సమాజంలో అత్యున్నతస్థానాన్ని, పేరుప్రఖ్యాతులను సంపాదించి, తన ఔన్నత్యానికి కారకులైన తల్లిదండ్రులనే చివరికి మర్చిపోతే అదెంత విషాదకరం? లవొదికయ చర్చిలో సరిగ్గా జరిగిందదే.‘నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువలేదు అని నీవనుకొంటున్నావు కాని ఎంతోకాలంగా నేను బయట నిలబడి నీ తలుపు తడుతున్నాను కాని నీవు తలుపు తీసి నన్ను లోపలికి ఆహ్వానించడం లేదు’ అని దేవుడు తన లేఖలో ఆహ్వానించడం లేదన్నది ఆ చర్చిపై దేవుడు చేస్తున్న అభియోగం(ప్రక 3:14–21). మన భాషలో చెప్పాలంటే సెల్‌ఫోన్ అదేపనిగా మోగుతుంటే, ఎవరో అవతల మన తలుపు పదే పదే తడుతూ ఉంటే మనం స్పందించకుండా ఉండగలమా? కాని ఆ స్పందనే కరువైన చర్చి లవొదికయలోని చర్చి!! అందువల్ల ఒక కార్పొరేట్ సంస్థ స్థాయికి ‘నీవు ఎదిగినా, నీకు ఎంత ధనమున్నా నీవు దిక్కుమాలినవాడవు, దరిద్రుడవే. ఎంతో సింగారంగా దుస్తులు ధరించుకున్నా పవిత్రత లేని దిగంబరివే. నీకు లోకమంతా ఎరిగిన జ్ఞానమున్నా నీది దైవత్వాన్ని ఎరుగని అంధత్వమే !!’ అని వాపోతున్నాడు దేవుడు. లోకాన్నంతా లోపలి తెచ్చుకొని అన్నింటికీ కారకుడైన దేవుణ్ణి మాత్రం తలుపు అవతల పెట్టిన ‘దేవుడే లేని చర్చి’ అది. అంతకన్నా మరో విషాదం ఉంటుందా?ఎన్ని ఉన్నా, అది దేవుడు లేని చర్చి అయినా, కుటుంబమైనా, విశ్వాసి అయినా వాళ్ళు ఏమీ లేనివారికిందే లెఖ్ఖ!! మహాగోపురాలు, విశాలమైన ఆవరణలు, పాలరాతి తాపడాలు, వెండి బంగారంతో చేసే అలంకరణలు చర్చికి సౌందర్యాన్నివ్వవు. దేవుని సాన్నిధ్యం, ఆయన పవిత్రత, ప్రేమ విలసిల్లే స్థలంగా విశ్వాసం జీవితం, విశ్వాసి కుటుంబం, చర్చి ఉండాలని ప్రభువు కోరుకొంటున్నాడు. చర్చిని చందాలతో కాదు, విశ్వాసుల సాక్ష్యంతో, వారి ప్రేమపూర్వకమైన పరిచర్య, క్రియలు, త్యాగంతో నిర్మించాలి. అలాంటి చర్చి యేసుక్రీస్తు పునరాగమనానికి లోకాన్ని సిద్ధం చేస్తుంది. చర్చిని ఆదిమ అపొస్తలులు స్థాపించడంలో ఉద్దేశ్యం కూడా అదే!! యేసుక్రీస్తు ప్రేమను, త్యాగాన్ని, కృపను చర్చి తన పరిచర్య ద్వారా లోకానికి పరిచయం చేసి ఆయన రెండవ రాకడకోసం లోకాన్ని సిద్ధం చేయాలన్నదే చర్చి ముఖ్య లక్ష్యం. రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
గృహాలంకరణలోకి హౌస్‌జాయ్!
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్లంబింగ్, ఎలక్ట్రిషన్, లాండ్రీ వంటి హోమ్ సర్వీసెస్ రంగంలో ఉన్న హౌస్‌జాయ్.. గృహ నిర్మాణ, నిర్వహణ, అలంకరణ రంగంలోకి దిగనుంది. ప్రస్తుతం బెంగళూరులో అందుబాటులో ఉన్న ఈ సేవలను త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు కంపెనీ సీఈఓ శరన్ చటర్జీ ‘స్టార్టప్ డైరీ’తో చెప్పారు. కన్స్ట్రక్షన్, డెకరేషన్ విభాగాల్లో హైదరాబాద్ అతిపెద్ద మార్కెట్ అని.. 20 శాతం వరకూ మార్జిన్లుంటాయని అందుకే ఎంట్రీ ఇచ్చామని తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. గృహ సేవల రంగంలో ప్రధాన సవాళ్లు.. కార్మికుల లభ్యత, విశ్వసనీయత, పనిలో నాణ్యత! కారణం.. ఈ సేవలన్నీ అసంఘటిత రంగంలో ఉండటమే. టెక్నాలజీ సహాయంతో కార్మికులను, నాణ్యమైన సేవలను ఒకే వేదిక మీదికి తీసుకొస్తే అనే ఆలోచన నుంచే ‘హౌస్‌జాయ్’ పుట్టింది. అర్జున్ కుమార్, సునీల్ గోయెల్‌లు 2015 జనవరిలో బెంగళూరు కేంద్రంగా ఆన్లైన్ హోమ్ సర్వీసెస్ స్టార్టప్ హౌస్జాయ్ను ప్రారంభించారు. గృహ సేవలన్నీ ఒక్క చోటే.. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, సూరత్, ఢిల్లీ, కోయంబత్తూరు, పుణె, ముంబై, గుర్గావ్ నగరాల్లో సేవలందిస్తున్నాం. క్లీనింగ్, హోమ్ రిపేర్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ సర్వీసెస్, లాండ్రీ, కంప్యూటర్ రిపేర్, ప్యాకర్స్ అండ్ మూవర్స్, బ్యూటీ, పెస్ట్ కంట్రోల్, పెయింటింగ్, గృహోపకరణాల రిపేర్లు వంటి 14 విభాగాల్లో సేవలను అందిస్తున్నాం. ఆయా విభాగాల్లో 65 వేల మంది కార్మికులు నమోదయ్యారు. ఆయా విభాగంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్లను నిపుణులు, వాళ్ల వ్యక్తిగత వివరాలు, పూర్వాపరాలు, క్రిమినల్ రికార్డులు అన్నీ క్షుణ్నంగా పరిశీలించాకే రిజిస్టర్ చేసుకుంటాం. హౌస్‌జాయ్ అగ్రిగేట్ మోడలే. కానీ, 100 శాతం నిర్వహణ బాధ్యత కంపెనీదే. నగరం వాటా 20 శాతం.. ఇప్పటివరకు 20 లక్షల మంది కస్టమర్లు మా సేవలను వినియోగించుకున్నారు. హైదరాబాద్ వాటా 20 శాతం వరకుంటుంది. ప్రస్తుతం రోజుకు లక్షకు పైగా ఆర్డర్లు వస్తున్నాయి. పనికి సంబంధించి 30 రోజుల పాటు గ్యారంటీ, అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాల మీద రూ.10 వేల బీమా కూడా ఉంటుంది. ప్రస్తుతం మా కంపెనీలో 350కి పైగా ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు లాండ్రీ స్టార్టప్ మైవాష్, ఫిట్నెస్ స్టార్టప్ ఓరోబిండ్లను కొనుగోలు చేశాం. నిర్మాణం, అలంకరణలోకి.. గృహ సేవల విభాగం నుంచి తాజాగా గృహ మరమ్మతులు, అలంకరణ, నిర్మాణం, నిర్వహణ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాం. ప్రస్తుతం బెంగళూరులో సేవలందిస్తున్నాం. గృహ రెనోవేషన్ ప్రారంభ ధరలు రూ.1–1.5 లక్షలు, ఇంటీరియర్ డిజైన్ రూ.3.5 లక్షలు, ఇంటి నిర్మాణం చ.అ.కు రూ.1,600లుగా ఉంటాయి. ధరలు నగరం, ప్రాజెక్ట్ విస్తీర్ణాలను బట్టి మారుతుంటాయి. ఇప్పటికే 25–30 భారీ ప్రాజెక్ట్ ఆర్డర్లు వచ్చాయి. ఆయా విభాగాల్లో సీనియర్ మేనేజ్మెంట్ హోదాలో ఉద్యోగులను తీసుకోనున్నాం. 300 శాతం ఆదాయ వృద్ధి.. ఇప్పటివరకు రెండు రౌండ్లలో కలిపి రూ.215 కోట్ల నిధులను సమీకరించాం. అమెజాన్, మ్యాట్రిక్స్ పార్టనర్స్ ఇండియా, సామా ఫ్యామిలీ ట్రస్ట్, వెర్టెక్స్ వెంచర్స్, క్వాల్కమ్ ఏషియా పసిఫిక్, రు–నెట్ సౌత్ ఏషియా ఈ పెట్టుబడులు పెట్టాయి. 2017 ఆర్థిక సంవత్సరంలో రూ.31.79 కోట్లుగా ఉన్న ఆదాయం.. 2018 నాటికి 19 శాతం వృద్ధితో రూ.37.85 కోట్లకు చేరింది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 300 శాతం వృద్ధిని లకి‡్ష్యంచామని’’ శరన్ వివరించారు. -
రెండవ రోజు శ్రీబాలాత్రిపురసుందరీదేవి
అరుణ కిరణ జాలై రంజితా సావకాశా విద్ధృత జప వాటికా పుస్తకాభీతి హస్తా ఇతర కరవరద్యా ఫుల్ల కల్హార సంస్థా నివసతు హృది బాలా నిత్యకల్యాణరూపా శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గాదేవి బాలాత్రిపురసుందరీదేవిగా దర్శనమిస్తుంది. బాలాదేవి మహిమాన్వితమైన తల్లి. శ్రీబాలామంత్రం సమస్త దేవీమంత్రాల్లోకి గొప్పది, ముఖ్యమైనది. అందుకే శ్రీవిద్యోపాసకులకి మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపురసుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత ఈ బాలా దేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి. -
పెళ్లికి చెలి కళ
అమ్మాయి పెళ్లికి చెలులే కళ.. అలంకారాలకు పువ్వులు, ముగ్గులు, తోరణాలే కాదు స్నేహితులు కూడా! స్నేహాన్ని మించిన.. ఆభరణం ఉండదు కదా! పెళ్లి కూతురుకి వీళ్లే శుభశకునాలు.. పెళ్లికళలు... పెళ్లి కూతురేకాదు ఆమెను అంటిపెట్టుకుని ఉండే నిచ్చెలుల అలంకారణం కూడా ఇప్పుడు ప్రధానమైంది. ప్రత్యేకమైంది. ట్రెండ్ అయ్యింది. కళకళలాడుతూ చెలుల అంతా ఒకే అలంకారంలో తిరుగుతుంటే పెళ్లి కళ వెయ్యింతలై వెలుగుతోంది. రాజకుమారిలా నవవధువు.. ఆమె చుట్టూ తూనీగల్లా చెలులు తిరగాడుతుంటే ఫ్లాష్ కెమరాలు షార్ప్‌గా మెరుస్తుంటాయి. బ్రైడ్స్ మెయిడ్ అనే ఈ ఫ్యాషనబుల్ డ్రెస్‌కి తప్పనిసరిగా పాటించాల్సిన రూల్స్.. ఎంగేజ్మెంట్, సంగీత్, రెసెప్షన్ వేడు స్నేహితులు/అక్కచెల్లెళ్లను మీ ప్లాన్‌లో భాగస్తులను చేయండి. ఎంత మంది అవుతారో ఒక జాబితా తయారుచేసుకొని డిజైనర్స్‌ని సంప్రదించాలి. రంగులు, డిజైన్స్ ఏవి బాగుంటాయో పెళ్లి కూతురు డ్రెస్ ఎంపికను బట్టి ఎంపిక చేసుకోవాలి. గ్రూప్ అందరూ ఒకలా ఉండి అందులో ఒకరు రాంగ్ డ్రెస్ డిజైన్, రంగులు వేరేగా ఉంటే ప్లాన్ ప్లాప్ అవుతుంది. అందుకని వధువు అందరి డ్రెస్ డిజైన్స్ వేడుకకు కనీసం వారం రోజుల ముందుగానే ఫైనల్ చేయాలి. పెళ్లికి ముందు డ్రెస్సులు వేసుకొని సరిచూసుకోవడం పెళ్లికి ముందు చాలా వరకు చేయరు. కానీ, ముందుగా అందరూ ఒకసారి ధరించి సరిచూసుకోవడం వల్ల వేడుక అనుకున్న విధంగా పూర్తి అవుతుంది. వేడుకలో ధరించే దుస్తులు ఒకసారి ధరించి చూసుకోవడం వల్ల ఆల్ట్రేషన్ సమస్యలు ఉండవు. అందరూ ఎలాంటి ఆభరణాలు ధరించాలో చూసుకోవాలి. ఉదాహరణకు : కుందన్స్ లేదా పోల్కీ, వరుసల హారాలు, చెవి బుట్టలు, గాజులు, వడ్డాణాలు.. ఇవన్నీ అందరూ ఒకే తరహావి ఎంచుకోవాలి. ∙అత్యంత ఖరీదైన ఆభరణాలను ధరించకపోవడమే మేలు. సంగీత్ వంటివి ఆటపాటలతో వేడుక జరిగే సమయం. మరీ ఖరీదైన లెహంగా వంటివి కూడా గ్రూప్‌కి పెట్టకూడదు. బ్రైట్ కలర్స్‌లో ఉండే ఒకే రంగు చీరలు లేదా సల్వార్ కుర్తా వంటివి కూడా బాగుంటాయి. డ్యాన్స్ చేయడానికి అనువైన డ్రెస్ అయితే సౌకర్యానికీ లోటుండదు. ఇండోవెస్ట్రన్ లుక్ వచ్చేలా గౌన్లు, క్రాప్‌టాప్, లంగాఓణీ డ్రెస్ .. కూడా ఈ వేడుకకు నిండుదనాన్ని తీసుకువస్తాయి. హెవీగా మేకప్ కాకుండా మీదైన సొంత మేకప్‌నే ఎంచుకోవడం ఉత్తమం. పెళ్లి కూతురువరకు మేకప్ ఆర్టిస్ట్‌కి ఛాన్స్ ఇవ్వచ్చు. ఎవరికి వారు మేకప్‌కి సొంత మేకప్బాక్స్ని ఉపయోగించడం వల్ల ఇరిటేట్ వంటి సమస్యలు తలెత్తవు. వెంట మేకప్ బాక్స్‌లో .. చెమట అద్దడానికి బ్లాటింగ్ షీట్స్, కన్సీలర్, హెయిర్ స్ప్రే, చిన్న అద్దం, లిప్‌స్టిక్, మస్కారా, టచ్అప్స్ వంటివి ఉంచుకోవాలి. పెళ్లి కూతురు దగ్గర ఉండే సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి చెలుల తయారీ ముఖ్యం. అందుకని డ్రెస్సులు, ఆభరణాలు కనీసం రెండు సెట్స్ అయినా ఉండేలా చూసుకోవాలి. ఏ సంప్రదాయ వేడుకకైనా హాజరయ్యే సమస్యంలో డ్యాన్స్ చేయడానికి అనువుగా ఉండేలా మరొక డ్రెస్ కూడా వెంట తీసుకెళ్లడం ముఖ్యం. సేఫ్టీ పిన్స్, డ్రేప్స్, ఐ లాష్, గ్లూ, సూది–దారం వంటివి తప్పనిసరిగా ఉండాలి. – నిర్వహణ: ఎన్.ఆర్ -
పదములే చాలవు... భామా!
ఇండోవెస్ట్రన్ అయినాఇంటింటి వేడుకైనా తల నుండి పాదం వరకు ఒకే కాంబినేషఒకే థీమ్ ఆభరణాలు అలంకరణలో చేరితే ఆ రూపాన్ని వర్ణించడానికి పదములే చాలవు సాయంకాలం షికారుకు వెళ్లాలన్నా, సంప్రదాయ వేడుకైనా ఆభరణాలు ధరించే దుస్తులకు సరిపోయేలా ఉన్నాయో లేవో సరి చూసుకోవడం అనేది తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆభరణాలతో పాటు ఇతర అలంకరణ వస్తువులన్నీ ఒకే థీమ్‌తో ఉండేలా జాగ్రత్త తీసుకునే టైమ్ వచ్చేసింది. అదే ఇప్పుడు ట్రెండ్ అయ్యింది. పాపిట బిళ్ల నుంచి పాదం వరకు ముత్యాలు, రత్నాలు, కుందన్స్, పూసలు.. ఆభరణమేదైనా పాపిట్లో అలంకరించిన నగమాదిరే పాదరక్షల డిజైన్ కూడా ఉండాలి. అదెలా?! అనే వారికి ఇప్పుడీ డిజైన్లు అందుబాటులోకి వచ్చేశాయి. చెవి జూకాలు – చెప్పుల డిజైన్ ఒకేలా ఉంటే అదీ ఓ స్టైల్. కాలి పట్టీల రాళ్ల డిజైన్‌తో పోటీ పడే షూ ఉంటే ఆ కాలి అందం ఎన్నింతలు పెరుగునో అని మగువలు మురిసిపోవచ్చు. చేతి గాజులు – కాలి చెప్పుల డిజైన్‌తో జత కలిస్తే ధరించే దుస్తుల అందం రెట్టింపు అవకుండా ఉంటుందా! అనుకున్నారేమో అందమైన కాంబినేషన్‌గా జత కట్టేశారు. మెడలో హారం రంగు కాలి చెప్పుల రంగు ఒకేలా కాంతులీనుతుంటే! ఆ చెప్పుల మీదుగా పారాడే చీర అంచు డిజైన్ వాటితో పోటీపడుతుంటే నిలువెత్తు అందం నడిచివచ్చినట్టే! ముక్కుబేసరి పెట్టుకుంటేనే ముఖకాంతి పండువెన్నెల పోటీపడుతుంది. ఇక బేసరితో పోటీ పడేలా చెప్పుల జత కూడా తోడైతే మేలి ముసుగులో వధువు మెరిసిపోకుండా ఉండగలదా అనేది డిజైనర్స్ చెబుతున్న మాట. ఇన్ని డిజైనర్ అలంకరణతో పాటు వీటితో జత కలిసే హ్యాండ్ బ్యాగ్ లేదా క్లచ్ మరో అదనపు ఆకర్షణను నింపుతుంది. అలంకరణ వస్తువులన్నీ మ్యాచ్ చేయాలంటే అందుకే సమయం పడుతుంది. పైగా అన్నీ ఒకేలా దొరుకుతాయన్న గ్యారంటీ ఉండదు. ఇలా అన్నీ ఒకే థీమ్‌తో లభించే ఆభరణాలు, అలంకరణ వస్తువుల డిజైన్, నాణ్యతలను బట్టి ధరలు ఉన్నాయి.వెస్ట్రన్స్టైల్ నుంచి మన సంప్రదాయ దుస్తులకూ ఈ ట్రెండ్ అనుకరణ వచ్చింది. డ్రెస్‌లో ఒక ముఖ్యమైన డిజైన్ ప్యాటర్న్ తీసుకొని దానికి తగ్గట్టుగా చెప్పులు, బ్యాగ్, బ్యాంగిల్.. ఇలా అన్నీ ఒక సెట్‌లా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఈ మోడల్ సెట్స్ యువతరాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మ్యాచింగ్ కోసం ఎక్కువ పాట్లు అవసరం లేని ఈ కొనుగోళ్లు ఆన్లైన్ మార్కెట్లోనూ అందుబాటులోకి వచ్చాయి. -
కొప్పున చందమామ
ఈ కాలం భుజాల మీదుగా వెంట్రుకలు పడితే ఉక్కపోత కారణంగా చిరాకుగా అనిపిస్తుంటుంది. అందుకే చాలా వరకు కేశాలను కొప్పులా ముడేయడానికి ఇష్టపడతారు మగువలు. మరి ఆ కొప్పు ఎలాంటి అలంకరణ లేకుండా ఉంటే వేడుకలో డల్ అవుతారు. సింపుల్ అనిపిస్తూనే చూపరులను ఇట్టే ఆకట్టుకునేలా కొప్పుకు నాజూకైన అలంకరణలు ఎన్నో వచ్చాయి. వాటిలో మీరు మెచ్చే కొప్పుల ఆభరణాలు ఇవి. పూల మొగ్గలు/ఆర్టిఫిషియల్ గజ్రా... కొప్పున మల్లె మొగ్గలను సింగారించడానికి ఇప్పుడు చాలా భిన్నమైన, సులువైన పద్ధతులున్నాయి. హెయిర్ పిన్‌కి మల్లెలు చుట్టి వాటిని కొప్పులో క్రాస్‌గా గుచ్చితే చాలు. ప్లాస్టిక్ పువ్వుల కొప్పు దండ(గజ్రా)లూ ఉన్నాయి. హెయిర్ పిన్... కొప్పులో సింగారించడానికి దువ్వెన పళ్ల మాదిరి ఉండే క్లిప్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని కొప్పుకు ఓ వైపుగా లోపలికి గుచ్చితే చాలు. బయటకు కనిపించే పిన్ డిజైన్ ఇట్టే ఆకట్టుకుంటుంది. హెయిర్ బ్రూచ్... పమిటకు సింగారించే బ్రూచ్ స్టైల్ కేశాలంకరణకూ వచ్చాయి. ఇది ఒక పువ్వులా ఉండి కొప్పు మధ్యన చందమామలా మెరిసిపోతుంటుంది.హెయిర్ స్టిక్ /బాబ్ పిన్స్... ముడి వేశాక కురులు విడకుండా ఉండటానికి స్టిక్స్ అవసరం పడుతుంటాయి. వీటికీ డిజైనర్ టచ్ ఉండటంతో కేశాలంకరణలో ముదువరసలో ఉన్నాయి. హెడ్ పీస్... తల మీదుగానే కాదు కొప్పును కింద నుంచి అలంకరించే ఆధునికపు కేశాలంకరణ క్లిప్స్ వచ్చాయి. ఇవి వెస్ట్రన్ స్టైల్ కేశాలంకరణకు మరింత వన్నె తెస్తాయి. -
పార్టీ 2017
17లో 16 ఏళ్ళ అమ్మాయిలా కనపడాలంటే! ఎన్నేళ్ళొచ్చినా 16 ఏళ్ళ అమ్మాయిలా పార్టీ చేసుకోవాలంటే... గెట్ రెడీ! గెట్ ఎ ప్రామ్! సింగిల్ పీస్ బ్యూటీలివి. పార్టీలను పరమళింప చేసే సూట్లు ఇవి. కమాన్.. లెటజ్ గో పార్టీ! ►ఎక్కడ ఉన్నా పార్టీకే ప్రత్యేకం అనిపించే బ్లాక్ కలర్ ప్రామ్ గౌన్. ► మత్స్య సుందరిని తలపిస్తున్న గ్రే కలర్ ప్రామ్ డ్రెస్. పార్టీకి ప్రత్యేక హంగులను అద్దుతుంది. ► కొత్త సంవత్సరాన పచ్చని పరవశాన్ని మోసుకొస్తుంది గ్రీన్ కలర్ ప్రామ్డ్రెస్. పొడవాటి గౌనులా ఉండే ప్రామ్ విదేశాలలో సాయంకాల బాల్రూమ్ డ్యాన్స్‌లకు తప్పనిసరి డ్రెస్‌గా ఉంటుంది. శరీరానికి అతుక్కుని ఉండే ఈ గౌన్‌ను ధరించడం వల్ల శరీరాకృతి అందంగా కనిపిస్తుంది. కట్టుకున్నవాళ్లు డ్రెస్ కట్ వల్ల మత్స్యసుందరిలా, యువరాణుల్లా, మహారాణుల్లా కనిపిస్తారు. ఎ–లైన్, కోణాకృతి శరీర ఆకృతి గలవారికీ బాగా నప్పే ఈ డ్రెస్ దాదాపు 16, 17 శతాబ్దంలో వెలుగులోకి వచ్చింది. 18వ శతాబ్దంలో ఫార్మల్ డ్రెస్‌గా, ఈవెనింగ్ బాల్ డ్యాన్స్ డ్రెస్‌గా పేరొందింది. 19వ శతాబ్దంలో పార్టీ డ్రెస్ అంటే ప్రామ్ డ్రెస్ తప్పక ఉండాల్సిందే అనే ముద్ర పడిపోయింది. పాశ్చాత్య వివాహవేడుకలలో తప్పక కనిపించే ఈ డ్రెస్ మన దగ్గర ఈవెనింగ్ పార్టీలో తళుక్కుమంటోంది. ► పువ్వులు, లతలు ప్రామ్ డ్రెస్ మీద కొత్త సింగారాలు అద్దుతుంటే వేడుకలో సిండ్రెల్లా అనిపించాల్సిందే! ► వంగపండు రంగు ప్రామ్డ్రెస్ ధరిస్తే యువరాణిలా మెరిసిపోకుండా ఉండలేరు. ► చీకటి వెలుగులకు కొత్త బాష్యాన్ని చెప్పే నలుపు–తెలుపు కాంబినేషన్ ప్రామ్ పార్టీలో హైలైట్. ► రాయల్ బ్లూ కలర్, ఒన్ షోల్డర్ ప్రామ్ డ్రెస్. పార్టీకి రాచరికపు సొబగులను మోసుకొస్తుంది. పార్టీలో డ్రెస్కే ప్రత్యేకత ►ఆభరణాలు, ఇతర అలంకారాలు అవసరమే లేదు. ► సింపుల్ మేకప్ పార్టీ వినోదానికి స్పెషల్ అట్రాక్షన్. ► హెయిర్ స్టైయిల్స్కు హైరానా వద్దు. లూజ్ హెయిర్ ప్రామ్ డ్రెస్‌కి సిసలైన స్టైల్. -
అశ్వంపై పట్టాభిరాముడు
వాల్మీకిపురం, న్యూస్‌లైన్: వాల్మీకిపురం శ్రీపట్టాభిరాములవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అశ్వవాహన మహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయంలో తెల్లవారుజాము నుంచి సుప్రభాతసేవ, మూలవర్లకు అభిషేకం, అర్చన, తోమాలసేవతో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుచ్చి ఉత్సవం, భోగోత్సవమూర్తులైన శ్రీసీతారామలక్ష్మణులకు స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం విశేష అలంకరణలు చేశారు. రాత్రి కైంకర్యాల అనంతరం ఊంజల్ సేవ క న్నులపండుగగా సాగింది. అనంతరం విశేషాలంకృతుడైన పట్టాభిరాముడు విల్లంబులు ధరించి అశ్వవాహనంపై పార్వేటకు బయలుదేరడం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సందర్భంగా అర్చకులు పార్వేట విశిష్టతను భక్తులకు తెలియజేశారు. బళ్లారివాయిద్యాలు, బాణసంచా పేలుళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ పురవీధుల్లో పట్టాభిరాముడి నగరోత్సవం వైభవంగా సాగింది. ఎస్వీ మ్యూజిక్ కళాశాల విద్యార్థినుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలు టీటీడీ డెప్యూటీ ఈవో శ్రీధర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, ప్రధాన అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు, భాషికాచార్యులు, కృష్ణప్రసాద్ , రాజుభట్టర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.