మహా గోపురాలు, విశాలమైన ఆవరణలు, పాలరాతి తాపడాలు, వెండి బంగారంతో చేసే అలంకరణలు చర్చికి సౌందర్యాన్నివ్వవు. దేవుని సాన్నిధ్యం, ఆయన పవిత్రత, ప్రేమ విలసిల్లే స్థలంగా విశ్వాసం జీవితం, విశ్వాసి కుటుంబం, చర్చి ఉండాలని ప్రభువు కోరుకొంటున్నాడు.
మన గురించి మనమేమనుకొంటున్నామన్నదానికన్నా, మన గురించి దేవుడేమనుకొంటున్నాడన్నది చాలా ముఖ్యమైన అంశం. లవొదికయలో నున్న చర్చికి పరిశుద్ధాత్మ దేవుడు రాసిన లేఖ ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేవుని సాన్నిధ్యానికి, దేవుని ప్రసన్నతకు, పవిత్రతకు, ముఖ్యంగా దేవుని ప్రేమకు నిలయంగా దేవుడే నిర్దేశించిన స్థలం చర్చి. ఆదిమకాలంలో దేవుని ప్రేమను యేసుక్రీస్తులో సంపూర్ణంగా చవిచూసిన ఆదిమ అపొస్తలులు, విశ్వాసులు ఆ ప్రేమనే లోకానికి ఆచరణలో చాటడానికి, ఆయన సాన్నిధ్యంలోని అనిర్వచనీయమైన ఆనందాన్ని లోకానికి రుచిచూపించేందుకు భూదిగంతాలకు వెళ్లి అనేక ప్రాంతాల్లో స్థాపించినవే ఆ చర్చిశాఖలు. అందువల్ల చర్చి దేవుని నివాసస్థలం, ఆశ్రితులు, నిరాశ్రయులు, నిరుపేదలు, సమాజంలోని బలహీనులు అక్కడి విశ్వాసుల సహవాసంలో వారి ఆదరణను, సహాయాన్ని, అనునయాన్ని పుష్కలంగా పొంది దేవుని ప్రేమను అనుభవించే పరలోకానందానికి సాదృశ్యస్థలం.
అందుకే దేవుడు లవొదికయలోని చర్చికి రాసిన లేఖలో తన బాధనంతా వ్యక్తం చేశాడు. ఒక కుమారుడు తన తల్లిదండ్రుల ప్రాపకంలో పెరిగి పెద్దవాడై, ఉన్నతవిద్యలనభ్యసించి, ఒక గొప్పసంస్థను స్థాపించి, సమాజంలో అత్యున్నతస్థానాన్ని, పేరుప్రఖ్యాతులను సంపాదించి, తన ఔన్నత్యానికి కారకులైన తల్లిదండ్రులనే చివరికి మర్చిపోతే అదెంత విషాదకరం? లవొదికయ చర్చిలో సరిగ్గా జరిగిందదే.‘నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువలేదు అని నీవనుకొంటున్నావు కాని ఎంతోకాలంగా నేను బయట నిలబడి నీ తలుపు తడుతున్నాను కాని నీవు తలుపు తీసి నన్ను లోపలికి ఆహ్వానించడం లేదు’ అని దేవుడు తన లేఖలో ఆహ్వానించడం లేదన్నది ఆ చర్చిపై దేవుడు చేస్తున్న అభియోగం(ప్రక 3:14–21).
మన భాషలో చెప్పాలంటే సెల్‌ఫోన్ అదేపనిగా మోగుతుంటే, ఎవరో అవతల మన తలుపు పదే పదే తడుతూ ఉంటే మనం స్పందించకుండా ఉండగలమా? కాని ఆ స్పందనే కరువైన చర్చి లవొదికయలోని చర్చి!! అందువల్ల ఒక కార్పొరేట్ సంస్థ స్థాయికి ‘నీవు ఎదిగినా, నీకు ఎంత ధనమున్నా నీవు దిక్కుమాలినవాడవు, దరిద్రుడవే. ఎంతో సింగారంగా దుస్తులు ధరించుకున్నా పవిత్రత లేని దిగంబరివే. నీకు లోకమంతా ఎరిగిన జ్ఞానమున్నా నీది దైవత్వాన్ని ఎరుగని అంధత్వమే !!’ అని వాపోతున్నాడు దేవుడు. లోకాన్నంతా లోపలి తెచ్చుకొని అన్నింటికీ కారకుడైన దేవుణ్ణి మాత్రం తలుపు అవతల పెట్టిన ‘దేవుడే లేని చర్చి’ అది. అంతకన్నా మరో విషాదం ఉంటుందా?ఎన్ని ఉన్నా, అది దేవుడు లేని చర్చి అయినా, కుటుంబమైనా, విశ్వాసి అయినా వాళ్ళు ఏమీ లేనివారికిందే లెఖ్ఖ!! మహాగోపురాలు, విశాలమైన ఆవరణలు, పాలరాతి తాపడాలు, వెండి బంగారంతో చేసే అలంకరణలు చర్చికి సౌందర్యాన్నివ్వవు.
దేవుని సాన్నిధ్యం, ఆయన పవిత్రత, ప్రేమ విలసిల్లే స్థలంగా విశ్వాసం జీవితం, విశ్వాసి కుటుంబం, చర్చి ఉండాలని ప్రభువు కోరుకొంటున్నాడు. చర్చిని చందాలతో కాదు, విశ్వాసుల సాక్ష్యంతో, వారి ప్రేమపూర్వకమైన పరిచర్య, క్రియలు, త్యాగంతో నిర్మించాలి. అలాంటి చర్చి యేసుక్రీస్తు పునరాగమనానికి లోకాన్ని సిద్ధం చేస్తుంది. చర్చిని ఆదిమ అపొస్తలులు స్థాపించడంలో ఉద్దేశ్యం కూడా అదే!! యేసుక్రీస్తు ప్రేమను, త్యాగాన్ని, కృపను చర్చి తన పరిచర్య ద్వారా లోకానికి పరిచయం చేసి ఆయన రెండవ రాకడకోసం లోకాన్ని సిద్ధం చేయాలన్నదే చర్చి ముఖ్య లక్ష్యం.
రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment