దేవుని భయమూ ఉండాలి! | story about jesus christ | Sakshi
Sakshi News home page

దేవుని భయమూ ఉండాలి!

Published Sat, May 28 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM

దేవుని భయమూ ఉండాలి!

దేవుని భయమూ ఉండాలి!

పాస్టర్‌గారు చర్చిలో ప్రసంగం చేస్తున్నారు. చర్చి బయట గుమ్మానికి ఒకవైపు యేసుక్రీస్తు బొమ్మలు, మరోవైపు సాతాను బొమ్మలు పెట్టి ఆ రెండింటిలో ఒకటి పట్టుకొమ్మంటే మీరు దేన్ని తీసుకుంటారు? అని ఆయన ప్రశ్నించారు. యేసుప్రభువు బొమ్మ.. కావాలన్నారంతా! ‘ఒకవేళ యేసుక్రీస్తుది చెక్కబొమ్మ, సాతానుది బంగారం బొమ్మ అయితే దేన్ని తీసుకుంటారు?’ అని అడిగారాయన. చర్చిలో అంతా నిశ్శబ్దం. జవాబు అర్థమైంది.

దేవుని ప్రేమను, గొప్పదనాన్ని విశ్వాసి జీవనశైలి ద్వారానే లోకం స్పష్టంగా తెలుసుకుంటుంది. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతప్రాయం  అంటుంది బైబిలు (యాకోబు2:17).

 ధనప్రలోభంతో విశ్వాస భ్రష్టులైన ఆదిమ కాలపు భార్యాభర్తలు అననీయ, సప్పీర. యేసు ఉంటే చాలనుకున్న నాటి చాలామంది విశ్వాసులు తమ ఆస్తులమ్మి ఆ డబ్బంతా తెచ్చి అపొస్తలుల పాదాల వద్ద పెడుతున్న రోజులవి. అననీయ, సప్పీర కూడా తమ పొలం అమ్మారు. కాని దాంట్లో కొంత దాచుకొని మిగిలిన మొత్తం తెచ్చిచ్చారు. పొలాన్ని మీరింతటే అమ్మారా అని పేతురు ప్రశ్నిస్తే అంతకే అమ్మామంటూ ఇద్దరూ కూడబలుక్కొని మరీ అబద్ధమాడారు. అంతే! దేవుని ఉగ్రతకు లోనయ్యారు. దేవుడంటే భక్తి మాత్రమే కాదు. దేవుని భయమూ ఉండాలి. దేవుని కోసం వారు పొలం అమ్మి తమ భక్తిని చాటుకున్నారు.

కాని అందులో కొంత దొంగిలించి తమది దేవుని భయం కరువైన దొంగభక్తి అని రుజువు చేసుకున్నారు. అర్పణలు, ఆరాధనలు, పాటలు, ప్రార్థనలు, ప్రసంగాలు, సాక్ష్యాలు ఇవన్నీ భక్తితో ముడిపడిన అంశాలు. అయితే జీవితంలో యథార్థత, సచ్ఛీలత దేవుని భయంతో ముడిపడిన అంశాలు. కుటుంబావసరాల కోసం పొలం అమ్మి ఉంటే అందులో దేవునికి మేమేమీ ఇవ్వలేమని తెలిసి ఉంటే అసలు సమస్యే లేదు. కాని ఆదిమ సంఘంలో దేవునికి ధారాళంగా ఇస్తున్న చాలామంది కంటే ఆత్మీయంగా తాము తక్కువేమీ కాదని గొప్పలు చెప్పుకునేందుకు పొలం అమ్మగా వచ్చిన డబ్బంతా ఇస్తున్నామని అబద్ధం చెప్పారు.

కాని ‘ఆత్మీయత’ను  నటించబోయి, తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు వారు. దేవునికి ఎంతో హేయమైననది వేషధారణ! కరడుకట్టిన పాపుల పట్ల కూడా యేసుక్రీస్తు కరుణ చూపించాడు. కాని పరిసయ్యల వంటి వేషధారులను సున్నం కొట్టిన సమాధుల్లారా! అంటూ ఎంతో పరుషమైన పదజాలంతో సంబోధించాడు. అననీయ, సప్పీరా లేని ఆత్మీయతను చూపించుకునే గొప్పలకు పోయి చరిత్రహీనులయ్యారు.

 సమాజంలోని అన్ని రంగాల్లోనూ పదార్థవాదం (మెటీరియలిజం) ప్రబలి డబ్బే కేంద్రంగా సాగుతున్న ‘అధర్మయుగం’లో మనం జీవిస్తున్నాం. దేవుడు మనను చూడడులే అనుకున్నారు వారిద్దరూ. దేవుడు చూడటమే కాదు అక్కడికక్కడ తక్షణ తీర్పునిచ్చి తన ఉగ్రతను బయలుపర్చాడు! ధనంతో నిమిత్తం లేని నిష్కల్మషమైన దేవుని ప్రేమ బీద, గొప్ప తేడా లేకుండా అందరినీ తన వద్దకు ఆకర్షిస్తుంది. ఇది తిరుగులేని వాస్తవం. దేవుని పట్ల యథార్థత కలిగిన విశ్వాసులు, కుటుంబాలు, చర్చిలు ధనాపేక్షకు, ప్రలోభాలకు అతీతంగా ఉంటారు.
- రెవ.టి.ఎ.ప్రభుకిరణ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement