Satan
-
తాననుకున్నట్లుంటేనే దేవుడైనా..
నిజాన్ని తెలుసుకోవడం కోసం ఒకడు ఓ జ్ఞాని దగ్గరకు బయలుదేరాడు. అయితే అతనిని ఆ మార్గమధ్యంలో సైతాన్ అడ్డుపడి బయటకు పంపించెయ్యాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆ సైతాన్ అనేక అడ్డంకులు కలిగించాడు. రకరకాల కుట్రలు పన్నాడు.మొదటగా ఓ అందమైన అమ్మాయిని అతని ఎదుట ప్రత్యక్షమయ్యేలా చేసాడు సైతాన్. ఆ అమ్మాయి అతనితో వగలు పోతూ తీయగా మాట్లాడింది. తన వెంట రమ్మంది. అయితే కాసేపటికి అతను ఈలోకంలో కొచ్చాడు. తాను దారి తప్పుతున్నట్లు గ్రహించాడు. దాంతో ఆ అమ్మాయిని విడిచిపెట్టి ముందుకు అడుగులేశాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఓ రాజు తారసపడ్డాడు. అతనిని ఆపి తన ఆస్థానానికి రావలసిందిగా ఒత్తిడి చేశాడు. ఇది కూడా సైతాన్ పనే అనుకుని అతను రాజు వెంట వెళ్ళకుండా ముందుకు సాగాడు. ఇలా అన్ని అడ్డంకులు అధిగమించి అతను చిట్టచివరికి జ్ఞాని వద్దకు చేరాడు. ఇక లాభం లేదనుకుని చీకట్లో ఓ మూల దాక్కున్నాడు సైతాన్. జ్ఞాని ఓ వేదికపై కూర్చుని ఉండగా నేల మీద శిష్యులందరూ కూర్చున్నారు. తాను ఊహించుకున్న స్థితిలో అక్కడి వాతావరణం లేకపోవడం, జ్ఞాని అతనిని పట్టించుకోనట్టు వ్యవహరించడం, అక్కడున్న ఆయన శిష్యులు కూడా తనని లెక్కచేయకపోవడంతో అతను నిరాశ చెందాడు. దానికితోడు జ్ఞాని మాటలు ఏ మాత్రం గొప్పగా అనిపించలేదు. చాలా మామూలుగా ఉన్నాయి. ఈ జ్ఞాని వద్దకు తాను అనవసరంగా వచ్చానని అనుకున్నాడు. ఆయన వేషధారణ కూడా అతనికి నచ్చలేదు. మరి ఎలాగీయనను అందరూ జ్ఞానిగా భావిస్తున్నారు అని అతను తనలో ప్రశ్నించుకున్నాడు. ఇక్కడున్న శిష్యులే కాదు, ఇరుగుపొరుగు కూడా మూర్ఖులే అని అనుకున్నాడు. అతను అక్కడి నుంచి మౌనంగా బయటకు వచ్చాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత గురువు ఓ మూల తదేకంగా చూసారు.‘‘నువ్వు ఇంతగా శ్రమపడాల్సి ఉండక్కర్లేదు. అతను మొదటి నుంచీ నీ మనిషే’’ అని జ్ఞాని నవ్వుతూ సైతాన్‌తో.సత్యాన్వేషకులే కాదు, భగవంతుడి కోసం అన్వేషించేవారు కూడా ఆ దేవుడికున్న కీర్తిప్రతిష్టలు, తనలోని ఆశలు, తనలో చిత్రించుకున్న రూపాలు ఇలా అన్నింటినీ పట్టించుకుని తామనుకున్నట్లు ఉంటేనే దేవుడినైనాసరే ఆరాధించడానికి ముందుకొస్తారు. లేదంటే సాక్షాత్తు ఆ దేవుడే అతని ముందు ప్రత్యక్షమైనా సరే లెక్కచేయరని చెప్పడానికి ఈ కథ ఓ ఉదాహరణ. – యామిజాల జగదీశ్ -
స్నేహితుల రక్తం తాగేందుకు విద్యార్థినుల కుట్ర!
తలాహస్సీ : అమెరికా పాఠశాలలో అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. తోటి విద్యార్థులను చంపి వారి రక్తం తాగడంతో పాటు మాంసాన్ని తినేందుకు కుట్ర పన్నిన ఇద్దరు స్కూలు విద్యార్థినులపై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ ఫ్లోరిడా పోలీసులు తెలిపారు. తాము సైతాన్ అనుచరులమని చెప్పుకొనే విద్యార్థినులు స్కూలు ఫంక్షన్ జరుగుతున్న సమయంలో తోటి విద్యార్థుల హత్యకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. వాష్‌రూంలోకి వెళ్లిన సుమారు 15 మంది బయటికి రాగానే వారిని చంపి, రక్తం తాగి, మాంసం తినాలని భావించారని బార్టో పోలీసు చీఫ్ జో హాల్ తెలిపారు. ఇందుకోసం పదునైన ఆయుధాన్ని కూడా వెంట తెచ్చుకున్నారని చెప్పారు. ఆ తర్వాత తమని తాము అంతం చేసుకోవాలని కూడా వారు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. స్కూళ్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరి కదలికలను గమనించిన యాజమాన్యం సదరు విద్యార్థినుల తల్లిదండ్రులతో పాటు, తమకు కూడా సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పిందని వ్యాఖ్యానించారు. -
దేవుని భయమూ ఉండాలి!
పాస్టర్గారు చర్చిలో ప్రసంగం చేస్తున్నారు. చర్చి బయట గుమ్మానికి ఒకవైపు యేసుక్రీస్తు బొమ్మలు, మరోవైపు సాతాను బొమ్మలు పెట్టి ఆ రెండింటిలో ఒకటి పట్టుకొమ్మంటే మీరు దేన్ని తీసుకుంటారు? అని ఆయన ప్రశ్నించారు. యేసుప్రభువు బొమ్మ.. కావాలన్నారంతా! ‘ఒకవేళ యేసుక్రీస్తుది చెక్కబొమ్మ, సాతానుది బంగారం బొమ్మ అయితే దేన్ని తీసుకుంటారు?’ అని అడిగారాయన. చర్చిలో అంతా నిశ్శబ్దం. జవాబు అర్థమైంది. దేవుని ప్రేమను, గొప్పదనాన్ని విశ్వాసి జీవనశైలి ద్వారానే లోకం స్పష్టంగా తెలుసుకుంటుంది. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతప్రాయం అంటుంది బైబిలు (యాకోబు2:17). ధనప్రలోభంతో విశ్వాస భ్రష్టులైన ఆదిమ కాలపు భార్యాభర్తలు అననీయ, సప్పీర. యేసు ఉంటే చాలనుకున్న నాటి చాలామంది విశ్వాసులు తమ ఆస్తులమ్మి ఆ డబ్బంతా తెచ్చి అపొస్తలుల పాదాల వద్ద పెడుతున్న రోజులవి. అననీయ, సప్పీర కూడా తమ పొలం అమ్మారు. కాని దాంట్లో కొంత దాచుకొని మిగిలిన మొత్తం తెచ్చిచ్చారు. పొలాన్ని మీరింతటే అమ్మారా అని పేతురు ప్రశ్నిస్తే అంతకే అమ్మామంటూ ఇద్దరూ కూడబలుక్కొని మరీ అబద్ధమాడారు. అంతే! దేవుని ఉగ్రతకు లోనయ్యారు. దేవుడంటే భక్తి మాత్రమే కాదు. దేవుని భయమూ ఉండాలి. దేవుని కోసం వారు పొలం అమ్మి తమ భక్తిని చాటుకున్నారు. కాని అందులో కొంత దొంగిలించి తమది దేవుని భయం కరువైన దొంగభక్తి అని రుజువు చేసుకున్నారు. అర్పణలు, ఆరాధనలు, పాటలు, ప్రార్థనలు, ప్రసంగాలు, సాక్ష్యాలు ఇవన్నీ భక్తితో ముడిపడిన అంశాలు. అయితే జీవితంలో యథార్థత, సచ్ఛీలత దేవుని భయంతో ముడిపడిన అంశాలు. కుటుంబావసరాల కోసం పొలం అమ్మి ఉంటే అందులో దేవునికి మేమేమీ ఇవ్వలేమని తెలిసి ఉంటే అసలు సమస్యే లేదు. కాని ఆదిమ సంఘంలో దేవునికి ధారాళంగా ఇస్తున్న చాలామంది కంటే ఆత్మీయంగా తాము తక్కువేమీ కాదని గొప్పలు చెప్పుకునేందుకు పొలం అమ్మగా వచ్చిన డబ్బంతా ఇస్తున్నామని అబద్ధం చెప్పారు. కాని ‘ఆత్మీయత’ను నటించబోయి, తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు వారు. దేవునికి ఎంతో హేయమైననది వేషధారణ! కరడుకట్టిన పాపుల పట్ల కూడా యేసుక్రీస్తు కరుణ చూపించాడు. కాని పరిసయ్యల వంటి వేషధారులను సున్నం కొట్టిన సమాధుల్లారా! అంటూ ఎంతో పరుషమైన పదజాలంతో సంబోధించాడు. అననీయ, సప్పీరా లేని ఆత్మీయతను చూపించుకునే గొప్పలకు పోయి చరిత్రహీనులయ్యారు. సమాజంలోని అన్ని రంగాల్లోనూ పదార్థవాదం (మెటీరియలిజం) ప్రబలి డబ్బే కేంద్రంగా సాగుతున్న ‘అధర్మయుగం’లో మనం జీవిస్తున్నాం. దేవుడు మనను చూడడులే అనుకున్నారు వారిద్దరూ. దేవుడు చూడటమే కాదు అక్కడికక్కడ తక్షణ తీర్పునిచ్చి తన ఉగ్రతను బయలుపర్చాడు! ధనంతో నిమిత్తం లేని నిష్కల్మషమైన దేవుని ప్రేమ బీద, గొప్ప తేడా లేకుండా అందరినీ తన వద్దకు ఆకర్షిస్తుంది. ఇది తిరుగులేని వాస్తవం. దేవుని పట్ల యథార్థత కలిగిన విశ్వాసులు, కుటుంబాలు, చర్చిలు ధనాపేక్షకు, ప్రలోభాలకు అతీతంగా ఉంటారు. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్