తాననుకున్నట్లుంటేనే దేవుడైనా.. | One does not go to a wise person to find out the truth | Sakshi
Sakshi News home page

తాననుకున్నట్లుంటేనే దేవుడైనా..

Published Tue, Apr 23 2019 12:09 AM | Last Updated on Tue, Apr 23 2019 12:09 AM

One does not go to a wise person to find out the truth - Sakshi

నిజాన్ని తెలుసుకోవడం కోసం ఒకడు ఓ జ్ఞాని దగ్గరకు బయలుదేరాడు. అయితే అతనిని ఆ మార్గమధ్యంలో సైతాన్‌ అడ్డుపడి బయటకు పంపించెయ్యాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆ సైతాన్‌ అనేక అడ్డంకులు కలిగించాడు. రకరకాల కుట్రలు పన్నాడు.మొదటగా ఓ అందమైన అమ్మాయిని అతని ఎదుట ప్రత్యక్షమయ్యేలా చేసాడు సైతాన్‌. ఆ అమ్మాయి అతనితో వగలు పోతూ తీయగా మాట్లాడింది. తన వెంట రమ్మంది. అయితే కాసేపటికి అతను ఈలోకంలో కొచ్చాడు. తాను దారి తప్పుతున్నట్లు గ్రహించాడు. దాంతో ఆ అమ్మాయిని విడిచిపెట్టి ముందుకు అడుగులేశాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఓ రాజు తారసపడ్డాడు. అతనిని ఆపి తన ఆస్థానానికి రావలసిందిగా ఒత్తిడి చేశాడు. ఇది కూడా సైతాన్‌ పనే అనుకుని అతను రాజు వెంట వెళ్ళకుండా ముందుకు సాగాడు. ఇలా అన్ని అడ్డంకులు అధిగమించి అతను చిట్టచివరికి జ్ఞాని వద్దకు చేరాడు. ఇక లాభం లేదనుకుని చీకట్లో ఓ మూల దాక్కున్నాడు సైతాన్‌.
     
జ్ఞాని ఓ వేదికపై కూర్చుని ఉండగా నేల మీద శిష్యులందరూ కూర్చున్నారు. తాను ఊహించుకున్న స్థితిలో అక్కడి వాతావరణం లేకపోవడం, జ్ఞాని అతనిని పట్టించుకోనట్టు వ్యవహరించడం, అక్కడున్న ఆయన శిష్యులు కూడా తనని లెక్కచేయకపోవడంతో అతను నిరాశ చెందాడు. దానికితోడు జ్ఞాని మాటలు ఏ మాత్రం గొప్పగా అనిపించలేదు. చాలా మామూలుగా ఉన్నాయి. ఈ జ్ఞాని వద్దకు తాను అనవసరంగా వచ్చానని అనుకున్నాడు. ఆయన వేషధారణ కూడా అతనికి నచ్చలేదు. మరి ఎలాగీయనను అందరూ జ్ఞానిగా భావిస్తున్నారు అని అతను తనలో ప్రశ్నించుకున్నాడు. ఇక్కడున్న శిష్యులే కాదు, ఇరుగుపొరుగు కూడా మూర్ఖులే అని అనుకున్నాడు. అతను అక్కడి నుంచి మౌనంగా బయటకు వచ్చాడు.

అతను వెళ్ళిపోయిన తర్వాత గురువు ఓ మూల తదేకంగా చూసారు.‘‘నువ్వు ఇంతగా శ్రమపడాల్సి ఉండక్కర్లేదు. అతను మొదటి నుంచీ నీ మనిషే’’ అని జ్ఞాని నవ్వుతూ సైతాన్‌తో.సత్యాన్వేషకులే కాదు, భగవంతుడి కోసం అన్వేషించేవారు కూడా ఆ దేవుడికున్న కీర్తిప్రతిష్టలు, తనలోని ఆశలు, తనలో చిత్రించుకున్న రూపాలు ఇలా అన్నింటినీ పట్టించుకుని తామనుకున్నట్లు ఉంటేనే దేవుడినైనాసరే ఆరాధించడానికి ముందుకొస్తారు. లేదంటే సాక్షాత్తు ఆ దేవుడే అతని ముందు ప్రత్యక్షమైనా సరే లెక్కచేయరని చెప్పడానికి ఈ కథ ఓ ఉదాహరణ.
– యామిజాల జగదీశ్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement