క్రీస్తు పుట్టిన స్థలాన్ని సూచించే పశువుల పాక
క్రైస్తవులు తమ దేవుడైన యేసుక్రీస్తు పుట్టినరోజును స్మరించుకుంటూ జరుపుకునే క్రిస్మస్ వారికి ఎంతో ముఖ్యమైన పండుగ. డిసెంబర్ ప్రారంభమవగానే చర్చ్‌లు, ఇళ్లు, పలు దుకాణాలు క్రిస్మస్ హడావిడితో నిండిపోతాయి. శాంటా క్లాస్ (క్రిస్మస్ తాత) దుస్తులతో, విద్యుద్దీపాలతో అలంకరించిన క్రిస్మస్ చెట్లు, వీధివీధికి రకరకాల రంగులతో నిలిచే క్రిస్మస్ స్టార్‌లతో (నక్షత్రాలతో), యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశానికి గుర్తుగా తయారు చేసే పశువుల పాక వంటి వాటితో నెలంతా సందడి నెలకొంటుంది. బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా, ప్రత్యేక బహుమతులను అందించి క్రిస్మస్ ఆనందాన్ని పంచుకుంటారు. చాలాసార్లు ఒకే చోట క్రిస్మస్ పండుగ జరుపుకొని కొత్తదనం కొరవడితే ఇండియాలోని కింది ప్రాంతాలు మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి.
1. గోవా
అత్యధికంగా కతోలిక క్రైస్తవులు నివసిస్తున్న ప్రాంతం కావడంతో డిసెంబర్ మొదటి వారంలో వచ్చే ఆడ్వెంట్ నుంచే ఇక్కడ సంబరాలు మొదలవుతాయి. పట్టణమంతా క్రిస్మస్ పూలతో (పోయిన్‌సెట్టియా), రంగురంగుల విద్యుద్దీపాలతో, అలంకరిస్తారు. చర్చ్‌లు అన్నింటి మీదా పెద్ద స్టార్‌లను అమరుస్తారు. బీచ్‌ల దగ్గర హోటళ్లు, రెస్టారెంట్లు క్రిస్మస్ గంటల మ్యూజిక్‌తో పాటు పలు రకాల క్రిస్మస్ వంటకాలను తయారుచేస్తారు. క్రిస్మస్ ముందు రోజు రాత్రంతా చర్చిలలో ప్రత్యేక ఆరాధనలు, ప్రార్థనలు నిర్వహిస్తారు.
2. కేరళ
చర్చ్‌లకు పుట్టినిల్లుగా పిలిచే కేరళలో క్రిస్మస్‌ను ఘనంగా నిర్వహిస్తారు. యేసుక్రీస్తు శిష్యులలో ఒకరైన సెయింట్ తోమాస్ రాక తర్వాత ఇక్కడ ఈ పండుగ జరపడం ప్రారంభమయిందని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రతి వీధిలో ప్రత్యేక దీపాలను వెలిగిస్తారు. తమ ఇళ్ల మీద కూడా స్టార్‌లను అమర్చి అందులో రంగులను చిమ్మే లైట్లను అమరుస్తారు. చర్చ్‌లలో కారోల్స్ నిర్వహిస్తారు. ప్రత్యేక ప్రార్థనలతో పాటు ప్రత్యేక గంటలను మోగిస్తారు. ప్లమ్ కేక్స్‌ను క్రిస్మస్ ప్రత్యేక వంటకంగా తయారు చేసుకుంటారు. పలు హోటళ్లలో ప్రత్యేక రాయితీలను అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తారు.
3. మనాలి
మంచు కురిసే ప్రదేశంలో క్రిస్మస్ (వైట్ క్రిస్మస్) జరుపుకోవాలన్నది మీ కోరికా..! అయితే మనాలి బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతం తెల్లని మంచుతో పండుగను వేరే దేశంలో జరుపుకున్న అనుభూతిని అందిస్తుంది. ఇక్కడకు క్రిస్మస్‌కు వచ్చేవారు తమ మిత్రులు, కుటుంబ సభ్యుల మీద మంచు ముద్దలు విసురుకొని ఆనందిస్తుంటారు. పండుగ అర్ధరాత్రి జరిగే ప్రార్థనల్లో పాల్గొనడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. చలికాలంలో మనాలికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ క్రిస్మస్‌ను జరుపుకోవాలి అనుకునే వారు ముందుగానే హోటళ్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
4. పుదుచ్చేరి
గోవాలాగే పుదుచ్చేరి కూడా క్రైస్తవులు అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో పట్టణంతా డిసెంబర్ ప్రారంభం నుంచే క్రిస్మస్ సందడి అలుముకుంటుంది. ఈ ప్రాంతం మీద ఫ్రెంచ్‌వారి ప్రభావం ఎక్కువగా ఉండడంతో సహజంగానే వారి ఆచారాలు, వంటకాలు కొన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇతర ప్రదేశాలతో పోలిస్తే పుదుచ్చేరిలో క్రిస్మస్ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న యేసు తిరుహృదయ బసిలికా దేవాలయంలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతాయి.
5. షిల్లాంగ్
ఎక్కువ తాకిడి లేకుండా ప్రశాంతంగా క్రిస్మస్ జరుపుకోవానుకుంటే షిల్లాంగ్ అనువైన ప్రదేశం. ఇక్కడ క్రైస్తవులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ పండుగను మాత్రం ఉత్సుకతతో కొనియాడుతారు. వీధులను, చర్చ్‌లను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. ప్రత్యేక పాటలను ఆలపిస్తూ ప్రార్థనలను చేస్తారు.
6. కొచ్చి
గోవా, పుదుచ్చేరిలాగే కొచ్చిలో కూడా ఎక్కువ సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారు. చారిత్రాత్మకమైన చర్చ్‌లు ఉన్నప్రాంతం కావడంతో క్రిస్మస్‌ను ఇక్కడ ఘనంగా కొనియాడుతారు. అన్ని ప్రాంతాల్లోలాగే ఇక్కడ కూడా చర్చ్‌లను, ఇళ్లను, వీధులను విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. పండుగ ముందురోజు రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు హోరెత్తుతాయి. వీధుల్లోని దుకాణాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన యేసుక్రీస్తు, ఆయన తల్లి మరియమ్మ చెక్క స్వరూపాలను అమ్ముతారు. క్రిస్మస్‌తో పాటు స్థానికంగా జరిగే పండుగ తోడవడంతో షాపింగ్ మాల్స్ అన్నీ ప్రత్యేక రాయితీలు కల్సిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తాయి. కుటుంబంతో కలిసి వెళ్తే షాపింగ్‌కు, ఆటపాటలతో ఆనందంగా గడపడానికి ఇది ఉత్తమ ప్రదేశం.
Comments
Please login to add a commentAdd a comment