క్రిస్మస్ కాంతులు సమీపించాయి. బెంగళూరులో 100 అడుగుల నిటారుగా ఇండియాలోనే ఎత్తయిన క్రిస్మస్ ట్రీ వెలిసింది. క్రిస్మస్ వచ్చిందంటే ఇంటింటా స్త్రీలు, పిల్లలు క్రిస్మస్ ట్రీని అలంకరించేందుకు ఉత్సాహపడతారు. క్రిస్మస్ ట్రీని అనేక థీమ్‌లతోఅలంకరించవచ్చు. క్రిస్మస్ ట్రీ కథనూ ఈ సారి అనువైన థీమ్‌లను తెలుసుకుందాం.
క్రిస్మస్ అంటే ప్రపంచమంతా నక్షత్రాలు పూసే వేళ. కేకులు సువాసనలు వెదజల్లే వేళ. కానుకలు రిబ్బన్ ముక్కల్లో అందంగా ప్యాక్ అయ్యే వేళ, శాంటా కోసం పిల్లలు ఎదురు చూసే వేళ, ప్రతి ఇంట్లో క్రిస్మస్ చెట్టు చిగురించే వేళ.
ఏసుక్రీస్తు జన్మదినాన జగతి అంతా రంగులను హత్తుకుంటుంది. కురిసే మంచును కేరింతలతో కోస్తుంది. చర్చ్ గంటలు గణగణమోగుతాయి. స్తోత్రగీతాలు హోరెత్తుతాయి. కొవ్వొత్తులు రెపరెపలాడతాయి. ప్రేమ, త్యాగం, కరుణ... మనిషిని కాపాడేవి ఇవే కదా. ఇలాంటి పర్వదినంలో అలంకరణ ఎలా మిస్ అవుతాము?
క్రిస్మస్ ట్రీ
క్రిస్మస్ వేళ ప్రతి ఇంటిపై క్రిస్మస్ స్టార్ వెలుగుతుంది. అలాగే క్రిస్మస్ చెట్టు కూడా కొలువుదీరుతుంది. జన సంస్కృతి నుంచి మెల్లగా పండుగలోకి వచ్చిన చిహ్నం ఇది. శీతల దేశాలలో శీతాకాలం కడు దుర్భరంగా ఉంటుంది. జీవేచ్ఛ అడుగంటుతుంది. అందుకని అప్పటి ప్రజలు పచ్చటి పైన్ లేదా ఫర్ చెట్టు కొమ్మలను తెచ్చి ఇంటి బయట వాటిని అలంకరించేవారు. ఇది పాజిటివ్ వైబ్రేషన్స్‌ను తెస్తుందని భావించేవారు.
క్రీస్తు జన్మదినం కూడా శీతాకాలంలో వస్తుంది కాబట్టి ఈ అలంకరణ మెల్లగా ఒక దేశం నుంచి మరో దేశానికి పాకి క్రిస్మస్‌తో జత కలిసింది. క్రిస్మస్ ట్రీని సతత హరిత జీవనానికీ, జీవితేచ్ఛకూ చిహ్నంగా భావిస్తారు. పచ్చగా వర్థిల్లమనే కామన క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ పండగనాడు ఒక చర్చిలో ఏసు ప్రభువు విగ్రహం ఎదుట అందరూ ఖరీదైన కానుకలు పెడుతుంటే ఒక పేద బాలుడు ఒక పచ్చటి మొక్కను పెట్టాడట. ఆ మొక్క వెంటనే బంగారు కాంతులీనిందట. అప్పటి నుంచి నిరాడంబరమైన ఆరాధనకు గుర్తుగా క్రిస్మస్ ట్రీ వచ్చిందని ఒక కథ.
ముఖ్యమైన రంగులు నాలుగు
క్రిస్మస్ ట్రీ అలంకరణలో నాలుగు రంగులు కనపడతాయి. తెలుపు రంగు– ఇది స్వచ్ఛతకు గుర్తు. కురిసే మంచుకు కూడా. అందుకే క్రిస్మస్ ట్రీలో పత్తిని తెల్లదనానికి ఉపయోగిస్తారు. ఎరుపు రంగు– ఇది క్రీస్తు రక్తానికి, త్యాగానికి చిహ్నం. శాంటా కూడా ఈ రంగు దుస్తులనే ధరిస్తాడు. ఆకుపచ్చ రంగు– ఇది క్రీస్తు సజీవతను గుర్తు చేస్తుంది.
బంగారు రంగు– ఇది సంపదకు, మానవాళికి బహుమతిగా దక్కిన ఏసు మార్గానికి గుర్తు. ఒకప్పుడు ఫర్, పైన్ చెట్ల కొమ్మలను తెచ్చే క్రిస్మస్ ట్రీని తయారు చేసేవారు. ఆ తర్వాత చైనా నుంచి కృత్రిమ చెట్లు వచ్చాయి. కేవలం క్రిస్మస్ ట్రీల కోసమే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలలో 25 రకాల పైన్, ఫర్ చెట్లను సాగు చేస్తున్నారు. ఇవి ఆరడుగుల ఎత్తు పెరగడానికి ఎనిమిది నుంచి పన్నెండేళ్లు పడతాయి.
ఎన్నో థీమ్‌లు
సంప్రదాయ క్రిస్మస్ చెట్టును అలంకరించడంలో కొత్తదనం కోసం రకరకాల థీమ్‌లు కూడా వచ్చాయి. మన వీలును బట్టి ఆ థీమ్‌ను ఎంచుకోవచ్చు. ఇంటికి వచ్చిన వారిని ఆశ్చర్యపరచవచ్చు.
► అండర్ ద సీ: అంటే గవ్వలు, జలకన్యలో, సొరచేపలు, తాబేళ్లు... ఇలాంటి రకరకాల బొమ్మలతో అలంకరించవచ్చు
► రెయిన్ బో: అంటే ఇంద్రధనుస్సులోని ఏడు రంగులు ఒక్కో దొంతరగా కిందనుంచి పై వరకూ వచ్చేలా ఆయా రంగు కాగితాలను, రిబ్బన్‌లను, లేదా క్రిస్మస్ బాల్స్ లేదా బెల్స్‌ను కట్టొచ్చు
► ట్రావెల్: విహారం థీమ్‌తో మీనియేచర్ బ్యాగులు, వాహనాలు, ఏరోప్లేన్‌లు, టికెట్లు, మైలు రాళ్ల బొమ్మలు.. ఇవి ఉపయోగించాలి
► జలపాతం: క్రిస్మస్ ట్రీ నుంచి జలపాతాలు జారుతున్నట్టు బ్లూ రిబ్బను పాయలు పాయలుగా వేలాడగట్టాలి ఏ బెలూన్: ఇది ఈజీ థీమ్. కొమ్మ కొమ్మకు మంచి మంచి బెలూన్లు రకరకాల సైజులవి కట్టడమే.
► చాక్లెట్లు: పిల్లలను ఆకర్షించేలా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయాలంటే క్యాండీలు, చాకెట్లు, పిప్పరమెంట్లు, జెమ్స్ ప్యాకెట్లు... కొమ్మ కొమ్మలో దూర్చడమే.
► ఎర్ర పూలు: మన దగ్గర దొరికే ఎర్రరంగు పూలు గులాబీలు కావచ్చు, చామంతులు కావచ్చు, మందారాలు కావచ్చు... వీటితో క్రిస్మస్ ట్రీని అలంకరిస్తే ఆ లుక్కే వేరు.
ఇవి కొన్ని సూచనలు. వీటిని అందుకొని మీ సొంత థీమ్‌తో ఈ క్రిస్మస్‌ను కళకళలాడించండి. హ్యాపీ క్రిస్మస్.
Comments
Please login to add a commentAdd a comment