కర్ణాటక ప్రభుత్వం భక్తులకు నాణ్యమైన 'ప్రసాదం' అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. గణేష్ మండపాల వద్ద 'ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ-ధృవీకరించిన ప్రసాదాలను మాత్రమే పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆగస్టు 31న ఆదేశాలు జారీ చేసింది. దీంతో సరికొత్త దుమారం రేగింది. కర్నాటక ప్రభుత్వ నిర్ణయం హిందూ వ్యతిరేక నిర్ణయమని బీజేపీ అభివర్ణించింది. అయితే, గణేష్ చతుర్థి పండుగ సీజన్‌లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
గణేష ఉత్సవ నిర్వాహకులకు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫికేట్ పొందిన వారిని మాత్రమే గణేష్ పందిళ్లలో ప్రసాదం తయారు చేయడానికి అనుమతిస్తారు. పందిళ్లలోఅందించే ప్రసాదానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ధృవీకరణ తప్పనిసరి అని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP)కి రాసిన లేఖలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. అంతేకాదు అనుమతి లేకుండా ప్రసాదం పంపిణీ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ హెచ్చరించింది.
అనుమతులు తప్పనిసరి
బెంగళూరులోని గణేశ మంటప నిర్వాహకులు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ధృవీకరణతో పాటు, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు పోలీసు, నగర పాలక సంస్థ, విద్యుత్ లాంటి స్థానిక అధికారుల అనుమతులను పొందాలి. నిర్వాహకులు పాండల్స్ కోసం కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన నిర్దిష్ట పర్యావరణ నిబంధనలను కూడా పాటించాలి. తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు, అగ్నిమాపక యంత్రాలు, అత్యవసర భద్రతా చర్యల్లో భాగంగా వేదిక వద్ద అత్యవసర సంప్రదింపు నంబర్‌లను ప్రదర్శించాలి.
మరోవైపుగణేష్ చతుర్థి ఉత్సవాలకు అనుమతిస్తూ కర్నాటక హైకోర్టు, అధికారుల నిర్ణయాన్ని సమర్థించడంతో బుధవారం హుబ్బళ్లి-ధార్వాడ్‌లోని ఈద్గా మైదాన్‌లో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment