ఆస్పత్రిలో రోదిస్తున్న మృతురాలు సరస్వతమ్మ బంధువులు
కర్ణాటక, కోలారు: చింతామణిలోని ప్రసిద్ద గంగమ్మ దేవాలయంలో ప్రసాదం సేవించి అస్వస్థులై నగరంలోని ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో సరస్వతమ్మ (56) అనే మహిళ శనివారం అర్థరాత్రి సమయంలో చికిత్స ఫలించక మరణించింది. ఈ ఘటనలో మరణించిన ఇద్దరు మృతదేహాల పోస్టుమార్టం అనంతరం బిల్లులు చెల్లించి మృతదేహాలను తీసుకోవాలని ఆస్పత్రి వర్గాలు తెలియజేయడంతో సంబంధీకులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తాము చాలా పేదలమని డబ్బులు చెల్లించే స్థితిలో లేమని మొర పెట్టుకున్నారు. అస్వస్థులకు ఇక్కడే చికిత్స చేయడం వల్ల బిల్లులు చెల్లించాలని పట్టుపట్టారు. దీంతో వారు చింతామణి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకు వచ్చారు. డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డి వెంటనే కోలారు డిహెచ్‌ఓకు ఫోన్ చేసి పేదల వద్దనుంచి డబ్బులు అడగడం సమంజసంగా లేదని డబ్బులు చెల్లించాల్సి వస్తే ప్రభుత్వం నుంచి డబ్బులు అందేలా చూస్తామని తెలపడంతో డిహెచ్‌ఓ డాక్టర్ విజయకుమార్ వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఆస్పత్రి సూపరింటెండ్ డాక్టర్ లక్ష్మయ్యతో చర్చించారు. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో శవాలను సంబంధీకులకు అందించారు. ప్రభుత్వ అంబులెన్స్‌లో ఊరికి తరలించారు.
ఆరోగ్య శాఖ డైరెక్టర్, కలెక్టర్ పరిశీలన
ఆస్పత్రిలో అస్వస్థులై చికిత్స పొందుతున్న వారిని ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్, కలెక్టర్ జె మంజునాథ్‌లు వెళ్లి పరిశీలన జరిపారు. చికిత్స ఏ విధంగా జరుగుతుందో అని అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 5 మంది ఆరోగ్యంగా ఉన్నారని ఒకరికి మూత్రపిండాలకు ఇన్‌ఫెక్షన్ సోకిందని డాక్టర్‌లు తెలిపారు.
చింతామణి ఘటనపై సీఎం ఆరా
సాక్షి, బెంగళూరు: చింతామణి గంగమ్మ దేవస్థానంలో ప్రసాదం సేవించి ఇద్దరు మరణించిన ఘటన పై సీఎం కుమారస్వామి ఆరా తీశారు. చిక్కబళ్లాపుర జిల్లా కలెక్టర్ అనిరుధ్ శ్రవణ్ నుంచి వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి తగిన చికిత్స సహకారం అందించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment