భక్తులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. దేవాలయంలో పంపిణీ చేసిన ప్రసాదం తిని ఇద్దరు చిన్నారులతో సహా 12 మంది మృత్యువాత పడ్డారు. మరో 80 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చామరాజనగర్ జిల్లా హనూరు తాలూకా సుళివాడి గ్రామంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. గ్రామంలోని మారెమ్మ దేవాలయ గోపుర నిర్మాణానికి గురువారం శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు.
పూజాది కార్యక్రమాలు ముగిసిన అనంతరం ప్రసాదం కోసం సిద్ధం చేసిన రైస్‌బాత్‌తో అన్నదానం నిర్వహించారు. ఆ రైస్‌బాత్ తిన్న కొద్దిసేపటికి చాలామంది భక్తులు వాంతులు చేసుకుని స్పృహ తప్పారు. ఆస్పత్రిలో చేర్పించగా 12 మంది చికిత్సపొందుతూ చనిపోయారు. దేవుడి ప్రసాదం విషమయం కావడానికి దేవాలయ పాలక మండలిలో ఉన్న రెండు వర్గాల మధ్య విబేధాలే కారణమని తెలుస్తోంది. కార్యక్రమానికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో ఒక వర్గం వారు ప్రసాదంలో కిరోసిన్‌తో పాటు క్రిమిసంహారక మందులు కలిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ సీఎం రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment