సాక్షి, బెంగళూరు: గుడిలో పంచిపెట్టిన ప్రసాదం భక్తుల పాలిట యమపాశమైంది. కర్నాటక, చామరాజ్ నగర్ జిల్లాలోని సులివాడి గ్రామంలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా మారమ్మ దేవాలయం శంకుస్థాపన సందర్బంగా భక్తులకు పంపణీ చేసిన ప్రసాదం విషపూరితం కావడంతో దాన్ని స్వీకరించిన పదకొండు మంది భక్తులు మృత్యువాత పడ్డారు. దాదాపు 72మందికి పైగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో 12 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
ఈ ఘటనపై జిల్లా ఆరోగ్య అధికారి ప్రసాద్ అందించిన సమాచారం ప్రకారం ప్రసాదం తిన్నవెంటనే భక్తులు వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. వెంటనే స్పందించిన స్థానిక అధికారులు, పోలీసులు బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రసాదంలో విషం కలిసి వుంటుందనే అనుమానాలను ఆరోగ్య అధికారి వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో సేకరించిన ప్రసాదం శాంపిళ్లను పరీక్షల నిమిత్తం పంపించినట్టు తెలిపారు. అలాగే ప్రసాదంలో కిరోసిన్ కలిసిన వాసన వచ్చినట్టుగా బాధితులు చెప్పారన్నారు. చనిపోయినవారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు చెప్పారు.
తమకు పంచిపెట్టిన టమాటో రైస్ వాసన వచ్చిందని, అయితే క్యూలో ముందున్న వాళ్లు ప్రసాదం తిన్న వెంటనే వాంతులు చేసుకున్నారని, దీంతో కొంతమంది తినకుండా పారేయడంతో క్షేమంగా బయటపడ్డారని భక్తుడు మురుగప్ప తెలిపారు. అటు ప్రసాదంలో విషం కలిపారన్న ఆరోపణలపై పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. చనిపోయినవారికి 5లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే తక్షణమే సంబంధిత చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment