నిందితులు అంబిక, మాదేశ్ దంపతులు పూజారి దొడ్డయ్య , సూత్రధారి మహదేవస్వామి
ఈ నెల 14వ తేదీ చామరాజనగర జిల్లా సుళ్వాడిలో చిక్క మారమ్మ ఆలయం గోపురం శంకుస్థాపన కార్యక్రమంలో విష ప్రసాద మారణహోమం ఎవరి పనో పోలీసులు తేల్చేశారు. ఆలయ ట్రస్టు అధ్యక్షుడు ఇమ్మడి మహదేవస్వామి అలియాస్ రేవణ్ణ సూత్రధారిగా, అతని మేనకోడలు అంబిక, ఆమె భర్త, ఆలయ మేనేజర్ మాదేశ్, అర్చకుడు దొడ్డయ్య కలిసి భక్తుల ప్రాణాలు తీశారని గుర్తించారు. ఐదురోజుల ముమ్మర దర్యాప్తులతో వీరి బండారం బయటపడి కటకటాలు లెక్కిస్తున్నారు.
కర్ణాటక, మైసూరు: సుళ్వాడి గ్రామంలోని మారమ్మ దేవాలయంలో విషపూరిత ప్రసాదం తిని 15 మంది మృత్యువాత పడిన దుర్ఘటనకు కారణమెవరైందీ బుధవారం వెలుగు చూసింది. చామరాజనగరలో సౌత్‌జోన్ ఐజీ శరత్‌చంద్ర ఈ కేసు దర్యాప్తును మీడియా సమావేశంలో వివరించారు. ఆధిపత్య వివాదం మనసులో ఉంచుకుని మారమ్మ ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు ఇమ్మడి మహదేవస్వామి తన మనుషులతో కలసి ప్రసాదంలో మోనోక్రోటోఫాస్ అనే పురుగులమందు కలిపి ఈ ఘోరానికి పాల్పడినట్లు ఐజీ పేర్కొన్నారు.
వివరాలు.. ఈ ట్రస్టులో చిన్నప్పి అనే వ్యక్తి సభ్యునిగా కొనసాగుతున్నారు. ట్రస్ట్ ఆదాయ, నిర్వహణ తదితర అన్ని బాధ్యతలను చిన్నప్పి నిర్వర్తిస్తుండడంతోఅతని ఆధిపత్యం పెరుగుతూ వస్తోంది. ట్రస్ట్ సభ్యులు, సిబ్బంది కూడా చిన్నప్పికే ఎక్కువ విలువ ఇస్తుండడంతో అసూయ పెంచుకున్న అధ్యక్షుడు ఇమ్మడి మహదేవస్వామికి అతనితో విభేదాలు మొదలయ్యాయి.
గోపురం వేడుక వేదికగా
కొద్దిరోజుల క్రితం మారమ్మ ఆలయానికి రూ.1.50 కోట్లతో కొత్త గోపురాన్ని నిర్మించాలని మహదేవస్వామి నిర్ణయించగా దీన్ని వ్యతిరేకించిన చిన్నప్పి... రూ.80 లక్షల నిధులతో చిన్నగోపురం నిర్మిస్తే సరిపోతుదంటూ ప్రతిపాదించారు. దీనిపై ఇరువురి మధ్య వాగ్వాదం, వైషమ్యాలు తారాస్థాయికి చేరుకున్నాయి. చిన్నప్పి ఇదేనెల 14వ తేదీన సాలూరు మఠాధిపతి గురుస్వామిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి దేవాలయం గోపుర నిర్మాణానికి పూజలు పూజా కార్యక్రమాలు జరిపాడు. మహదేవస్వామి ఇది జీర్ణించుకోలేక చిన్నప్పితో పాటు అతనికి మద్దతుగా నిలిచిన ఇతర సభ్యులు, సిబ్బందిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. అందులో భాగంగా తన అక్క కుమార్తె అంబికా, ఆమె భర్త, దేవాలయ మేనేజర్ మాదేశ్, అర్చకుడు దొడ్డయ్యతో కలసి ప్రసాదంలో విషం కలపడానికి నిర్ణయించుకున్నాడు. వీరికి డబ్బు,పదవులు ప్రలోభపెట్టాడు.
అంబిక మొదట తన దూరపు బంధువైన వ్యవసాయశాఖ అధికారిని సంప్రదించి క్రిమిసంహార మందులు తెప్పించుకుంది. గోపుర నిర్మాణ పనుల పూజా కార్యక్రమాల రోజు వాటిని భర్త మాదేశ్‌కు అప్పగించింది. వాటిని వంటగదిలో తీసుకెళ్లిన మాదేశ్ అక్కడ వేచిఉన్న అర్చకుడు దొడ్డయ్య చేతికి అందించాడు. వంటగదిలో పని చేస్తున్న కార్మికులను బయటకు పంపించాడు. తరువాత ప్రసాదంలో కలిపి వచ్చేశాడు. కొద్దిసేపటి తరువాత ప్రసాదం నుంచి దుర్వాసన వస్తుండడంతో కార్మికులు అనుమానం వ్యక్తం చేయగా మసాలా ఎక్కువయి ఉంటుందంటూ కప్పిపుచ్చారు. ఇదే అనుమానం భక్తులు కూడా వ్యక్తం చేయగా ప్రసాదంలో పచ్చ కర్పూరం ఎక్కువగా వేసామంటూ తెలపడంతో ఇది నమ్మిన భక్తులు ప్రసాదాన్ని తిన్నారు. ప్రసాదం తిన్న కొద్ది సేపటికే వందమందికి పైగా వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురయ్యారు.
హైడ్రామా నడుమ దొడ్డయ్య అరెస్ట్
ఘటన జరిగిన కొద్ది సేపటికి అర్చకుడు అంబులెన్స్‌లో కేఆర్ ఆసుపత్రిలో చేరాడు.తాను కూడా ప్రసాదం తిన్నానని వాంతులు అవుతున్నాయంటూ వైద్యులను నమ్మించి ఆసుపత్రిలో చేరాడు.అయితే దొడ్డయ్యను క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు దొడ్డయ్య శరీరంలో ఎటువంటి విషం ఆధారాలు గుర్తించకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన వైద్యులు పోలీసులకు విషయాన్ని తెలియజేసారు.దీంతో సోమవారం దొడ్డయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం బహిర్గతం చేశాడు.
అంబికపై పోలీసుల దృష్టి
ఘటనపై కేసు నమోదు చేసుకున్న కొళ్లేగాల పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. అంబికపై కాల్‌లిస్ట్‌తో పాటు అంబిక ప్రతీ కదలికపై నిఘా ఉంచారు. అంబిక కొద్ది రోజుల క్రితం తన దూరపు బంధువైన వ్యవసాయశాఖ అధికారితో మాట్లాడినట్లు గుర్తించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే సదరు వ్యవసాయశాఖ అధికారిఅంబిక ఇంటికి వచ్చినట్లు గుర్తించారు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు నడిచినట్లు గుర్తించి వ్యవసాయ శాఖ అధికారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో అంబిక మోనోక్రోటోఫాస్ క్రిమిసంహారక మందులు అడిగినట్లు వెల్లడించడంతో అంబికను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మారమ్మ ట్రస్ట్ అధ్యక్షుడు మహదేవస్వామి సూచన మేరకు తన భర్త మాదేశ్,అర్చకుడు దొడ్డయ్యతో కలసి ప్రసాదంలో విషం కలిపినట్లు అంబిక అంగీకరించింది.
సాలూరు గురుస్వామినీ చంపాలని కుట్ర
సాలూరు మఠాధిపతి గురుస్వామితో కూడా మహదేవస్వామికి విభేదాలున్నాయి. గోపుర శంకుస్థాపన రోజు ప్రసాదం తిని చిన్నప్పి, గురుస్వామి కూడా మరణిస్తే సాలూరు మఠం కూడా హస్తగతమవుతుందని కుట్రపన్నాడు. గురుస్వామికి ప్రసాదం దుర్వాసన రావడంతో తినకుండానే వెళ్లిపోయారు. చిన్నప్పి కూడా తినలేదు. ఘటన జరిగిన మరుసటి రోజే చిన్నప్పిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతని పాత్ర లేదని తెలిసి వదిలేశారు.
Comments
Please login to add a commentAdd a comment