consumed prasad
-
ప్రసాదంలో విషం.. 12 మంది మృతి
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. దేవాలయంలో పంపిణీ చేసిన ప్రసాదం తిని ఇద్దరు చిన్నారులతో సహా 12 మంది మృత్యువాత పడ్డారు. మరో 80 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చామరాజనగర్ జిల్లా హనూరు తాలూకా సుళివాడి గ్రామంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. గ్రామంలోని మారెమ్మ దేవాలయ గోపుర నిర్మాణానికి గురువారం శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. పూజాది కార్యక్రమాలు ముగిసిన అనంతరం ప్రసాదం కోసం సిద్ధం చేసిన రైస్‌బాత్‌తో అన్నదానం నిర్వహించారు. ఆ రైస్‌బాత్ తిన్న కొద్దిసేపటికి చాలామంది భక్తులు వాంతులు చేసుకుని స్పృహ తప్పారు. ఆస్పత్రిలో చేర్పించగా 12 మంది చికిత్సపొందుతూ చనిపోయారు. దేవుడి ప్రసాదం విషమయం కావడానికి దేవాలయ పాలక మండలిలో ఉన్న రెండు వర్గాల మధ్య విబేధాలే కారణమని తెలుస్తోంది. కార్యక్రమానికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో ఒక వర్గం వారు ప్రసాదంలో కిరోసిన్‌తో పాటు క్రిమిసంహారక మందులు కలిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ సీఎం రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. -
ప్రసాదం తిని 100 మందికి అస్వస్థత
బిహార్‌లోని మాధేపురా జిల్లాలో గల సాహుగఢ్ జానకి అనే గ్రామంలో ప్రసాదం తిన్న సుమారు వంద మంది అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో పదిమంది పిల్లలు కూడా ఉన్నారు. ప్రసాదం తిన్నవాళ్లందరికీ వాంతులు, తల తిరగడం, కడుపు నొప్పి లాంటి లక్షణాలు కనిపించాయని, దాంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం సదర్ ఆస్పత్రికి తరలించామని జిల్లా కలెక్టర్ మహ్మద్ సొహైల్ తెలిపారు. అందరికీ ముప్పు తప్పిందని, ఫుడ్ పాయిజనింగ్ వల్లే ఇలా జరిగి ఉంటుందని ఆయన అన్నారు. స్థానికులు ఎనిమిది రోజుల పాటు 'అష్ట్యమ' పూజ చేశారు. అందులో మొదటి రోజు తయారుచేసిన ప్రసాదాన్ని అంతా తిన్నారు. దానివల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. -
ప్రసాదం తిని.. 160 మందికి అస్వస్థత
పశ్చిమబెంగాల్లోని హుగ్లీ జిల్లా ఆరాంబాగ్లో ప్రసాదం తిని 160 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే వాళ్ల ఆరోగ్యం పాడై ఉంటుందని అనుకుంటున్నారు. 'పీర్ మేళా'లో పెట్టిన ఖిచిడీ ప్రసాదం తిన్న కాసేపటికే వాళ్లందరికీ కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయని ఆరాంబాగ్ మునిసపల్ చైర్మన్ స్వపన్ నంది తెలిపారు. ఖిచిడీలో ఉపయోగించిన పప్పులు పాడై ఉంటాయని, అందుకే ఈ సమస్య వచ్చిందనుకుంటున్నామని ఆయన అన్నారు. వాటిని పరీక్షకు పంపినట్లు తెలిపారు. బాధితులంతా ప్రస్తుతం కోలుకుంటున్నారని చెప్పారు. ఆ ప్రాంతానికి వైద్యబృందాన్ని పంపినట్లు జిల్లా ఆరోగ్యశాఖాధికారి తెలిపారు.