శిర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రసాదం బాధితులు
చామరాజనగరలో మారెమ్మ ఆలయంలో విషం కలిపిన ప్రసాదం ఆరగించి సుమారు 20 మంది మరణించడం, చింతామణిలో అలాంటి ప్రసాదమే ఆరగించి ఇద్దరు చనిపోయిన దుర్ఘటనలు మరువక ముందే ఆలయంలో మరో కలుషిత ప్రసాద సంఘటన చర్చనీయాంశమైంది. తుమకూరు జిల్లా శిర తాలూకాలోని ఓ ఆంజనేయ ఆలయంలో అన్న–సాంబారు, పాయసం తిన్నవారిలో 60 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు.
తుమకూరు: దేవాలయంలో ప్రసాదం తిని సుమారు 60 మంది ప్రజలు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని శిరా తాలుకాలో ఉన్న చిన్నప్పనజళ్ళి గ్రామంలో జరిగింది. శనివారం గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హరసేవ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల కోసం ప్రసాదంగా అన్నం– సాంబారు, పాయసం, స్వీట్లు, కారాబూందీని పంపిణీ చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు దేవాలయంలో ఆరగించి వెళ్లారు. ఇక ఆదివారంఉదయం నుంచి ఇబ్బంది మొదలైంది. ప్రసాదం తిన్నవారిలో చాలామందికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. గ్రామంలో వందమందికిపైగా ప్రసాదం తినగా, వారిలో సుమారు 60 మందికిపైగా అస్వస్థతకు గురి కావడంతో చికిత్స కోసం శిరా, కళ్ళంబెళ్ళ ప్రాథమిక ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. వాంతులు, విరేచనాలతో పాటు తలనొప్పి, జ్వరం కూడా రావడంతో బాధితులు భయాందోళలకు గురవుతున్నారు.
నమూనాల సేకరణ
ఆరోగ్య కార్యకర్తలు పరీక్షల కోసం వంటల నమూనాలను సేకరించారు. బాధితుల్లో 10 మందికి పైన చిన్నారులున్నారు. ఎలాంటి ప్రాణాప్రాయం జరగలేదని, అందరికీ చికిత్స అందిçస్తున్నామని వైద్యులు తెలిపారు. పాత్రల్ని సరిగా శుభ్రం చేయకపోవడమో, కలుషిత నీటిని వాడడమో ఘటనకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు.
ఉదయం నుంచే మొదలైంది
ఈ విషయంపైన చిన్నప్పనహళ్ళి గ్రామానికి చెందిన సరోజమ్మ మాట్లాడుతూ రాత్రి అందరూ ప్రసాదం తిన్నామని, ఆదివారం ఉదయం వరకు బాగానే ఉంది, ఆ తరువాతే చాలామంది వాంతులు, విరేచాలు అయ్యాని తెలిపారు. వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్లామని చెప్పారు. నేను నా భర్త, కుమారుడు ప్రసాదం తిన్నాం, నాకు నా కొడుక్కి ఏమీ కాలేదు, తుమకూరుకు పనిమీద వెళ్ళిన తన భర్తకు వాంతులు అయినట్లు పోన్ చేశాడని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment