క్రీస్తు పుట్టుక సర్వ సృష్టికి పర్వదినం.. మనుజ కుమారుడిగా ఆ దేవాది దేవుడే ఈ భూతలంపైకి అరుదెంచిన అపురూప ఘట్టం. సర్వ మానవాళికి రక్షణ సౌభాగ్యం. ప్రతి ఒక్కరికి దేవుడు అందించిన శుభదినం.
► పరలోకం పరవశించిన వేళ
మానవాళి రక్షణకు యేసు జననం అనివార్యమయినప్పుడు అది విశ్వవేడుకగా మారిపోయింది. రెండు వేల సంవత్సరాల క్రితం ఆ దేవాదిదేవుడే నరరూపిగా అరుదెంచేందుకు సిద్ధపడ్డాడు. నశించిపోతున్న మానవులందరికి తనని తాను బలి అర్పణగా అర్పించుకునేందుకు సిద్ధపడ్డ కరుణామయుని జననం కోసం అటు పరలోకం ఇటు భూలోకం సమాయత్తమయ్యాయి. దైవ సంకల్పం నెరవేర్చేందుకు పరలోక దూతాళి దిగివచ్చింది. గలిలయలోని నజరేతు గ్రామంలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యయైన మరియ వద్దకు పరలోకం నుంచి ముందుగా శుభవార్త తీసుకువచ్చారు. దయాప్రాప్తురాలా నీకు శుభం.
ఆ దేవాది దేవుని కృపపొందిన నీవు ఒక కుమారుని కంటావు.. ఆ శిశువు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడతాడు ఆయన రాజ్యం అంతం లేనిదై ఉంటుంది. ఇదంతా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది కాబట్టి నీవు భయపడాల్సిన పనిలేదు. సర్వోన్నతుని శక్తి నీకు తోడుగా ఉంటుందని అభయమిచ్చాడు. మరియతో పాటు దేవదూత యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై ఇదంతా దేవుని సంకల్పంతో జరుగుతుంది కాబట్టి నీ భార్యను చేర్చుకొనుటకు సందేహింప వద్దని, పుట్టబోవు శిశువు తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షిస్తాడు కాబట్టి యేసు అని నామకరణం చేయాలని చెబుతాడు. ఈ విధంగా మానవ ప్రమేయం లేకుండా పరమ దేవుడు పరిశుద్ధాత్మ శక్తి తో మరియ ద్వారా అవని మీద అవతరించడానికి మార్గం సుగమం అయింది.
► భూలోకం మైమరచిపోయిన వేళ
యేసు పుట్టుక సమయంలో యోసేపు మరియను తీసుకుని తన సొంత గ్రామమైన బెత్లెహేముకు బయలుదేరతాడు. నిండు చూలాలైన మరియకు స్థలం లేకపోవడం వలన ఓ పశువు పాకే ప్రభు జన్మస్థలమైంది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఓ సత్రములో పరుండి యుండుట మీరు చూచెదరన్న ప్రవచనం ఆ విధంగా నెరవేరింది. ఆ రాత్రి ఊరి వెలుపల గొఱె<లు కాచుకుంటున్న కాపరులకు రక్షకుని జనన వార్త ముందుగా చేరింది.
దేవదూత కాపరుల వద్దకు వచ్చి భయపడవద్దని, ప్రజలందరికి కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెచ్చానని దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కోసం పుట్టాడని ఆయన ప్రభువైన క్రీస్తని చెప్పాడు. ఆ సమయంలో దేవుని దగ్గర నుంచి పరలోక దూత సైన్య సమూహం దిగివచ్చి ‘సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమ ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగును గాక’ అంటూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ పాటలు పాడారు. ఇదే సమయంలో ఆకాశంలో ఓ అరుదైన వింతైన కాంతివంతమైన నక్షత్రము కనుగొని ముగ్గురు తూర్పుదేశపు జ్ఞానులు దానిని వెంబడించి బెత్లెహేము చేరుకొని ఇతడే యూదుల రాజంటూ అత్యానందభరితులై తాము తెచ్చిన బంగారం, సాంబ్రాణి, బోళము కానుకగా అర్పించి తిరిగి వెళతారు.
► చీకటిని తరిమేసిన గొప్ప వెలుగు
క్రిస్‌మస్ ఈ లోకానికి ఎన్నో శుభములు సమకూర్చింది. చీకటితో నిండిన హృదయాలను వెలుగుతో నింపింది. ఆది మానవుడైన ఆదాము దేవుని ఆజ్ఞమీరి చీకటి అనే మరణాన్ని అందించాడు. అయితే ఆదాము చేసిన పాపం మానవుల మీద రాజ్యమేలకుండ ఉండటానికి దేవాది దేవుడే శరీరధారుడై ఈ భువికి ఏతెంచాల్సి వచ్చింది. పాపకూపములోకి దిగిపోకుండ నరుల ప్రాణము విమోచించేందుకు దేవుడు సల్పిన గొప్ప యాగమే క్రిస్‌మస్. వెలుగు రక్షణల సంగమం. ఇది ముందుగానే గ్రహించిన భక్తులు మరణములో నుండి నా ప్రాణమును తప్పించావు, జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారి పడకుండా నా పాదములు తప్పించావు అంటూ కొనియాడారు. యెషయా ప్రవక్త ‘చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణచ్ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును’ అంటూ ప్రవచించాడు.
‘జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరని’ ప్రస్తుతించాడు. క్రీస్తు పుట్టుకతో ఈ ప్రవచనం నెరవేరింది. అనేక ప్రవచనాల నెరవేర్పు ఈ సమయంలో నెరవేరింది. సాతాను చెరలో బందీలై చీకటిలో మగ్గే ప్రజలు వెలుగు క్రియలు ఇష్టపడని వారిని సైతం ప్రేమించి క్రీస్తు వెలుగు ప్రసాదించాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉందురని ఏసు ప్రభువు చెప్పాడు. తనను అనుసరించే వారంతా వెలుగు సంబంధులుగా పేర్కొన్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చానని స్పష్టం చేశాడు. అంధకారమయమైన ప్రతి హృదయం వెలుగుతో ప్రకాశించడమే ఈ పర్వదినాన క్రీస్తు మనందిరినుంచి కోరుకునేది. క్రీస్తు అందించే వెలుగు ఫలాలు మంచితనం, నీతి, సత్యం ఈ ఫలాలు భువిలో శాంతి సమాధానాలు వెదజల్లేందుకు దోహదం చేస్తాయి. క్రీస్తు వెలుగులోనున్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసము గలవారముగా ఈ భువిపైన జీవించగలం.
► క్రిస్మస్ అంటే అంతులేని ఆనందం
క్రిస్‌మస్ ప్రతి హృదయంలో ఆనందంతో నింపుతుంది. ఆ రోజున తల్లి మరియ తండ్రి యేసేపు బెత్లెహేములోని పశుపాకలో పవళించిన బాల యేసుని చూసి మురిసిపోయారు. పరలోకం నుంచి వచ్చిన దూతల వర్తమానంతో తొలుత కలవరపడినా మానవ ప్రమేయం లేని దేవాదిదేవుని జననం ఆశ్చర్యాన్ని కలిగించినా ఏసు జననంతో వారు తమ ప్రయాస అంతా మరిచిపోయి లోక రక్షకుడ్ని చూసి మురిసి పోయారు. ఈ గొప్ప వేడుకలో అమితానందం ఎవరైనా పొందారంటే గొర్రెల కాపరులే. దేవుని దూతలు వచ్చి స్వయంగా క్రీస్తు జనన వార్త తెలపడంతో అమితాశ్చర్యం, ఆనందంలో తేలిపోయారు. దూరదేశం నుంచి వచ్చిన జ్ఞానులకు ఆకాశంలో అందమైన తార కనిపించడంతో సుదూర ప్రాంతం అతి ప్రయాసకోర్చి క్రీస్తును గాంచి అత్యానంద భరితులయ్యారు. రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ అద్భుతం క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి హృదయంలో నేటికి జరుగుతుంది. అలా ఏసు పరలోకానికి భూలోకానికి వారధిగా నిలబడి ప్రతి హృదిని ఇప్పటికి వెలిగిస్తూనే ఉన్నాడు. అందుకే ఓ భక్తుడు ఇలా పాడాడు ‘ఓ యేసు పాన్పుగనా ఆత్మ జేకొని శ్రేయముగ బవళించు శ్రీకర వరసుత’ అని.
► లోక రక్షకుడిగా అవతరించిన తరుణం
యేసు క్రీస్తు జననంలో గొఱె<ల కాపరులతో దేవదూత అన్నమాట ఒకసారి గుర్తు చేసుకుంటే ‘ఇది ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం..దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు’ అది కేవలం వారికే కాదు ఈ భూమి మీద ఉన్న వారందరికి శుభవార్త. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు ఎవ్వరూ నశించిపోకుండా నిత్యజీవం అనుగ్రహించేందుకే ఏసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనవద్దని కీర్తనకారుడు చెప్పిన విధంగా మానవులందరి రక్షణకు కారణభూతుడగు దేవుడు చేసిన మహోపకారం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. మనందరం అపరాధముల చేత, పాపం చేత చచ్చిన వారమై ఉండగా మనలను బతికించేందుకు నిత్యజీవం అనుగ్రహించేందుకు బలి అర్పణగా తనను తాను సమర్పించు కున్నాడు. ఆయన చేసిన ఆ గొప్ప ఉపకారం క్రీస్తు జన్మతోనే ప్రారంభమవడం అత్యంత ముదావహం.
అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు
– బందెల స్టెర్జిరాజన్
Comments
Please login to add a commentAdd a comment