Christmas 2022: క్రీస్తు జననం.. విశ్వానికి పర్వదినం
క్రైస్తవ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన దైవజనులలో ఇంగ్లాండు దేశానికి చెందిన చార్లెస్ వెస్లీ ఒకరు. తన అన్న జాన్వెస్లీ అద్భుత ప్రసంగీకుడైతే చార్లెస్ వెస్లీ అద్భుతమైన పాటల రచయిత. తన జీవిత కాలంలో దాదాపుగా తొమ్మిదివేల పాటలను రచించి దేవుని నామమును మహిమపరచాడు. అతడు రాసిన పాటల్లో చాలా ప్రాచుర్యం పొందిన పాట ‘దూత పాట పాడుడీ’. ఆ పాటలోని ప్రతి అక్షరంలో అనిర్వచనీయమైన భక్తి పారవశ్యం కనిపిస్తుంది. ఈ పాట అనేకమందికి క్రిస్మస్ గొప్పతనాన్ని చాటుతుంది.
ప్రపంచంలోని క్రైస్తవులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో పారవశ్యంతో జరుపుకొనే పండుగ క్రిస్మస్. సత్య వాక్యమైయున్న దేవుడు రక్తమాంసాలతో జన్మించి పుడమిని పులకింపచేసిన సమయం. ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు’ అని దూతలు ప్రకటించిన సువార్త నేడు కూడా అనేక హృదయాలలో మారుమ్రోగుతుంది.
‘యేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవాళిని రక్షించుటకు మానవ ఆకారంలో ఈ లోకానికి ఏతెంచారు’– కేంబ్రిడ్జ్లో విద్యనభ్యసించి ఆ తదుపరి దేవుని సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకొని శ్రేష్ఠమైన గ్రంథాలెన్నింటినో రచించిన థామస్ వాట్సన్ కలం నుంచి జాలువారిన మాటలివి.
క్రిస్మస్ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థం. ఆ ఆరాధన హృదయాంతరాళాల నుంచి పెల్లుబకాలి. జగతి పరమార్థాన్ని గ్రహించి బతకాలన్నా, నిజమైన ఆనందాన్ని మదిలో నింపుకోవాలన్నా ఘనుడైన దేవుని ఆరాధించాలి. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, ఆదిసంభూతుడు, అత్యున్నతుడు, ఆరాధనకు యోగ్యుడూ క్రీస్తే! ‘కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు పుట్టి మనము స్వీకృత పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను’ అని అపొస్తలుడైన పౌలు ధన్యసత్యాన్ని గలతీ సంఘానికి తన పత్రిక రాస్తూ తెలియచేశాడు. పాపపంకిలమైన లోకంలో బతుకుచున్న మనలందరిని తన బిడ్డలుగా చేసుకోవాలన్నదే దేవుని నిత్య సంకల్పం. ఆ సంకల్పం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు.
ఆయన జన్మించినప్పుడు ఓ అద్భుత సంఘటన జరిగింది. తూర్పు దేశపు జ్ఞానులు సుదూర ప్రయాణం చేసుకొంటూ మొదల యెరూషలేముకు ఆ తదుపరి దానికి దగ్గరలోనే ఉన్న బేత్లేహేముకు వెళ్ళారు. వాళ్ళు నక్షత్ర పయనాన్ని అంచనా వేయగల సామర్థ్యం గలవారు. ఆధ్యాత్మిక చింతన పరిపుష్టిగా ఉంది. ఎన్నో ఏండ్ల నుంచి రక్షకుని ఆగమనం కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్న వారిలో వీరు కూడా ఉన్నారు. వారి ప్రాంతాలను, కుటుంబాలను, పనిపాటలను కొంతకాలం పక్కనపెట్టి దేవుణ్ణి చూడడానికి ప్రయాణం కట్టారు.
అది అంత సులువైన ప్రయాణం కాకపోయినా మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ప్రయాణం చేసి ఆఖరుకు చేరాల్సిన స్థానానికి చేరారు. మనసులు పులకించిపోయాయి. దైవదర్శనాన్ని పొందిన ఆ నేత్రాలు పావనమయ్యాయి. ధారలుగా కారుతున్న ఆనందబాష్పాలు అందుకు నిలువెత్తు నిదర్శనం. పాలబుగ్గల పసివాడు తల్లిఒడిలో పరవశించినట్లు ఆ జ్ఞానులు పరవశించిపోయారు. పసిబాలుడైన క్రీస్తును తదేకంగా చూస్తూ ఆయన పాదాలమీద పడి మనస్ఫూర్తిగా ఆరాధించారు. ఆ దివ్యమైన అనుభూతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించిన సువార్తికుడైన మత్తయి ఇలా అంటాడు. ‘వారు ఇంటిలోనికి వచ్చి తల్లియైన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి’ (మత్తయి 2:10, 11).
యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశంలోని బేత్లెహేములోనే ఎందుకు జన్మించాడు అని కొందరు అడుగుతుంటారు. ఆ ప్రశ్నకు అద్భుతమైన సమాధానాలున్నాయి. ఈనాటి ప్రపంచంలో సుమారుగా 4400 పట్టణాలున్నాయి. ఎంతో చరిత్ర కలిగిన పట్టణాలు కొన్నయితే, మనస్సును ఆహ్లాదపరచే ప్రకృతి రమణీయతను కలిగిన పట్టణాలు మరికొన్ని. అయితే వీటిలో దేనికీలేని ప్రాధాన్యం, ప్రాచుర్యం బేత్లెహేము అనే పట్టణానికి ఎందుకుంది?
వాస్తవానికి బైబిల్ గ్రంథం రెండు భాగాలుగా విభజించబడింది. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్తనిబంధన. పాతనిబంధన చరిత్ర క్రీస్తుకు ముందు జరిగిన చరిత్ర. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన చరిత్ర, ఆయన తరువాత సంఘం ద్వారా దేవుడు చేసిన కార్యాలు రాయబడ్డాయి. అయితే పాత నిబంధన గ్రంథంలో రక్షకుని గురించిన ప్రవచనాలు చాలా స్పష్టంగా వివరించబడినవి. రక్షకుని ఆగమనం ఆకస్మికంగా జరిగినది కాదు. ప్రవక్తలు సామాన్య ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూశారు. యేసుక్రీస్తు జీవితంలో జరిగిన ప్రతి విషయానికి పాతనిబంధన గ్రంథంలో ప్రవచనాలున్నాయి. యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మిస్తాడనేది వాటిలో ఒక ప్రముఖమైన ప్రవచనం.
మొదటిగా యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించుట అనేది ప్రవచన నెరవేర్పు. మోరెషెత్గతు అను కుగ్రామానికి చెందిన మీకా అనే ప్రవక్త దేవుని ఉద్దేశాలను బయలు పరచడానికి దేవుని ద్వారా ప్రేరేపించబడ్డాడు. ఇతడు ప్రవక్తయైన యెషయా సమకాలీకుడు. యెషయా యెరూషలేములో ప్రవక్తగా ఉండి అక్కడ పరిపాలించుచున్న రాజులను గురించి పరిస్థితులను గురించి తన గ్రంథంలో రాశాడు.
అయితే మీకా గ్రామీణ ప్రాంతానికి చెందినవాడు కావడంతో యూదయ ప్రాంతంలో ఉన్న అబద్ధ ప్రవక్తలను భక్తిహీనులైన యాజకులను, లంచగొండులైన నాయకులను ఖండించాడు. అన్నిటికన్న ప్రాముఖ్యంగా రాబోయే మెస్సీయను గురించి ఆయన యొక్క నీతి పాలన గురించి ప్రవచించాడు. యేసుక్రీస్తు శరీరధారిగా రాకముందు 700 సంవత్సరాల క్రితమే ఆయన బేత్లెహేములో జన్మిస్తాడని మీకా ప్రవచించాడు. ‘బేత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును.
పురాతన కాలం మొదలుకుని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండును’ (మీకా 5:2). ఏడు వందల సంవత్సరాల తరువాత రక్షకుడు భూమి మీద ఉద్భవించిన తరువాత యూదయను పాలిస్తున్న హేరోదు రాజు మెస్సీయ పుట్టుక స్థలమును గురించి యాజకులను, శాస్త్రులను ప్రశ్నించినప్పుడు వారు మీకా గ్రంథమునందలి ఈ ప్రవచనమును జవాబుగా తెలిపారు. ‘దేవుడు తన ప్రవక్తల ద్వారా వెల్లడిచేసిన ఏ ప్రవచనమును నిరర్థకం చేయలేదు. ఎందుకంటే ప్రవచనము మనష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు. కానీ మనుష్యులు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వాటిని పలికిరి’ (2పేతురు 1:21).
ప్రవక్తయైన మీకా ద్వారా బేత్లెహేమును గురించిన ప్రవచనం మాత్రమే గాక ఆయన గురించి మరికొన్ని ప్రవచనాలు కూడా పలికిరి.
మెస్సీయ స్థాపించే రాజ్యము సమాధాన ముతో ఉంటుందని ప్రవచించారు. ‘ఆయన సమాధానమునకు కారకుడగును’ (మీకా 5:5). యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి తనయందు విశ్వాసముంచిన వారిని దేవునితో సమాధానపరుస్తారు అనే విషయాన్ని ఆత్మ నడిపింపు ద్వారా మీకా ప్రవక్త తెలిపాడు. మొదటి శతాబ్దంలో అపొ. పౌలు ఎఫెసీ సంçఘానికి రాసిన పత్రికలో ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.
‘ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్ట మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను. గనుక ఆయనయే మనకు సమాధానకారకుడైయున్నాడు’ (ఎఫెసీ2:14, 16).
దేవుడు అనుగ్రహించే సమాధానము విశిష్ఠమైనది. ‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తజనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహింతును’ అని ప్రభువు సెలవిచ్చారు. ఆయన పాదాల చెంతకు వచ్చిన అనేకులను తన దివ్యశక్తితో, శాంతితో నింపి వారిని బలపరిచాడు. ప్రస్తుతకాలంలో మానవుడు శాంతి సంతోషాలను అనుభవించాలన్న ఆశతో అశాశ్వతమైన ఆనందాలకోసం వెంపర్లాడుతూ, మనుషులు లోకంలోని బురదను, మురికిని అంటించుకొంటున్నారు దానిని వదిలించుకోలేక, విడిపించుకోలేక, కడుక్కోలేక సతమతమౌతున్నారు.
రక్షించే నాథుడు ఎవరా? కాపాడే కరుణామయుడు ఉన్నారా? అని అలమటిస్తూ నిజమైన ఆనందం కోసం, సమాధానం కోసం వెదుకుతున్నారు. నేటి కాలంలో యువత మత్తు పదార్థాలకు, వింత పోకడలకు బానిసలౌతున్నారు. వాటి వెనుకనున్న కారణాలు విశ్లేషిస్తే, ‘ఒత్తిడి అధిగమించాలని కొందరు, కిక్ కోసం కొందరు, ఫ్రెండ్సు కోసం కొందరు, మానసిక ఉల్లాసం కోసం మరికొందరు చెడు అలవాట్లకు చేరువౌతున్నారు. ప్రభుత్వాలకు, పోలీసులకు పెనుసవాళ్ళను మిగుల్చుతున్న డ్రగ్స్ మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు. ఏదో సొంతం చేసుకోవాలన్న తపనతో ఉన్నవికూడా కోల్పోతూ ఆఖరుకు తీవ్ర నిరుత్సాహానికి గురై ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.
చాలా సంవత్సరాల క్రితం రస్సెల్ అనే సంగీత కళాకారుడు ఒక ప్రాంతంలో కచేరీ నిర్వహించాడు. వందల డాలర్లు వెచ్చించి అతడు వాయించే సంగీత సమ్మేళనాన్ని ఆస్వాదించడానికి సంగీత ప్రియులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆ రాత్రి అతడు వాయించిన సంగీతం అనేకమందిని ఉర్రూతలూగించింది. ఆ సంగీత విభావరిలో అతడు ఒక పాటను ఆలపించాడు. ‘విచారం వలన ఒరిగేదేమిటి? దుఃఖం వలన వచ్చే ప్రయోజనమేమిటి? విచారాన్ని దుఃఖాన్ని సమాధి చేసి ఆనందంగా బతికేయి’ అనేది ఆ పాట సారాంశం.
అర్ధరాత్రివరకూ కొనసాగిన ఆ సంగీత విభావరి ముగిశాక అందరూ ఇళ్ళకు చేరుకున్నారు. మరుసటి ఉదయం వార్తాపత్రికలలో మొదటి పేజీలో ముద్రితమైన ఓ చేదువార్త అనేకులను ఆశ్చర్యపరచింది. గతరాత్రంతా తన సంగీతంతో ప్రజలను ఉర్రూతలూగించిన రస్సెల్ ఆత్మహత్మ చేసుకున్నారు. దుఃఖాన్ని సమాధి చేయండి అని పిలుపిచ్చిన వ్యక్తి తానెందుకు ఆ పని చేయలేకపోయాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోనూ మెదిలింది.
నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించండంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే, హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువై ఆనందాన్ని స్వంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే వుండదు. ఆ జన్మ ధన్యం, పుట్టుక సఫలం. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. నిత్యనూతనమైన జీవాన్ని అందులో నింపింది. సర్వకాల సర్వావస్థలలోనూ తొణికిసలాడే సంతోషాన్ని నిండుగా నింపింది.
ఓ మంచి ఉద్యోగం, చుట్టూ ఇరవై మంది స్నేహితులు, రోజుకు రెండు సినిమాలు షికార్లతో బిజీబిజీగా ఉంటూ జీవితాన్నంతా ఆనందమయం చేసుకోవాలనుకున్న ఓ యువకుడు విజయవాడలో ఉండేవాడు. జీవితాన్నంతా పరిపూర్ణంగా ఆస్వాదించాలన్న లక్ష్యంతో ఏది చేయాడానికైనా సిద్ధపడ్డాడు. ప్రతి రాత్రి రెండు దాటాకా ఇంటికి వెళ్ళడం, మానసిక ప్రశాంతత కోసం తనకు తోచినవన్నీ చేసెయ్యడం. ఎందులో వెదకినా ఏదో వెలితి, ఇంకా ఏదో కావాలన్న తపన, నేనేదో మిస్సవుతున్నానన్న భావన తనను కృంగదీయడం ప్రారంభించాయి.
మానసిక ఉల్లాసం కోసం తప్పుడు మార్గాల్లో తిరిగి జీవితం మీద నిరాసక్తిని పెంచుకొని ఒకరోజు ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి నదిలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇదే చివరిరోజు అని నిర్ణయించుకొని ఒక సాయంకాలం చావును ఎదుర్కోవడానికి వడివడిగా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తుకు సంబంధించిన శుభవార్త ఆయనకు అందింది. ‘ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా! నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేతును’ అని క్రీస్తు ప్రభువు చెప్పిన మాటను కలిగియున్న పత్రిక అందింది.
ఆ ఒక్కమాట తన జీవితాన్ని మార్చింది. ఇంతవరకూ ఎవ్వరూ ఇవ్వలేని ఆనందం, ఎక్కడా దొరకని సంతృప్తి దేవునిలో దొరికింది. అదే అఖరిరోజుగా చేసుకోవాలనుకున్న ఆయన గతించిన నాలుగు దశాబ్దాలుగా దేవుని సేవలో కొనసాగుతున్నారు. ఆయనే మా తండ్రిగారైన విజయకుమార్గారు.
ప్రపంచఖ్యాతిని ఆర్జించిన వర్జీనియా ఊల్ఫ్ గురించి తెలియని వారు లేరు. ఆమె రచనలు ఇప్పటికీ అనేకులను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. బాల్యదినాల్లోనే అనేక సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. వర్జీనియా ఊల్ఫ్ ఒక ధనిక కుటుంబంలో జన్మించింది. ఆరేళ్ళ వయస్సులో ఉన్న ఆమెను సవతి సోదరుడు అత్యాచారం చేశాడు. యవ్వనంలోనికి వచ్చేంతవరకు అది కొనసాగుతూనే ఉంది.
పదమూడేళ్ళ వయస్సులో తల్లిని కోల్పోయింది. సమస్యల వలయంలో చిక్కుకొని ఏడుస్తూ ఉండేది. కొంతకాలానికి తండ్రిని కూడా కోల్పోయింది. మనుషులంటే విపరీతమైన భయం పుట్టుకొచ్చింది. తన మదిలో ఉన్న భయాలను పోగొట్టుకోవడానికి, మానసిక సంక్షోభం నుండి బయటపడడానికి రాయడం ప్రారంభించింది. ఆమె రచనలు విప్లవాత్మకంగా ఉండేవి. కొందరు వాటిని అంగీకరించకపోయినా తాను రాసే అలవాటును మానుకోలేదు. మానసిక వ్యధను తగ్గించుకొనేందుకు 1917వ సంవత్సరములో హోగార్త్ ప్రెస్ను ప్రారంభించింది. ‘ది వోయేజ్ ఔట్, నైట్ అండ్ డే, మండే ఆర్ ట్యూస్డే, మిసెస్ డాలోవె’లాంటి రచనలు చేసింది.
అయితే ఇవేవీ ఆమెకు సాయపడలేదు. తన మనోవ్యధను తగ్గించలేదు. విజయవంతమైన ఆమె రచనలు, వాటి ద్వారా ఆమె సంపాదించిన కీర్తి ఏమీ ఆమెకు ఇసుమంతైనా సహాయం చేయలేదు. నిరంతరం తనను వెంటాడుతున్న తన వ్యథను, అశాంతిని జయించలేక తనను ప్రేమించి తన కష్టసుఖాలను పంచుకున్న భర్తకు ఓ చిన్న లేఖ రాసి తన ఇంటి సమీపంలో ఉన్న నదివద్దకు వెళ్ళి తన జేబుల నిండా రాళ్ళు నింపుకొని ఆ నదిలోనికి మెల్లగా నడిచివెళ్ళి మునిగిపోయి తన జీవితాన్ని ముగించుకుంది. ఇలాంటి విషాదాలు ఎన్ని లేవు చరిత్రలో! ఎందుకు మనిషి తన మరణాన్ని తానే శాసించుకుంటున్నాడు? బలవన్మరణానికి పాల్పడుతున్నాడు? కారణం శాంతి సమాధానాలు లేక.
దేవుడు శాంతికర్త. తన శరణుజొచ్చినవారికి శాంతి సమాధానాలను ఉచితంగా అనుగ్రహించగలిగే సమర్థుడు. ‘హాయి లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించుమీ. పాపాత్ములెల్ల యేసునున్ కీర్తించి పాడుడీ. హాయి రక్షకుండు ఏలును. సాతాను రాజ్యమున్ నశింపచేసి మా యేసే జయంబు నొందును’ అంటూ ఓ అద్భుతమైన పాటను రచించాడు ఐజక్ వాట్స్ అనే దేవుని సేవకుడు.
యేసుక్రీస్తు ప్రభువు తన చెంతకు చేరినవారికి అనుగ్రహించే ఆశీర్వాదాలను చాలా చక్కగా పాటలో వర్ణించాడు. ‘పాప దుఃఖంబులెల్లను నివృత్తిచేయును. రక్షణ సుఖ క్షేమముల్ సదా వ్యాపించును’. అవును మనిషి చేస్తున్న పాపమే మనిషిని దుఃఖసాగరంలో ముంచుతుంది. ఆజ్ఞాతిక్రమణమే పాపమని బైబిల్ సెలవిస్తుంది. సర్వశక్తుడైన దేవుడు సకల చరాచర సృష్టిని తన సంకల్పంతో కలుగచేశాడు గనుక ప్రతి మానవుడు ఎలా జీవించాలన్నది కూడా దేవుడే సంకల్పించాడు. ఆ చిత్తానికి, ఆ సంకల్పానికి ఎదురొడ్డి నిలబడడమే పాపమంటే. పాపానికి బానిసైన మానవుడు దేవున్ని చూడలేకపోతున్నాడు, చేరలేకపోతున్నాడు.
దేవుడు పరమ పవిత్రుడు. పరిశుద్ధమైన తన రాజ్యంలోనికి పాపముతో నింపబడిన మానవుడు ప్రవేశించడం అసాధ్యం. పాపం మనిషిని దేవునికి దూరం చేయుటయే గాక అశాంతి కూపంలోనికి నెట్టివేసింది. భయంకరమైన పాప జీవితం నుంచి మానవుడు విడుదల పొందినప్పుడే దేవుని ప్రసన్నతను అనుభవించగలడు, అనిర్వచనీయమైన శాంతి సమాధానాలను పొందుకొనగలడు.
పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడైన దేవుడు మనుష్యాకారంలో ఈ లోకానికి దిగివచ్చి తన పవిత్రమైన రక్తాన్ని చిందించుట ద్వారా సర్వలోకానికి రక్షణ ప్రసాదించాడు. ఎవరైతే విశ్వాసంతో ఈ సత్యాన్ని హృదయంలో విశ్వసించి యేసు రక్షకుడని ఒప్పుకుంటారో వారందరూ రక్షింపబడతారు. పాపక్షమాపణ ఉచితంగా పొందుకుంటారు. పాపం ఎప్పుడైతే క్షమించబడిందో అప్పుడు శాంతి సమాధానాలు మనిషి వశమౌతాయి.
యేసుక్రీస్తు కాపరిగా వ్యవహరిస్తాడని మీకా ప్రవచించాడు. ‘ఆయన నిలిచి, తన మందను మేపును’ (మీకా 5:4). యేసుక్రీస్తు ఒక కాపరి తన గొర్రెలను ఎలా సంరక్షిస్తాడో అలాగో తన ప్రజలను సంరక్షిస్తాడని తన ప్రవచనాలలో తెలిపాడు. యేసుక్రీస్తు ప్రభువు తాను ఎందుకీ లోకానికి వచ్చారో యోహాను సువార్త 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరించాడు. ‘నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును.
తప్పిపోయి నశించిన వారిని వెదకి రక్షించడానికి ప్రభువు ఈ లోకానికి ఏతెంచాడు. ప్రవక్తయైన మీకా ద్వారా ఆత్మ పలికిన మాటలన్నీ చరిత్రలో నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు బేత్లెహేములో జన్మించినది ప్రవచన నెరువేర్పు కొరకు.’
రెండవదిగా క్రీస్తు బేత్లెహేములో జన్మించింది వాగ్దాన నెరవేర్పు కొరకు. ప్రభువు దావీదునకు గొప్ప వాగ్దానం అనుగ్రహించాడు. ‘నేను ఏర్పరచుకునిన వానితో నిబంధన చేసియున్నాను. నిత్యము నీ సంతానము స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనము స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసియున్నాను’ (కీర్త 89:3,4).
దావీదుకు చేయబడిన వాగ్దానమిది. దావీదు ఇశ్రాయేలు దేశాన్ని పాలించిన తరువాత సొలొమోను అతని బదులుగా రాజైనాడు. నలభై సంవత్సరాలు సొలొమోను పాలన తర్వాత రాజ్యము రెండుగా విడిపోయింది. యూదా రాజ్యమును రెహబాము, ఇశ్రాయేలు రాజ్యమునకు యరొబాడు రాజులైనారు. కొంతకాలానికి ఇశ్రాయేలు రాజ్యము అష్షూరు చెరలోకి వెళ్ళిపోయింది.
మరికొంతకాలానికి యూదా రాజ్యము బబులోను చెరలోకి వెళ్ళిపోయింది. దావీదుకు చేయబడిన వాగ్దానం సంగతి ఏది? వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని మరచిపోతాడా? వాగ్దానాన్ని నిరర్థకం చేశాడా? అని కొందరు అనుకొని ఉండవచ్చు. కాని తగిన సమయంలో దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వాగ్దానాలను నెరవేర్చువాడు. దేవుని వాగ్దానాలన్నీ యేసుక్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి.
దావీదు సింహాసనమును స్థిరపరుస్తానని దేవుడు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు దావీదు వంశములో దావీదు పట్టణంలో జన్మించాడు. ఎంత గొప్ప ప్రేమ! ఆకాశం, భూమి గతించినను దేవుని మాటలు ఎన్నడూ గతించవు. యోసేపు దావీదు వంశములోను, గోత్రములోను పుట్టినవాడు గనుక ‘తనకు భార్యగా ప్రధానం చేయబడి, గర్భవతై యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను’ (లూకా2:4,5). ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టియున్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు’ (లూకా 2:11). ‘యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున దేవుని కుమారునిగాను ప్రభావంతో నిరూపించబడెను’ (రోమా 1:27).
మనుష్యులు చాలామంది చాలా రకాలైన వాగ్దానాలు చేస్తారు. కాని వాటిని నిలబెట్టుకొనే సమయానికి తప్పించుకొని తిరుగుతుంటారు. కొందరు రాజకీయవేత్తలు అధికారం కోసం వాగ్దానాలు చేస్తారు. తర్వాతి కాలంలో వాటిని నెరవేర్చకుండానే గతించిపోతారు. దేవుడు అలాంటివాడు కాడు. తన ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు. కల్దీయ దేశాన్ని విడచి నేను చూపించు దేశానికి వెళ్తే అబ్రహామును దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ‘నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు’ అని ప్రభువు పలికాడు. ఏ లోటు లేకుండా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. నూరేళ్ళ ప్రాయంలో వాగ్దాన పుత్రుని అనుగ్రహించి తన వాగ్దానాన్ని నెరవేర్చాడు.
మూడవదిగా మనుష్యులందరికి అందుబాటులో ఉండులాగున యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించారు. భూ ఉపరితల రూపాలు, లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని టోపోగ్రఫీ అంటారు. టోపోగ్రఫీ ప్రకారం ఈ భూమ్మీద మానవుడు నివసిస్తున్న దేశాలు, స్థలాకృతిని అధ్యయనం చేసినప్పుడు యేసుక్రీస్తు జన్మించి, సంచరించి, మరణించి మరియు పునరుత్థానుడై లేచిన ఇశ్రాయేలు దేశం భూమికి మధ్య ప్రాంతంగా గుర్తించారు.
ఆయన భారతదేశంలోనో లేక మరే ఇతర పెద్ద దేశంలోనో జన్మిస్తే బాగుంటుందని అనేకులకు అనిపించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన స్థలం ఈ ప్రపంచానికి మధ్య ప్రాంతం. ఆయన అందరివాడు గనుక భూమికి మధ్య ప్రాంతంలో పుట్టాడనడంలో అతిశయోక్తి లేదు. ఒక దీపం అందరికీ వెలుగునిచ్చేలా పెట్టాలంటే అది అందరికీ మధ్యలో ఉంచాలి. అప్పుడే ఆ వెలుగు అన్నివైపులా సమానంగా ప్రసరిస్తుంది.
‘వెలుగైయున్న దేవుడు ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండులాగున ఆయన ఈ భూమికి మధ్యస్థానంలో జన్మించారు’. ఈ విషయాన్ని యెషయా గ్రంథంలో కూడా రాయబడడం గమనార్హం. ‘ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును’ (యెషయా 11:10). ‘జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయుము. భూమి నాలుగు దిగంతముల నుండి చెదరిపోయిన యూదావారిని సమకూర్చుము’ (యెషయా 11:12).
ప్రవచనాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే యెష్షయి వేరు చిగురు అనగా యేసుక్రీస్తు. ఆయననే ధ్వజముగా వర్ణించాడు. ఆ ధ్వజము నలుదిక్కుల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది. ప్రపంచంలోని ప్రతి జాతి, ప్రతి ప్రాంతం యేసుక్రీస్తుకు పాదాక్రాంతమై విరాజిల్లుతుంది. బేత్లెహేము అనగా రొట్టెల గృహమని అర్థం. జీవపు రొట్టె అయిన ప్రభువు ఆ ప్రాంతమును ఎన్నుకోవడం అర్థరహితం కాదుకదా?
ప్రభువు జన్మించినప్పుడు ఆయన్ను మొదటిగా దర్శించుకున్నది ఎవరు? దానికి సమాధానం గొర్రెల కాపరులు. అతి సామాన్యమైన ప్రజలు. అటువంటివారికి రక్షకుని ఆగమన వార్త మొదట తెలిసింది. దేవుని ప్రేమ అభాగ్యుల పట్ల, దీన దరిద్రుల పట్ల ఎంత అధికంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఆ సంఘటన ఓ నిదర్శనం. బేత్లెహేము పొలాల్లో వారు రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడ్డారు.
అయితే ఆ దూత ‘భయపడకుడి. ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నా’నని చెప్పి రక్షకుని ఆగమనాన్ని గూర్చి ప్రకటించింది. సువార్తికుడును వైద్యుడైన లూకా తెలిపిన ప్రకారం గొర్రెల కాపరులు చీకటిలో ఉన్నారు. భయంతో జీవిస్తున్నారు. అటువంటి దుర్భర పరిస్థితులలో ఉన్నవారిని లోకంలో ఉన్నవారెవరూ పట్టించుకోరు. కాని సృష్టికర్తయైన దేవుడు వారికి తన సందేశాన్ని పంపాడు. ఇకపై వారు దేనికి భయపడనక్కరలేదని చెప్పాడు. వారి కోసం రక్షకుడొచ్చాడు గనుక వారు ధైర్యంగా బ్రతకొచ్చు.
వారికొక ఆనవాలు ఇయ్యబడింది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనియుండుట మీరు చూచెదరు. లోకరక్షకుడు పశువుల తొట్టెలో పుట్టడం ఆశ్చర్యమే. అవును అది నిజంగా అబ్బురమే. పశుల తొట్టెలో పరుండియున్న క్రీస్తు ప్రభువును గొర్రెల కాపరులే మొదట దర్శించుకున్నారు. హేరోదు అంతఃపురంలోనో మరో సంపన్న స్థలంలోనే క్రీస్తు ప్రభువు జన్మించియుంటే వారికి ఆ దర్శన భాగ్యం దొరికేది కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దీనులను ఆయన రక్షణతో అలంకరిస్తాడు. ఆయన్ను చూడాలనే ఆశ ఉంటే చాలు తన్ను తాను ప్రత్యక్షపరచుకొనుటకు దేవుడు ఎప్పుడూ సంసిద్ధుడే!
ప్రస్తుతకాలంలో బేత్లెహేము వెళ్తే యేసు పుట్టిన ప్రాంతంలో ఒక దేవాలయం ఉంది. దానిని చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. ప్రతి యేటా కోట్లాదిమంది ఆ దేవాలయాన్ని దర్శించి దానిలోపల క్రీస్తు పుట్టిన స్థలాన్ని చూసి ఆనంద పరవశంతో నిండిపోతారు. కాన్స్టాంటైన్ ద గ్రేట్ తల్లియైన సెయింట్ హెలెనా క్రీస్తు శకం 325లో యెరూషలేమును, బేత్లెహేమును దర్శించింది. ఆమె వెళ్లిన తరువాత బేత్లెహేములో చర్చి నిర్మాణ పనులు ప్రారంభించబడ్డాయి.
ఆ తదుపరి 339వ సంవత్సరం మే 31న దేవాలయం ప్రజల సందర్శనార్థం అందుబాటులోనికి వచ్చింది. ఆ తర్వాత సమరయుల తిరుగుబాటు సమయంలో చర్చి అగ్నిప్రమాదంలో పాక్షికంగా ధ్వంసమైంది. బహుశా క్రీస్తు శకం 529లో బైజాంటైన్ చక్రవర్తి జస్టినియన్ ద్వారా మరలా నిర్మించబడింది. ఈ దేవాలయానికి గొప్ప చరిత్ర ఉంది. విశాలమైన స్థలంలో నిర్మించబడిన ఈ గొప్ప దేవాలయానికి ఒకే ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది.
సుమారుగా ఇరవైఐదు అడుగుల పొడవున్న ఈ చర్చికి కేవలం నాలుగు అడుగుల ఎత్తు ఉన్న ప్రవేశ ద్వారం ఉంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ‘ఎవ్వరైనా క్రీస్తు ప్రభువు పుట్టిన స్థలాన్ని దర్శించాలనుకుంటే తలవంచి అహంకారాన్ని విడిచి నమస్కరించుకొంటూ లోపలికి ప్రవేశించాలి. దేవునిముందు నిలబడడానికి అహంకారం ఉపయోగపడదు దీనత్వం మాత్రమే ఉపకరిస్తుంది.
నాలుగవదిగా బేత్లెహేములో రిక్తునిగా యేసుక్రీస్తు జన్మించుట ద్వారా తన ప్రేమను వ్యక్తీకరించాడు. దేవుని ప్రేమ వర్ణనకు అందనిది. ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను’ (యోహాను 3:16). నిత్యజీవితంలో ప్రతి మనిషిలోనూ కొన్నివందల రకాల భావోద్వేగాలు ఉంటాయి. వాటిని సంతోషం, ప్రేమ, ఆశ్చర్యం, ఆవేశం, దుఃఖం, భయం, అసహ్యం మొదలైనవిగా విభజించవచ్చు. చిరాకు, కోపం, నిరాకరణ ఇవన్నీ ఆవేశాన్ని ప్రతిబింబించే చర్యలైతే విశ్రాంతి, సంతృప్తి, ఆనందం అనేవి సంతోషానికి సంబంధించినవి.
అయితే వీటన్నింటిలో మనకు ఎక్కువగా వినిపించేది, అనిపించేది ప్రేమ. పవిత్రమైన ఈ పదం ఈ రోజులలో చాలా ప్రమాదకరంగా మారిపోయింది. నేటి యువతకు ప్రేమ అనే మాటకు సరైన అర్థం తెలియడం లేదు. సినిమాలలో, సీరియల్స్లలో చూపిస్తున్న కొన్ని కథలను ప్రేమ అనుకోవడం సహజం అయిపోయింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణను, వ్యామోహాన్నే ప్రేమగా చిత్రీకరిస్తున్నారు. ప్రేమ పేరిట అనేక మోసాలు, వంచనలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి.
అయితే ప్రేమకు నిర్వచనం ఏమిటి? ఎవరు దానిని నిర్వచించారు? అని మానవుడు ఆలోచించగలిగితే పరమార్థాన్ని చేరుకుంటాడు. ప్రేమకు నిర్వచనాలు ఎవరెన్ని విధాలుగా చెప్పినా ఒకటి మాత్రం ఆలోచించదగినది. ఆచరణీయమైనది కూడా. ప్రేమ అంటే ఇతరులను బలి తీసుకోవడం కాదు, ఇతరుల కోసం బలైపోవడం అని నిరూపించాడు యేసుక్రీస్తు. ఈ అద్భుత సత్యాన్ని ఎవరైతే తమ జీవితంలో హృదయపూర్వకంగా గ్రహిస్తారో వారి జీవితం ఆనందమయం అవుతుంది. ఆదర్శప్రాయమవుతుంది.
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రేమను గూర్చి అనేక మాటలు రాయబడ్డాయి. ‘దేవుడు ప్రేమాస్వరూపి! దేవుడు తన ప్రేమను వెల్లడిపరచాడు. తానే మొదట మనలను ప్రేమించాడు’లాంటి మాటలన్నీ దేవుని ప్రేమ ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించేవే. ప్రేమిస్తున్నానని చెప్పుట మాత్రమే గాక ప్రేమను ఋజువు చేసిన ప్రేమమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు.
క్రిస్మస్ ఆచరించడమంటే ఎవరికి వారు ఆనందించడం కాదు. అనేకులకు ఆనందం పంచడం. కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆపన్న హస్తాన్ని అందించి, వారికి మనస్ఫూర్తిగా సహాయపడడం. త్యాగాన్ని ప్రేమను వేరువేరుగా మనం చూడలేము. నిరాశ, నిస్పృహలో ఉన్నవారిని భుజంతట్టి ప్రోత్సహించడం చేయగలిగితే క్రిస్మస్కు నిజమైన అర్థం ఉంటుంది.
సుప్రసిద్ధ క్రైస్తవ పాటల రచయిత చెట్టి భానుమూర్తి రాసిన అద్భుతమైన క్రిస్మస్ పాట దేవుని ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ‘రారే చూతము రాజసుతుడీ రేయి జననమాయెను. రాజులకు రారాజు మెస్సీయా రాజితంబగు తేజమదిగో. దూత గణములన్ దేరి చూడరే దైవవాక్కులన్ దెల్పగా. దేవుడే మన దీనరూపున ధరణి కరిగెనీ దినమున’
‘సాక్షి’ పాఠకులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
-డా.జాన్ వెస్లీ
ఆధ్యాత్మిక రచయిత, వక్త, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి